Wakf assets
-
ఇదెక్కడి న్యాయం
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్‌బోర్డులో కంచె చేనుమేస్తోంది. వందల కోట్ల విలువైన దేవుడి (వక్ఫ్) భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లీజుల పేరుతో స్థలాలను కాజేస్తున్నారు. దర్గా, స్మశాన వాటిక స్థలాలను సైతం వదలడం లేదు. బాహాటంగా ఆక్రమణల పర్వం కొనసాగుతున్న వక్ఫ్‌బోర్డు పాలక మండలి కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తుదని విమర్శలు వినవస్తున్నాయి. వాస్తవం గా వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకా రం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమ్తింత తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, స్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసే వారు. ఈ లాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. దర్గాకు సంబంధించిన భూములపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిసినా... కేవలం మూడు నివాసాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం వక్ఫ్‌బోర్డు ద్వంద నీతికి అద్దంపడుతోంది. ఇదీ కథ.. సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గాకు సర్వే నెంబర్ 255/1, 255/2, 255/3, 255/4, 255/5, 255/6 లో సుమారు 28 ఎకరాల 29 గంటల భూమి ముంతఖబైæ ఉంది. అందులో 11.21 ఎకరాల భూమి సమీపంలోని హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గాకు చెందుతుంది. నిజాం ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వద్ద నవాబ్ జీవన్ యార్ జంగ్, అబ్బాస్ అలీ, ఇబ్రాహీం అలీ ఖాన్ అనే వ్యక్తులు సదరు భూమిని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నవాబ్ జీవన్ యార్ జంగ్ హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను పర్యవేక్షించేవారు. 1958లో అతను మృతి చెందగా, 1968 ఆయన ఇద్దరు భార్యల పిల్లలు ఆస్తుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో దర్గా భూములను సైతం స్వంత ఆస్తులుగా పరిగణించడంతో ఆరు ఎకరాల భూమి దక్కింది. దీంతో ఆ రెండు కుటుంబాలు కోర్టు తీర్పు ఆధారంగా నూరుల్Š అలీ రుపాణీ, మరో ఇద్దరికి భూములు విక్రయించి పాకిస్తాన్ వెళ్లిపోయారు. భూమిని కొనుగోలు చేసిన నూరుల్ అలీ రుపాణీ జీవన్ యార్జంగ్ కాలనీ పేరుతో బిల్డర్ ద్వారా సుమారు 180 నుంచి 200 వరకు ప్లాట్లు చేసి విక్రయించారు. 1978 నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో నిర్మాణాలు జరగడంతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టడాలకు 852 నుంచి 866/జీ వరకు ఇంటి నెంబర్లు కేటాయించింది. జీవన్యార్జంగ్ కాలనీలోనే ఉంటున్న అల్వీ కుటుంబం హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను చూసేది. ఇదిలా ఉండగా 2009లో వక్ఫ్‌బోర్డు దర్గాకు ముతవల్లీని నియమించగా, సదరు ముతవల్లీ దర్గాకు మిగిలిన ఉన్న భూమి, స్మశాన వాటిక వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడంతో అల్వీ కుటుంబం అడ్డుకుంది. దీనిపై వక్ఫ్‌బోర్డుకు ఫిర్యాదు చేయడంతో దర్గా భూములపై సర్వే నిర్వహించారు. 