Cemetery places
-
చితి నుంచే నీళ్లడిగిన అవ్వ!
సేలం: అనారోగ్యంతో మృతి చెందినట్టు భావించి అంత్యక్రియలు చేస్తున్న సమయంలో అవ్వ బతికిన ఘటన తిరుచ్చిలో కలకలం రేపింది. వివవారు.. తిరుచ్చి జిల్లా మనప్పారై సమీపంలో మరుంగాపురి సమీపంలోని కరుమలై సురంగంపట్టి గ్రామానికి చెందిన వ్యక్తి పంపైయ్యన్ (72). ఇతని భార్య చిన్నమ్మాల్ (62). వీరు పూలతోట నిర్వహిస్తున్నాడు. ఈనెల 16న చిన్నమ్మాల్ అకస్మాత్తుగా విషం తాగింది. చుట్టుపక్కల వారు చిన్నమ్మాల్‌ను తురవంకురిచ్చిలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్చారు. అయినప్పటికీ ఆమె పరిస్థితి మరింత విషమించడంతో చేసేదిలేక చిన్నమ్మాల్‌ను ఆస్పత్రి నుంచి అంబులెన్స్‌లో ఇంటికి తీసుకువెళ్లారు. మార్గం మధ్యలో చిన్నమ్మాల్ మృతి చెందినట్టు భావించిన బంధువులు ఆమెను ఇంటికి కాకుండా నేరుగా శ్మశానవాటికకు తీసుకువెళ్లారు. ఈ విషయాన్ని బంధువులకు తెలిపారు. బంధువులు విలపిస్తూ అక్కడికి చేరుకున్నారు. శ్మశానవాటికలో ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తర్వాత చిన్నమ్మాల్ శరీరాన్ని దహనం చేయడానికి ఏర్పాట్లు చేశారు. ఆమెను కట్టెలు పేర్చిన చితిపై పడుకోబెట్టారు. ఆ సమయంలో చిన్నమ్మాల్‌పై బంధువులు పడి బోరున విలపించారు. అప్పుడు అకస్మాత్తుగా చిన్నమ్మాల్ తనపై పడి ఏడుస్తున్న బంధువులు ఒకరి చెయ్యి పట్టుకుని తాగడానికి నీళ్లు కావాలని అడిగింది. దీంతో అక్కడ ఉన్న వారంతా దిగ్భ్రాంతి చెందారు. తర్వాత అంబులెన్స్‌ను రప్పించి తిరిగి చిన్నమ్మాల్‌ను తిరుచ్చి ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెకు వైద్యం చేస్తున్నారు. #DINAMANI | இறுதிச் சடங்கில் உயிருடன் எழுந்த மூதாட்டியால் பரபரப்பு!#trichy #shocking #funeral #notdead pic.twitter.com/xE7L1OOhts— தினமணி (@DinamaniDaily) November 19, 2024VIDEO CREDITS: DinamaniDaily -
Peddapalli: శ్మశానంలో ఎముకల దొంగలు!
సుల్తానాబాద్(పెద్దపల్లి): శ్మశానంలో దొంగలు పడ్డారు.. శవాన్ని దహనం చేయగా మిగిలిన పుర్రెలు, ఎముకల్ని చోరీ చేస్తున్నారు.. వీటిని ఏం చేస్తారో తెలియదు కానీ.. కొందరు యువకుల ముఠా ఈ దురాగతానికి పాల్పడుతోంది.. మంత్రతంత్రాలు, పూజలు, చేతబడులు చేయడం లాంటి మూఢనమ్మకాల్ని ఇప్పటిదాకా చూశాం.. విన్నాం.. కానీ, ఇలాంటి విచిత్రమైన ఘటన జిల్లాలో చోటుచేసుకోవడం విస్మయం కలిగిస్తోంది. రెండు రోజుల్లో నలుగురి పట్టివేత.. సుల్తానాబాద్‌లోని హిందూ శ్మశానవాటికలో రెండురోజుల వ్యవధిలో నలుగురు వ్యక్తులు ఎముకలు చోరీచేస్తూ స్థానికులకు పట్టుబడ్డారు. శవాలను కాల్చివేయగా మిగిలిన ఎముకలను పోగుచేసుకుని, ఒక సంచీలో వేసుకుని తీసుకెళ్తున్నారు. శుక్రవారం ఇద్దరు యువకులు ఇలా ఎముకలు తీసుకెళ్తుండగా స్థానికులు పట్టుకున్నారు. ఎముకల్ని అక్కడే వదిలివేయగా, ఆ యువకులను బెదిరించి అక్కడి నుంచి పంపించివేశారు. శనివారం ఇద్దరు మహిళలు కూడా శ్మశానంలో ఎముకలు పోగుచేస్తూ అక్కడి మున్సిపల్ సిబ్బందికి పట్టుపడ్డారు. అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఆ మహిళలను అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతింటున్నా.. కొన్నిరోజులుగా వైకుంఠధామాల్లోని ఎముకలు మాయమువుతున్నాయని స్థానికులు చర్చించుకుంటున్నారు. మృతదేహాల ఎముకలను కుటుంబ సభ్యులు సేకరించి 5, 9, 11వ రోజుల తర్వాత గోదావరి నదిలో కలుపడం సంప్రదాయం. అయితే, కొన్నిరోజులుగా శ్మశానంలో అస్థికలు కనిపించకపోవడంతో చాలామంది అవి కాలిపోయినట్లు ఇంతకాలం భావిస్తూ వచ్చారు. ఎముకల దొంగలు పట్టుపడడంతో తమవారి ఎముకలను కూడా వారే ఎత్తుకెళ్లి ఉంటారని అనుమానిస్తున్నారు. స్థానికుల సమాచారంతో ముఠాను మున్సిపల్ సిబ్బంది రాజకుమార్, వినోద్ పట్టుకున్నారు. మాజీ సర్పంచ్ అంతటి అన్నయ్య, బీఆర్ఎస్ నాయకులు మున్సిపల్ సిబ్బందికి సహకరించారు. విచారణ జరుపుతున్న పోలీసులు.. రెండురోజుల వ్యవధిలో నలుగురు ఎముకల దొంగలు పట్టుపడడంతో సుల్తానాబాద్ మున్సిపల్ సిబ్బంది పోలీసులకు అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ వేగవంతం చేశారు. కాగా, పదేళ్లక్రితం మృతదేహాలను కాల్చిన కట్టెల బొగ్గులు తీసుకుని వచ్చి కంకులు కాల్చేవారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలా చేసేవారు. -
ఎన్నో అనాథ శవాలకు అంత్యక్రియలు.. నేడు అనాథ శవంలా మార్చురీలో
విశాఖపట్నం: జీవితం అంతుచిక్కని మలుపుల వింత ప్రయాణం. ఏ పయనం ఎక్కడ మొదలవుతుందో.. ఎప్పుడు ఎక్కడ ఎలా ముగిసిపోతుందో అంచనా వేయడం అసాధ్యం. కొందరికి బతుకు వేడుకైతే.. మరికొందరికి వేదన. కొందరి ప్రస్థానం చరిత్రలో నిలిచిపోతే.. మరికొందరి బతుకంతా అజ్ఞాతమే.. ఆ అనాథ యువకుడి జీవితం రెండో కోవకే చెందుతుంది. శ్మశానమే సర్వస్వమైన అతడిని.. అక్కడకు చేరువులోనే సంచరించిన మృత్యువు తిరిగిరాని లోకాలకు తీసుకుపోయింది. అతను ఎన్నో అనాథ శవాలకు అంతిమ సంస్కారాలు నిర్వహించాడు. నేడు ఆ యవకుడి మృతదేహం కేజీహెచ్ మార్చురీలో అనాథ శవంలా ఉంది. కాన్వెంట్ జంక్షన్ సమీపంలోని హిందూ శ్మశానవాటికలో పోలిపల్లి పైడిరాజు(35) 15 ఏళ్లుగా సేవలందిస్తున్నాడు. నగరానికి చెందిన వాడే అయినా.. ఆలనాపాలనా చూసేవారెవరూ లేకపోవడంతో అక్కడా ఇక్కడా కాలం గడిపి చివరికి శ్మశానానికి చేరుకున్నాడు. పైడిరాజు చిన్న వయసులోనే తల్లిదండ్రులిద్దరూ మృతి చెందారు. అన్నయ్య ఉన్నా.. అతడికి దూరంగా ఉంటున్నాడు. శ్మశానంలో పని చేస్తున్న మరికొందరితో కలిసి ఉంటున్నాడు. పైడిరాజు సేవ విలువకట్టలేనిది. అనాథలు.. అభాగ్యులే కాదు. డబ్బున్న వారెందరికో తనే తలకొరివి పెట్టాడు. కుమారులు, కుమార్తెలు విదేశాల్లో ఉండి.. ఇక్కడకు రాలేని పరిస్థితిలో ఎందరో తల్లులు.. తండ్రులకు తనే కుమారుడిగా తలకొరివి పెట్టిన రోజులెన్నో. గతేడాది సురేష్ అనే కూలీ అనారోగ్యానికి గురయ్యాడు. పనిచేసే ఓపిక నశించడంతో.. గత్యంతరం లేక యాచక వృత్తిలో పడ్డాడు. సురేష్ కు ఆరోగ్యం క్షీణించడంతో మృతి చెందాడు. అనాథ శవంగా మిగిలిపోయిన సురేకు అతని కుమారుడి చేతుల మీదుగా పైడిరాజు అంత్యక్రియలు జరిపించి మానవత్వం చాటుకున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది అభాగ్యులు.. అనాథలకు అన్నీ తానై అంతిమ సంస్కరణలు నిర్వహించాడు. ఎంతో మందికి పాడి కట్టాడు. నా అనే వారు లేక చనిపోయిన వారిని ఊరేగిస్తున్న క్రమంలో విసిరిన డబ్బులకు పైడిరాజు అలవాటు పడ్డాడు. ఆ వచ్చే డబ్బులతో పూట గడిచేది. అలా శ్మశానవాటికకు చేరువయ్యాడు. ఆదివారం రోడ్డు ప్రమాదానికి గురై.. అర్ధాంతరంగా తనువు చాలించాడు. -
స్మశాన వాటికలను సైతం వదలని అక్రమార్కులు
సాక్షి, హైదరాబాద్ : మహానగరంలో గజం భూమి విలువ కనీసం రూ.40వేల నుంచి లక్షలకు పైనే. ఖాళీ జాగా కనిపిస్తే పాగా వేసే భూబకాసురులు శ్మశాన వాటికలను సైతం వదలడం లేదు. ఇప్పటి వరకు శ్మశాన వాటికల స్థలాల్లో అక్రమ దుకాణ సముదాయాలు ఏర్పాటు కాగా, తాజాగా నివాస సముదాయాల కోసం కూడా నిర్మాణాలకు దిగుతున్నారు. నగరంలోని పలు శ్మశాన వాటికల్లో అక్రమ నిర్మాణాలు సాగుతున్న విషయం దృష్టికి రావడంతో వక్ఫ్‌బోర్డు తీవ్రంగా పరిగణించి చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు నివాసం ఏర్పాటు చేసుకున్న వారిని తక్షణమే ఖాళీ చేయాలని నోటీసులు జారీ చేసింది. వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకారం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమిత్తం తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, శ్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసేవారు. ఇలాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. ఎక్కువ శాతం శ్మశానవాటికల స్థలాలపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలుస్తున్నాయి. అక్రమార్కుల చెరలో.. ► నగరంలోని పలు శ్మశాన వాటికలు క్రమంగా అక్రమణలకు