సనత్‌నగర్‌లో వక్ఫ్‌బోర్డుకు చెందిన ఖాళీ స్థలం
సాక్షి, హైదరాబాద్ : వందల కోట్ల వక్ఫ్ ఆస్తులు స్వాహా అవుతున్నాయి. చట్టాలు, నోటీసులు కాగితాలకే పరిమితవుతున్నాయి. ఏళ్ల తరబడి కారు చౌకగా లీజు, అద్దెకుంటున్న వారే ఆస్తుల్ని విక్రయించి దిగమింగుతున్నారు. కంచె చేను మేస్తున్న చందంగా.. ఆస్తులను పర్యవేక్షించాల్సిన అధికారులు వారికే వంతపాడుతున్నారు. వక్ఫ్ బోర్డు పాలక మండలి సైతం కళ్లున్న కబోదిలా మారిపోయింది.
ఆస్తులను లీజులు, అద్దెపై అనుభవిస్తున్న వారు కాలక్రమేణా తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో వాటికి టెండర్ పెడుతున్నారు. ఆస్తుల విక్రయాలను వక్ఫ్ ట్రిబ్యునల్ తప్పు పడుతూ తీర్పులు వెల్లడిస్తున్నా.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను అడ్డుపెట్టుకొని అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. వక్ఫ్ బోర్డు పాలక వర్గం, అధికారులు ఏళ్లు గడిచినా ఆ మధ్యంతర ఉత్తర్వులు ఉపసంహరించేందుకు ప్రయత్నించకపోవడం గమనార్హం.
11 ఏళ్లుగా కొనసాగుతున్న ఉత్తర్వులు
వక్ఫ్ బోర్టుకు కోర్టు కేసులు, మధ్యంతర ఉత్తర్వులపై పట్టింపే లేకుండా పోయింది. సుమారు 56 కోట్ల విలువగల ఖాళీ స్థలంపై పదకొండేళ్లుగా మధ్యంతర ఉత్తర్వులు అలాగే కొనసాగుతున్నాయి. రెండేళ్ల క్రితం సనత్‌నగర్‌లోని జెక్ కాలనీ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఇదే స్థలాన్ని కాలనీ చిల్డ్రన్ ప్లే గ్రౌండ్‌కు అద్దెకు ఇవ్వాలని వక్ఫ్ బోర్డు సీఈవోకు దరఖాస్తు చేసుకుంది. దీంతో బోర్డు అధికారులు కాలనీకి కేటాయించేందుకు స్థలంపై కబ్జాలో ఉన్న వ్యక్తికి మే 2016లో నోటీసు జారీ చేసి ఖాళీ చేయాలని సూచించారు.
కానీ ఆయన వక్ఫ్ ట్రిబునల్ తీర్పుపై స్టే ఆర్డర్ ఉందని బదులిచ్చారు. మరోవైపు వక్ఫ్ బోర్డు సిఫార్సు మేరకు కిందటేడాది ఏప్రిల్ 19న రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ.. ఈ 2,266 చదరపు అడుగుల ఖాళీ స్థలాన్ని నెలకు రూ.20 వేల అద్దె చొప్పున మూడేళ్ల కాలపరిమితితో కాలనీకి కేటాయించింది. అదే ఏడాది జూన్ 5న వక్ఫ్ బోర్డు సీఈవో మెమో జారీ చేస్తూ.. యుటిలిటీ చార్జీలు రూ.25 వేలతోపాటు డిపాజిట్ కింద రూ.1.50 వేలు చెల్లించాలని సూచించారు. వెంటనే సదరు కాలనీ వాసులు యూటిలిటీ చార్జీలతో పాటు డిపాజిట్ మొత్తాన్ని చెల్లించారు.
అయినా ఆ ఖాళీ స్థలాన్ని అద్దె ప్రాతిపదిక దక్కించుకున్న కబ్జాదారుల నుంచి కాలనీవాసులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఖాళీ స్థలంపై కోర్టు స్టే కొనసాగుతుండటంతో కాలనీ బాధ్యులు వక్ఫ్ బోర్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. వక్ఫ్ బోర్డు పాలక మండలి, అధికారులు మాత్రం ఏళ్లు గడుస్తున్నా స్టే ఉపసంహరించేందుకు ఎలాంటి చర్యలూ చేపట్టకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది.
ఇదిగో అక్రమాలకు మచ్చుతునక
హైదరాబాద్ నగరంలోని సనత్‌నగర్ జెక్ కాలనీలో అల్లావుద్దీన్ కుటుంబానికి చెందిన నాలుగు క్వార్టర్స్ (నివాస సముదాయాలు) ఐదు దశాబ్దాల క్రితం వక్ఫ్ (అల్లాహ్‌కు ఇచ్చేయడం) అయ్యాయి. అప్పట్నుంచీ మక్కా మదీనా అల్లావుద్దీన్ వక్ఫ్ వాటి అద్దె, ఆలనాపాలనా పర్యవేక్షిస్తూ వస్తోంది. సుమారు 2,200 చదరపు అడుగుల భూమి గల క్వార్టర్ నంబర్ 50/ఏ (7–2–1758), క్వార్టర్ నంబర్ 13/ఏ (7–2–1792), క్వార్టర్ నంబర్ 43/ఏ (7–2–1762) శిథిలావస్థకు గురై కూలిపోయాయి.
ప్రస్తుతం ఖాళీ స్థలంపై కారుచౌకగా అద్దె వస్తోంది. 2,266 చదరపు అడుగుల భూమి గల నాలుగో క్వార్టర్ నంబర్ 27/ఏ(7–2–1778) కూడా నేలమట్టమైంది. ఆయితే ఈ క్వార్టర్ అద్దెదారు గుట్టుచప్పుడు కాకుండా ఖాళీ స్థలాన్ని విక్రయించి సొమ్ము చేసుకున్నాడు. దీంతో మక్కా మదీనా అల్లావుద్దీన్ వక్ఫ్ సొసైటీ ట్రిబ్యునల్‌ను ఆశ్రయించింది. దీంతో ట్రిబ్యునల్ స్థలం కొనుగోలుదారుడికి వ్యతిరేకంగా తీర్పునిచ్చింది. దీంతో అతడు 2007 హైకోర్టును ఆశ్రయించడంతో ట్రిబ్యునల్ తీర్పుపై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment