హజరత్ సయ్యద్ బాద్‌షా మహజూద్ సాహెబ్ దర్గా
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్‌బోర్డులో కంచె చేనుమేస్తోంది. వందల కోట్ల విలువైన దేవుడి (వక్ఫ్) భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లీజుల పేరుతో స్థలాలను కాజేస్తున్నారు. దర్గా, స్మశాన వాటిక స్థలాలను సైతం వదలడం లేదు. బాహాటంగా ఆక్రమణల పర్వం కొనసాగుతున్న వక్ఫ్‌బోర్డు పాలక మండలి కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తుదని విమర్శలు వినవస్తున్నాయి. వాస్తవం గా వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు.
ముస్లిం సంప్రదాయం ప్రకా రం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమ్తింత తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, స్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసే వారు. ఈ లాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. దర్గాకు సంబంధించిన భూములపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిసినా... కేవలం మూడు నివాసాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం వక్ఫ్‌బోర్డు ద్వంద నీతికి అద్దంపడుతోంది.
ఇదీ కథ..
సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గాకు సర్వే నెంబర్ 255/1, 255/2, 255/3, 255/4, 255/5, 255/6 లో సుమారు 28 ఎకరాల 29 గంటల భూమి ముంతఖబైæ ఉంది. అందులో 11.21 ఎకరాల భూమి సమీపంలోని హజరత్ సయ్యద్ బాద్‌షా మహజూద్ సాహెబ్ దర్గాకు చెందుతుంది. నిజాం ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ డిపార్ట్‌మెంట్ వద్ద నవాబ్ జీవన్ యార్ జంగ్, అబ్బాస్ అలీ, ఇబ్రాహీం అలీ ఖాన్ అనే వ్యక్తులు సదరు భూమిని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నవాబ్ జీవన్ యార్ జంగ్ హజరత్ సయ్యద్ బాద్‌షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను పర్యవేక్షించేవారు. 1958లో అతను మృతి చెందగా, 1968 ఆయన ఇద్దరు భార్యల పిల్లలు ఆస్తుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో దర్గా భూములను సైతం స్వంత ఆస్తులుగా పరిగణించడంతో ఆరు ఎకరాల భూమి దక్కింది.
దీంతో ఆ రెండు కుటుంబాలు కోర్టు తీర్పు ఆధారంగా నూరుల్Š అలీ రుపాణీ, మరో ఇద్దరికి భూములు విక్రయించి పాకిస్తాన్ వెళ్లిపోయారు. భూమిని కొనుగోలు చేసిన నూరుల్ అలీ రుపాణీ జీవన్ యార్‌జంగ్ కాలనీ పేరుతో బిల్డర్ ద్వారా సుమారు 180 నుంచి 200 వరకు ప్లాట్లు చేసి విక్రయించారు. 1978 నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో నిర్మాణాలు జరగడంతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టడాలకు 852 నుంచి 866/జీ వరకు ఇంటి నెంబర్లు కేటాయించింది. జీవన్‌యార్‌జంగ్ కాలనీలోనే ఉంటున్న అల్వీ కుటుంబం హజరత్ సయ్యద్ బాద్‌షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను చూసేది. ఇదిలా ఉండగా 2009లో వక్ఫ్‌బోర్డు దర్గాకు ముతవల్లీని నియమించగా, సదరు ముతవల్లీ దర్గాకు మిగిలిన ఉన్న భూమి, స్మశాన వాటిక వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడంతో అల్వీ కుటుంబం అడ్డుకుంది. దీనిపై వక్ఫ్‌బోర్డుకు ఫిర్యాదు చేయడంతో దర్గా భూములపై సర్వే నిర్వహించారు. 2010, 2014, 2016లో మూడుసార్లు సర్వే నిర్వహించిన అధికారులు జీవన్ యార్ జంగ్ కాలనీలో సుమారు 11.21 ఎకరాల దర్గా భూమి అన్యాక్రాంతమై కట్టడాలు వెలిసినట్లు నివేదిక అందజేశారు.
మూడు ఇళ్లకు నోటీసులు
జీవన్ యార్ జంగ్ కాలనీలోని 11.21 ఎకరాల భూమి లో ఇంటి నెంబర్ 16–2–853 నుంచి 16–2–866.జీ వరకు సుమారు 180 నుంచి 200 వరకు గృహాలు ఉన్నాయి. వక్ఫ్ సర్వేలో సైతం మొత్తం కట్టడాలు వక్ఫ్ భూమిలోనే ఉన్నట్లు వెల్లడైనా కేవలం మూడు గృహాలకు మాత్రమే వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. అల్వీ కుటుంబానికి సంబంధించి మహ్మద్ ముస్తాఫాకు చెందిన ఇంటి నెంబర్ 16–2–866/ఎఫ్ (186 చదరపుగజం), మరో ఇంటి నెంబర్ 16–2–866/1( 152 చదరపు గజం), ఆయన సోదరుడు మహ్మద్ ముజ్తఫాకు చెందిన ఇంటినెంబర్ 16–2–886/ఎఫ్/5(200 చదరపు గజం)లకు నోటీసులు అందజేయడమేగాక సదరు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు జిల్లా రిజిస్టార్‌కు మూడు ఇళ్ల దస్తావేజులను నిషేధిత జాబితాలో చేరుస్తూ వక్ఫ్‌బోర్డు సీఈవో లేఖ రాశారు. కాగా, వక్ఫ్‌భూమిగా గుర్తించిన స్థలాల్లో పెద్ద ఎత్తున కట్టడాలు ఉన్నా కేవలం ఒకే కుటుంబానికి చెందిన మూడు కట్టడాలకే నోటీసులు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై సదరు అల్వీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, కేంద్ర వక్ఫ్‌బోర్డుకు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం.
కక్ష సాధిస్తున్నారు
కక్షసాధింపు చర్యగా టార్గెట్ చేశారు. చట్టబద్దంగా నూరుల్ అలీ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. 1984లో రిజిస్ట్రేషన్ జరిగింది. లింక్ దస్తావేజులు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు ఆధారంగా యార్ జంగ్ కుటుంబం నూరుల్ అలీ, ఖాజా మొయినోద్దీక్‌లకు విక్రయించారు. ఖాజామొయినొద్దీన్ నుంచి నూరుల్ అలీ కొనుగోలు చేయగా, ఆయన నుంచి మేము కొనుగోలు చేశాం, పక్క ఇంటి నంబర్లను వదలి మా కుటుంబానికి చెందిన మూడు ఇళ్లకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. నిజంగా వక్ఫ్ బోర్డు స్థలం అయితే అన్ని గృహాలకు వర్తించాలి. – మహ్మద్ ముస్తాఫా అలీ, జీవన్ యార్ జంగ్ కాలనీ, సైదాబాద్
Comments
Please login to add a commentAdd a comment