గురవుతున్నాయి. కోట్ల విలువైన దేవుడి(వక్ఫ్) స్థలాలు అన్యాక్రాంతమవుతున్నాయి. అందులో కొన్ని మచ్చుతునకలు.. ► మల్లేపల్లిలో గల హజరత్ యూసిఫైన్ దర్గా శ్మశాన వాటికలో కొంత మంది నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు. మరోవైపు అక్రమంగా దుకాణాలు కూడా వెలిశాయి. ► మాసబ్ ట్యాంక్ ప్రాంతంలోని సయ్యద్ అహ్మాద్‌బాద్షా దర్గాకు సంబంధించిన ఎనిమిది ఎకరాల్లో ముందు భాగంలో సమాధులను తొలగించి దుకాణాల సముదాయాలను నిర్మించుకొని దర్జాగా వ్యాపారాలు సాగిస్తున్నారు. ► పాతబస్తీలోని మిస్రీగంజ్, షంషీర్గంజ్ స్మశాన వాటిక స్థలాల్లో అక్రమంగా దుకాణాల సముదాయాలను నిర్మించారు. ప్రస్తుతం ఆ మడిగల్లో ఒక హోటల్‌తోపాటు పలువ్యాపారాలు సాగుతున్నాయి. ► సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గా, హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గాల స్మశాన వాటికల్లో దుకాణాల సముదాయాలతోపాటు నివాస గృహాలు కూడా వెలిశాయి. అక్రమ కట్టడాలను తొలగిస్తాం శ్మశాన వాటిక స్థలాల్లో అక్రమ కట్టడాలను తొలగిస్తాం.అక్రమార్కులు తక్షణమే అక్కడినుండి ఖాళీ చేయాలి, దుకాణాలను సైతం తొలగించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – సలీం, చైర్మన్, వక్ఫ్‌బోర్డు, తెలంగాణ చదవండి: 16 ఏళ్లుగా భార్య శవంతో బెడ్‌పై.. -
మరో మహ ప్రస్థానం..
-
శ్మశానంలో పచ్చ ‘భూ’తాలు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: విలువైన భూములనే కాదు ఊరవతల ఉన్న శ్మశాన భూములనూ వదలబోమంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు అండ చూసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లు శ్మశానాల్లో కూడా ప్లాట్లు వేసి అమ్ముకోవడానికి పావులు కదుపుతున్నారు. కోటి రూపాయల విలువైన స్థలాన్ని చదును చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. శ్మశానంలో ఆక్రమణకు యత్నం కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామం దక్షిణం వైపు ఏపీ త్రయం గంగనాపల్లి, కొవ్వాడ, చీడిగ గ్రామ పొలిమేరలను కలుపుతూ పుంత మార్గం ఉంది. సర్వే నెంబర్ 79/18లో పుంతలోని కొంత భాగంలో బ్రాహ్మణులు, జంగాలు, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన శ్మశానం ఉంది. దాదాపు 40 సెంట్లు విస్తీర్ణంలోని భూమిని గతంలో కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని కొందరు యత్నించారు. శ్మశానమంటే ఇళ్ల స్థలాలు ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారని దాన్ని పోరంబోకు భూమిగా రికార్డుల్లో మార్చేందుకు కూడా ప్రయత్నించారు. అప్పట్లో సదరు సామాజిక వర్గాలు ప్రతిఘటించడంతో ఆక్రమణ తంతు ఆగింది. మళ్లీ ఇప్పుడు ఆ భూమిపైనే అక్రమార్కుల కన్ను పడింది. ఎమ్మెల్యే అండతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తి దాన్ని కబ్జా చేసేందుకు పావులు కదిపారు. చదును చేసేసి ప్లాట్లుగా విభజన చేసి అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారు పొక్లైన్తో చదును చేస్తూ అమ్మకాలు కూడా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ పక్కనే రైల్వే భూముల్లో కూడా అనధికారికంగా రోడ్డేసి ఆక్రమణకు యత్నిస్తున్నారు. స్థానిక అధికారులు కూడా ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి లేఅవుట్ వేసేసి, ప్లాట్లుగా విభజన చేసి సొమ్ము చేసుకునేందుకు పథక రచన చేశారు. చోద్యం చూస్తున్న అధికారులు... కళ్ల ముందే శ్మశానాన్ని చదును చేసి కబ్జా చేసేస్తుంటే ఏ ఒక్క అధికారీ అడ్డు పడటం లేదు. పెద్దల అండదండలతో ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిసీ వారి జోలికే వెళ్లడం లేదు. ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారుల దృష్టికి వెళ్లినా నిలువరించే ప్రయత్నం జరగలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో సదరు గంగనాపల్లి గ్రామస్తులు నేరుగా ఆర్డీఓకు, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కోటి రూపాయల విలువైన భూమిని కబ్జా చేస్తూ, గ్రామంలో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపైనా, వారికి సహకరించిన వారిపైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు. చదును యత్నాన్ని ఆపాం గంగనాపల్లిలో భూమిని చదును చేస్తున్నారని తెలుసుకొని వీఆర్ఓను పంపించి, ఆపించాం. సర్వేయర్‌ను కూడా పంపుతున్నాం. పరిశీలించాక సర్వేయర్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. పుంత భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతాం.– కె.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్, కాకినాడ రూరల్ -
ఇదెక్కడి న్యాయం
సాక్షి, సిటీబ్యూరో: వక్ఫ్‌బోర్డులో కంచె చేనుమేస్తోంది. వందల కోట్ల విలువైన దేవుడి (వక్ఫ్) భూములు అన్యాక్రాంతమవుతున్నాయి. లీజుల పేరుతో స్థలాలను కాజేస్తున్నారు. దర్గా, స్మశాన వాటిక స్థలాలను సైతం వదలడం లేదు. బాహాటంగా ఆక్రమణల పర్వం కొనసాగుతున్న వక్ఫ్‌బోర్డు పాలక మండలి కళ్లున్న కబోధిలా వ్యవహరిస్తుదని విమర్శలు వినవస్తున్నాయి. వాస్తవం గా వక్ఫ్ భూములను అల్లాహ్‌కు చెందిన ఆస్తులుగా పరిగణిస్తారు. ముస్లిం సంప్రదాయం ప్రకా రం గతంలో రాజులు, సంపన్న వర్గాలకు చెందిన వారు మంచి కార్యక్రమాల నిమ్తింత తమ సొంత స్థలాలను ఆధ్యాత్మిక గురువుల పేరిట దర్గాలు, స్మశాన వాటికలు, మసీదులకు కేటాయించి వక్ఫ్ చేసే వారు. ఈ లాంటి భూములను ‘మున్షాయే వక్ఫ్’గా పేర్కొంటారు. దర్గాకు సంబంధించిన భూములపై పెద్ద ఎత్తున అక్రమ కట్టడాలు వెలిసినా... కేవలం మూడు నివాసాలకు మాత్రమే నోటీసులు జారీ చేయడం వక్ఫ్‌బోర్డు ద్వంద నీతికి అద్దంపడుతోంది. ఇదీ కథ.. సైదాబాద్‌లోని హజరత్ ఉజేలాషా దర్గాకు సర్వే నెంబర్ 255/1, 255/2, 255/3, 255/4, 255/5, 255/6 లో సుమారు 28 ఎకరాల 29 గంటల భూమి ముంతఖబైæ ఉంది. అందులో 11.21 ఎకరాల