2010, 2014, 2016లో మూడుసార్లు సర్వే నిర్వహించిన అధికారులు జీవన్ యార్ జంగ్ కాలనీలో సుమారు 11.21 ఎకరాల దర్గా భూమి అన్యాక్రాంతమై కట్టడాలు వెలిసినట్లు నివేదిక అందజేశారు. మూడు ఇళ్లకు నోటీసులు జీవన్ యార్ జంగ్ కాలనీలోని 11.21 ఎకరాల భూమి లో ఇంటి నెంబర్ 16–2–853 నుంచి 16–2–866.జీ వరకు సుమారు 180 నుంచి 200 వరకు గృహాలు ఉన్నాయి. వక్ఫ్ సర్వేలో సైతం మొత్తం కట్టడాలు వక్ఫ్ భూమిలోనే ఉన్నట్లు వెల్లడైనా కేవలం మూడు గృహాలకు మాత్రమే వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. అల్వీ కుటుంబానికి సంబంధించి మహ్మద్ ముస్తాఫాకు చెందిన ఇంటి నెంబర్ 16–2–866/ఎఫ్ (186 చదరపుగజం), మరో ఇంటి నెంబర్ 16–2–866/1( 152 చదరపు గజం), ఆయన సోదరుడు మహ్మద్ ముజ్తఫాకు చెందిన ఇంటినెంబర్ 16–2–886/ఎఫ్/5(200 చదరపు గజం)లకు నోటీసులు అందజేయడమేగాక సదరు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు జిల్లా రిజిస్టార్కు మూడు ఇళ్ల దస్తావేజులను నిషేధిత జాబితాలో చేరుస్తూ వక్ఫ్‌బోర్డు సీఈవో లేఖ రాశారు. కాగా, వక్ఫ్‌భూమిగా గుర్తించిన స్థలాల్లో పెద్ద ఎత్తున కట్టడాలు ఉన్నా కేవలం ఒకే కుటుంబానికి చెందిన మూడు కట్టడాలకే నోటీసులు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై సదరు అల్వీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, కేంద్ర వక్ఫ్‌బోర్డుకు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కక్ష సాధిస్తున్నారు కక్షసాధింపు చర్యగా టార్గెట్ చేశారు. చట్టబద్దంగా నూరుల్ అలీ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. 1984లో రిజిస్ట్రేషన్ జరిగింది. లింక్ దస్తావేజులు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు ఆధారంగా యార్ జంగ్ కుటుంబం నూరుల్ అలీ, ఖాజా మొయినోద్దీక్లకు విక్రయించారు. ఖాజామొయినొద్దీన్ నుంచి నూరుల్ అలీ కొనుగోలు చేయగా, ఆయన నుంచి మేము కొనుగోలు చేశాం, పక్క ఇంటి నంబర్లను వదలి మా కుటుంబానికి చెందిన మూడు ఇళ్లకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. నిజంగా వక్ఫ్ బోర్డు స్థలం అయితే అన్ని గృహాలకు వర్తించాలి. – మహ్మద్ ముస్తాఫా అలీ, జీవన్ యార్ జంగ్ కాలనీ, సైదాబాద్ -
వక్ఫ్ ఆస్తులు హాంఫట్!
సాక్షి, హైదరాబాద్ : వందల కోట్ల వక్ఫ్ ఆస్తులు స్వాహా అవుతున్నాయి. చట్టాలు, నోటీసులు కాగితాలకే పరిమితవుతున్నాయి. ఏళ్ల తరబడి కారు చౌకగా లీజు, అద్దెకుంటున్న వారే ఆస్తుల్ని విక్రయించి దిగమింగుతున్నారు. కంచె చేను మేస్తున్న చందంగా.. ఆస్తులను పర్యవేక్షించాల్సిన అధికారులు వారికే వంతపాడుతున్నారు. వక్ఫ్ బోర్డు పాలక మండలి సైతం కళ్లున్న కబోదిలా మారిపోయింది. ఆస్తులను లీజులు, అద్దెపై అనుభవిస్తున్న వారు కాలక్రమేణా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వాటికి టెండర్ పెడుతున్నారు. ఆస్తుల విక్రయాలను వక్ఫ్ ట్రిబ్యునల్ తప్పు పడుతూ తీర్పులు వెల్లడిస్తున్నా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ బోర్డు పాలక వర్గం, అధికారులు ఏళ్లు గడిచినా ఆ మధ్యంతర ఉత్తర్వులు ఉపసంహరించేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం. 11 ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్తర్వులు వక్ఫ్ బోర్టుకు కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులపై పట్టింపే లేకుండా పోయింది. సుమారు 56 కోట్ల విలువగల ఖాళీ స్థలంపై పదకొండేళ్లుగా మధ్యంతర ఉత్తర్వులు అలాగే కొనసాగుతున్నాయి. రెండేళ్ల క్రితం సనత్‌నగర్‌లోని జెక్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇదే స్థలాన్ని కాలనీ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్‌కు అద్దెకు ఇవ్వాలని వక్ఫ్ బోర్డు సీఈవోకు దరఖాస్తు చేసుకుంది. దీంతో బోర్డు అధికారులు కాలనీకి కేటాయించేందుకు స్థలంపై కబ్జాలో ఉన్న వ్యక్తికి మే 2016లో నోటీసు జారీ చేసి ఖాళీ చేయాలని సూచించారు. కానీ ఆయన వక్ఫ్ ట్రిబునల్ తీర్పుపై స్టే ఆర్డర్ ఉందని బదులిచ్చారు. మరోవైపు వక్ఫ్ బోర్డు సిఫార్సు మేరకు కిందటేడాది ఏప్రిల్ 19న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ.. ఈ 2,266 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని నెలకు రూ.20 వేల అద్దె చొప్పున మూడేళ్ల కాలపరిమితితో కాలనీకి కేటాయించింది. అదే ఏడాది జూన్ 5న వక్ఫ్ బోర్డు సీఈవో మెమో జారీ చేస్తూ.. యుటిలిటీ చార్జీలు రూ.25 వేలతోపాటు డిపాజిట్ కింద రూ.1.50 వేలు చెల్లించాలని సూచించారు. వెంటనే సదరు కాలనీ వాసులు యూటిలిటీ చార్జీలతో పాటు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారు. అయినా ఆ ఖాళీ స్థలాన్ని అద్దె ప్రాతిపదిక దక్కించుకున్న కబ్జాదారుల నుంచి కాలనీవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖాళీ స్థలంపై కోర్టు స్టే కొనసాగుతుండటంతో కాలనీ బాధ్యులు వక్ఫ్ బోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు పాలక మండలి, అధికారులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా స్టే ఉపసంహరించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిగో అక్రమాలకు మచ్చుతునక హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ జెక్ కాలనీలో అల్లావుద్దీన్ కుటుంబానికి చెందిన నాలుగు క్వార్టర్స్ (నివాస సముదాయాలు) ఐదు దశాబ్దాల క్రితం వక్ఫ్ (అల్లాహ్‌కు ఇచ్చేయడం) అయ్యాయి. అప్పట్నుంచీ మక్కా మదీనా అల్లావుద్దీన్ వక్ఫ్ వాటి అద్దె, ఆలనాపాలనా పర్యవేక్షిస్తూ వస్తోంది. సుమారు 2,200 చదరపు అడుగుల భూమి గల క్వార్టర్ నంబర్ 50/ఏ (7–2–1758), క్వార్టర్ నంబర్ 13/ఏ (7–2–1792), క్వార్టర్ నంబర్ 43/ఏ (7–2–1762) శిథిలావస్థకు గురై కూలిపోయాయి. ప్రస్తుతం ఖాళీ స్థలంపై కారుచౌకగా అద్దె వస్తోంది. 2,266 చదరపు అడుగుల భూమి గల నాలుగో క్వార్టర్ నంబర్ 27/ఏ(7–2–1778) కూడా నేలమట్టమైంది. ఆయితే ఈ క్వార్టర్ అద్దెదారు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. దీంతో మక్కా మదీనా అల్లావుద్దీన్ వక్ఫ్ సొసైటీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ స్థలం కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో అతడు 2007 హైకోర్టును ఆశ్రయించడంతో ట్రిబ్యునల్ తీర్పుపై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. -
హాంఫట్
