సాక్షి, అమరావతి: తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రతిపాదిస్తున్న ఫెడరల్ ఫ్రంట్ ఎక్కడుందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు. మంగళవారం ఉండవల్లిలోని గ్రీవెన్స్ హాలులో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై 10వ శ్వేతపత్రం విడుదల సంద ర్భంగా రాజకీయాలపైనా చంద్రబాబు మాట్లాడారు. నరేంద్ర మోదీ, అరుణ్ జైట్లీ ఆ ఫ్రంట్‌ను ప్రమోట్ చేస్తున్నారని ఆరోపించారు. నవీన్ పట్నాయక్, మమతా బెనర్జీ ఫెడరల్ ఫ్రంట్‌లో ఉన్నట్లు చెప్పకపోయినా వారు అందులో ఉన్నట్లు ప్రచారం చేస్తున్నారన్నారు. మహాకూటమి విఫలం కాలేదని, విఫలమైంది జైట్లీ, మోదీ అని వ్యాఖ్యానించారు. దేశానికి ఏం మేలు చేశారనే అంశంపై ప్రధాని మోదీ చర్చకు సిద్ధమా? అని చంద్రబాబు సవాల్ చేశారు. ప్రధానమంత్రి, బీజేపీ అధ్యక్షుడు అన్నిసార్లు తిరిగినా తెలంగాణాలో ఆ పార్టీ గెలిచింది ఒక్క సీటేనని, అయినా కేసీఆర్ గెలిచినందుకు వారు సంతోషపడుతున్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించకుండా ఏపీ మీడియాలో పెద్దఎత్తున ప్రకటనలు ఇచ్చి తమను రెచ్చగొట్టాలని, అవమానించాలని కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.
వృద్ధి రేటులో దేశాన్ని మించిపోయాం..
రెవెన్యూ పెంచుకోవడానికే అప్పులు చేశామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. తక్కువ వడ్డీ రేటుకే అప్పులు తీసుకున్నామన్నారు. లోటు లేని ఆర్థిక వ్యవస్థ ఎక్కడా ఉండదన్నారు. నాలుగేళ్లుగా 10.52 శాతం వృద్ధి రేటు సాధించామని, దేశ వృద్ధిరేటు 7.3 శాతం కాగా తెలంగాణ వృద్ధిరేటు 9.7 శాతం మాత్రమేనన్నారు. తెలంగాణ కంటే ఎక్కువ వేగవంతమైన వృద్ధి రేటు సాధించామన్నారు. 2013–14లో రూ.4.64 లక్షల కోట్లుగా ఉన్న ఆదాయం 2017–18 నాటికి రూ.8.04 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. నాలుగేళ్లలో వ్యవసాయం, అనుబంధ రంగాల వల్ల పెరిగిన ఆదాయం రూ.1.25 లక్షల కోట్లని (96 శాతం) చెప్పారు. నాలుగేళ్లలో తలసరి ఆదాయం సగటున రూ.59,154 (71 శాతం) పెరిగిందని తెలిపారు. పన్నుల ద్వారా ఆదాయం 2014–15లో రూ.38,038 కోట్లు రాగా 2017–18 నాటికి రూ.53,300 కోట్లకు పెరిగిందన్నారు.
శ్వేత పత్రాలపై జన్మభూమిలో చర్చిస్తాం..
హైదరాబాద్ నుంచి అమరావతికి కార్యాలయాల తరలింపు, ఉద్యోగుల వేతన స్కేళ్ల రివిజన్, 2015–16 నుంచి పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు పెన్షన్ల చెల్లింపు, సంక్షేమ పథకాలవల్ల రెవెన్యూ వ్యయం పెరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ వైద్యసేవ కింద గరిష్ట పరిమితిని రూ.5 లక్షలకు పెంచామన్నారు. త్వరలో ప్రతి ఇంటికీ ఒక స్మార్ట్ ఫోన్ ఇస్తామని, విజ్ఞానాన్ని మొబైల్ ద్వారా అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుందన్నారు. జన్మభూమి తర్వాత ప్రతి గ్రామానికి విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని, పండుగ తర్వాత రాష్ట్ర స్థాయిలో 2019–24 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని తెలిపారు. శ్వేతపత్రాలపై జన్మభూమిలో చర్చకు పెడతామన్నారు.
‘బీటీఏ’ డైరీని ఆవిష్కరించిన సీఎం
సాక్షి, అమరావతి బ్యూరో: బహుజన టీచర్స్ అసోసియేషన్ (బీటీఏ) రూపొందించిన 2019 డైరీని ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ఉండవల్లిలోని ప్రజావేదికలో ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు చేబ్రోలు శరత్‌చంద్ర, ప్రధాన కార్యదర్శి పి ఆదినారాయణ, అదనపు ప్రధాన కార్యదర్శి బట్టు వెంకయ్య, ఉపాధ్యాక్షుడు మీర్జా అబుతురాబ్ ఆలీ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment