వక్ఫ్ ఆధ్వర్యంలోని ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి అందజేసిన...........
► వక్ఫ్’ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచన
► తన మాట పట్టించుకోలేదని మండలి చైర్మన్ కినుకు
సాక్షి, బెంగళూరు : వక్ఫ్ ఆధ్వర్యంలోని ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి అందజేసిన నివేదికను వెంటనే శాసనమండలిలో ప్రవేశపెట్టాలని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా రాష్ట్ర ప్రబుత్వానికి సూచించారు. అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా శాసనమండలి చైర్మన్ శంకరమూర్తి మూడు సార్లు రూలింగ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వెంటనే మీరు జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ పైమేరకు ప్రభుత్వానికి సూచనలు చేశారు.
రాజ్యాంగ పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ నివేదికను వెంటనే మండలిలో ప్రవేశపెట్టమంటూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇదే సందర్భంలో శాసనమండలి కార్యకలాపాలకు చైర్మన్ శంకరమూర్తి బుధవారం గైర్హాజరయ్యారు. అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా తాను మూడు సార్లు రూలింగ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం తన మాటను పట్టించుకోలేదని చైర్మన్ శంకరమూర్తి కినుక వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన శివమొగ్గకు వెళ్లిపోయారని తెలుస్తోంది.