►కబ్జాదారుల గుప్పిట్లో వక్ఫ్ ఆస్తులు 8,100 ఎకరాలు ►అన్యాక్రాంతం విలువ రూ.500 కోట్ల పైమాటే ►పాప కార్యంలో ముతవల్లులు, ముజావర్ల భాగస్వామ్యం ►వక్ఫ్ బోర్డును వేధిస్తున్న సిబ్బంది కొరత జిల్లాలో వక్ఫ్ ఆస్తులకు రక్షణ కరువైంది. మసీదు, ఈద్గా, దర్గాల నిర్వహణ, పరిరక్షణ కోసం కేటాయించిన భూములు అక్రమార్కుల గుప్పిట్లో చిక్కుకున్నాయి. వేలాది ఎకరాలను తమ ఆధీనంలో పెట్టుకొని ఏళ్ల తరబడి అనుభవిస్తున్నారు. వీటి విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుంది. అన్యాక్రాంత భూములను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోంది. సిబ్బంది కొరత కారణంగా ఆస్తులపై వక్ఫ్‌బోర్డు పర్యవేక్షణ కొరవడింది. ఇదే అదనుగా భూకబ్జాదారులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ భూములను తమ పేరిట రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు అడ్డదారులు తొక్కుతున్నారు. కర్నూలు (రాజ్‌విహార్) : ఉమ్మడి రాష్ట్రాల్లో హైదరాబాద్ తరువాత అత్యధికంగా ముస్లింలు ఉన్న జిల్లా కర్నూలు. ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక వక్ఫ్ ఆస్తులు ఉన్నది కూడా ఈ జిల్లాలోనే. మసీదులు, ఈద్గా, దర్గాల నిర్వహణ కోసం నాడు పెద్దలు తమ భూములు, స్థలాలను ఇచ్చారు. వాటిని ఆయా సంస్థల పేరుతో బోర్డుకు స్వాధీనం చేశారు. వాటిని బోర్డు తమ భూములుగా పేర్కొంటూ వివరాలను గెజిట్‌లో పొందుపర్చింది. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 1,104 సంస్థలు వక్ఫ్‌బోర్డు పరిధిలో ఉన్నాయి. వీటిలో 741 సంస్థలు ఆస్తులు కలిగి ఉన్నాయి. వీటి పేర్లతో 22,599.89 ఎకరాల భూములు గెజిట్‌లో నమోదయ్యాయి. మరో పది వేల ఎకరాలు నమోదు కాలేదు. గెజిట్‌లో ఉన్న 3,099.35 ఎకరాలతో పాటు గెజిట్‌లో లేని మరో ఐదు వేల ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయి. కోర్టులకెళ్లడంతో 639.84 ఎకరాలను బోర్డు కోల్పోయింది. అన్యాక్రాంత ఆస్తుల విలువ రూ.500 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. కఠిన చట్టాలున్నా.. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం కఠిన చట్టాలున్నా అక్రమార్కుల ఆగడాలు మాత్రం కొనసాగుతున్నాయి. వక్ఫ్ యాక్ట్ 52(1) అమెండ్మెంట్ 2013 ప్రకారం ఈ ఆస్తులు కొన్న, అమ్మిన వారిపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలి. కానీ ఇప్పటి వరకు 50లోపే కేసులు పెట్టినట్లు తెలుస్తోంది. ఒక్కరిపైనా చార్జిషీట్ దాఖలు కాలేదు. స్థలాలు అమ్ముతున్న ముతవల్లులు, ముజావర్లపై చర్యలు తీసుకునేందుకు అధికారులు ఆసక్తి చూపడం లేదనే విమర్శలున్నాయి. మసీదులు, దర్గాల నిర్వహణ చూసే ముతవల్లులు, ముజావర్లు ఆ భూములను సాగుచేసుకుంటూ వచ్చిన ఆదాయంలో కొంత మొత్తాన్ని (వక్ఫ్ ఫండ్) ప్రతియేటా బోర్డుకు చెల్లించాలి. అయితే.. కొందరు సొంత భూముల్లా భావించి అమ్మేసుకుంటున్నారు. ప్రస్తుతమున్న భూముల నుంచి ఏటా రూ.25 లక్షలకు పైగా వక్ఫ్ఫండ్ రావాల్సి ఉండగా, రూ.12 లక్షల్లోపే వస్తున్నట్లు సమాచారం. వేధిస్తున్న సిబ్బంది కొరత వక్ఫ్‌బోర్డులో సిబ్బంది కొరత వేధిస్తోంది. రూ.వందల కోట్ల విలువైన వేలాది ఎకరాల భూములున్న ఈ జిల్లాలో కేవలం ఇద్దరితో కాలం గడుపుతున్నారు. ఇక ఇన్స్పెక్టర్, ఒక అటెండర్ మాత్రమే ఉండడంతో ఆస్తులపై పర్యవేక్షణ కొరవడింది. విధి నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించిన ఇద్దరు ఇన్స్పెక్టర్లపై ఇటీవల సస్పెన్షన్ వేటు పడింది. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా నెలన్నరకు పైగా కార్యాలయానికి దూరంగా ఉన్న అజీమ్‌తో పాటు ఇష్టానుసారం విధులకు హాజరవుతున్న అల్తాఫ్‌ను సస్పెండ్ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆక్రమణకు గురైన భూముల వివరాలు ► కర్నూలు మండలం దిన్నేదేవరపాడు గ్రామం సర్వే నంబర్–19లో 59.59 ఎకరాల భూమి 20ఏళ్ల క్రితం ఆక్రమణకు గురైంది. ఇప్పుడు దీని విలువ రూ.40 కోట్లకు పైమాటే. ► కర్నూలు నగర శివారులోని జొహరాపురం రోడ్డులో సర్వే నంబర్లు 142, 154, 155, 162లో పాత బస్టాండ్‌లోని బుడాన్ఖాన్ మసీదుకు చెందిన 60 ఎకరాలు అన్యాక్రాంతమైంది. దీని విలువ రూ.35కోట్లకు పైగా ఉంటుంది. కంచే చేను మేసిన చందంగా ఓ రిటైర్డు తహశీల్దారు, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగి హస్తం ఉందని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. ►కర్నూలు గ్రామ సర్వే నంబర్ –62లో 5.32 ఎకరాల భూమి ఆక్రమణకు గురైంది. ఇందులో పశువుల షెడ్డు ఏర్పాటు చేశారు. ► మునగాలపాడులోని సర్వే నంబరు 93, 146లో 19 ఎకరాలు ఆక్రమణకు గురైంది. దీని విలువ రూ. 5 కోట్ల వరకు ఉంటుంది. ►కల్లూరు పరిధి, కలెక్టరేట్ వెనుకాల ఉన్న రాయలసీమ క్రిష్టియన్ కళాశాల వద్ద సర్వే నంబరు 922లో 7.60 ఎకరాల భూమి అక్రమార్కుల గుప్పిట్లో ఉంది. దీని విలువ రూ.8కోట్లకు పైమాటే. నాన్ బెయిలబుల్ కేసులు పెడతాం – ఇనాయత్, వక్ఫ్‌బోర్డు ఇన్స్పెక్టర్ వక్ఫ్ ఆస్తులను అనధికారికంగా అనుభవిస్తుంటే స్వచ్ఛందంగా వచ్చి స్వాధీనపర్చాలి. లేనిపక్షంలో ముందుగా నోటీసులిస్తాం. స్పందించకపోతే వక్ఫ్ చట్టం ప్రకారం నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి జైలుకు పంపుతాం. ఇప్పటివరకు 50కి పైగా కేసులు పెట్టాం. ఈ విషయాన్ని ఆక్రమణదారులు గమనించాలి. -
ఆ నివేదికను ప్రవేశపెట్టండి
► వక్ఫ్’ ఆస్తులపై రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ సూచన ► తన మాట పట్టించుకోలేదని మండలి చైర్మన్ కినుకు సాక్షి, బెంగళూరు : వక్ఫ్ ఆధ్వర్యంలోని ఆస్తులకు సంబంధించిన అవకతవకలపై అన్వర్ మానప్పాడి నేతృత్వంలోని సమితి అందజేసిన నివేదికను వెంటనే శాసనమండలిలో ప్రవేశపెట్టాలని గవర్నర్ వజుభాయ్ రుడాభాయ్ వాలా రాష్ట్ర ప్రబుత్వానికి సూచించారు. అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా శాసనమండలి చైర్మన్ శంకరమూర్తి మూడు సార్లు రూలింగ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, వెంటనే మీరు జోక్యం చేసుకోవాలని బీజేపీ నేతలు గవర్నర్‌ను కలిసి విన్నవించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ పైమేరకు ప్రభుత్వానికి సూచనలు చేశారు. రాజ్యాంగ పరమైన ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఈ నివేదికను వెంటనే మండలిలో ప్రవేశపెట్టమంటూ గవర్నర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. ఇదే సందర్భంలో శాసనమండలి కార్యకలాపాలకు చైర్మన్ శంకరమూర్తి బుధవారం గైర్హాజరయ్యారు. అన్వర్ మానప్పాడి నివేదికను మండలిలో ప్రవేశపెట్టాల్సిందిగా తాను మూడు సార్లు రూలింగ్ ఇచ్చినప్పటికీ ప్రభుత్వం ఏమాత్రం తన మాటను పట్టించుకోలేదని చైర్మన్ శంకరమూర్తి కినుక వహించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆయన శివమొగ్గకు వెళ్లిపోయారని తెలుస్తోంది.