భూమి సమీపంలోని హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గాకు చెందుతుంది. నిజాం ప్రభుత్వ హయాంలో డైరెక్టర్ ఆఫ్ రిలీజియస్ అఫైర్స్ డిపార్ట్మెంట్ వద్ద నవాబ్ జీవన్ యార్ జంగ్, అబ్బాస్ అలీ, ఇబ్రాహీం అలీ ఖాన్ అనే వ్యక్తులు సదరు భూమిని 99 ఏళ్లకు లీజుకు తీసుకున్నట్లు రికార్డులు స్పష్టం చేస్తున్నాయి. హైదరాబాద్ హైకోర్టు రిటైర్డ్ ప్రధాన న్యాయమూర్తి నవాబ్ జీవన్ యార్ జంగ్ హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను పర్యవేక్షించేవారు. 1958లో అతను మృతి చెందగా, 1968 ఆయన ఇద్దరు భార్యల పిల్లలు ఆస్తుల కోసం కోర్టును ఆశ్రయించారు. దీంతో దర్గా భూములను సైతం స్వంత ఆస్తులుగా పరిగణించడంతో ఆరు ఎకరాల భూమి దక్కింది. దీంతో ఆ రెండు కుటుంబాలు కోర్టు తీర్పు ఆధారంగా నూరుల్Š అలీ రుపాణీ, మరో ఇద్దరికి భూములు విక్రయించి పాకిస్తాన్ వెళ్లిపోయారు. భూమిని కొనుగోలు చేసిన నూరుల్ అలీ రుపాణీ జీవన్ యార్జంగ్ కాలనీ పేరుతో బిల్డర్ ద్వారా సుమారు 180 నుంచి 200 వరకు ప్లాట్లు చేసి విక్రయించారు. 1978 నుంచి ప్లాట్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగింది. ఇందులో నిర్మాణాలు జరగడంతో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టడాలకు 852 నుంచి 866/జీ వరకు ఇంటి నెంబర్లు కేటాయించింది. జీవన్యార్జంగ్ కాలనీలోనే ఉంటున్న అల్వీ కుటుంబం హజరత్ సయ్యద్ బాద్షా మహజూద్ సాహెబ్ దర్గా వ్యవహారాలను చూసేది. ఇదిలా ఉండగా 2009లో వక్ఫ్‌బోర్డు దర్గాకు ముతవల్లీని నియమించగా, సదరు ముతవల్లీ దర్గాకు మిగిలిన ఉన్న భూమి, స్మశాన వాటిక వ్యవహారంలో చేతివాటం ప్రదర్శించడంతో అల్వీ కుటుంబం అడ్డుకుంది. దీనిపై వక్ఫ్‌బోర్డుకు ఫిర్యాదు చేయడంతో దర్గా భూములపై సర్వే నిర్వహించారు. 2010, 2014, 2016లో మూడుసార్లు సర్వే నిర్వహించిన అధికారులు జీవన్ యార్ జంగ్ కాలనీలో సుమారు 11.21 ఎకరాల దర్గా భూమి అన్యాక్రాంతమై కట్టడాలు వెలిసినట్లు నివేదిక అందజేశారు. మూడు ఇళ్లకు నోటీసులు జీవన్ యార్ జంగ్ కాలనీలోని 11.21 ఎకరాల భూమి లో ఇంటి నెంబర్ 16–2–853 నుంచి 16–2–866.జీ వరకు సుమారు 180 నుంచి 200 వరకు గృహాలు ఉన్నాయి. వక్ఫ్ సర్వేలో సైతం మొత్తం కట్టడాలు వక్ఫ్ భూమిలోనే ఉన్నట్లు వెల్లడైనా కేవలం మూడు గృహాలకు మాత్రమే వక్ఫ్‌బోర్డు నోటీసులు జారీ చేసింది. అల్వీ కుటుంబానికి సంబంధించి మహ్మద్ ముస్తాఫాకు చెందిన ఇంటి నెంబర్ 16–2–866/ఎఫ్ (186 చదరపుగజం), మరో ఇంటి నెంబర్ 16–2–866/1( 152 చదరపు గజం), ఆయన సోదరుడు మహ్మద్ ముజ్తఫాకు చెందిన ఇంటినెంబర్ 16–2–886/ఎఫ్/5(200 చదరపు గజం)లకు నోటీసులు అందజేయడమేగాక సదరు ఇళ్లను వెంటనే ఖాళీ చేయాలని ఆదేశించింది. దీంతోపాటు జిల్లా రిజిస్టార్కు మూడు ఇళ్ల దస్తావేజులను నిషేధిత జాబితాలో చేరుస్తూ వక్ఫ్‌బోర్డు సీఈవో లేఖ రాశారు. కాగా, వక్ఫ్‌భూమిగా గుర్తించిన స్థలాల్లో పెద్ద ఎత్తున కట్టడాలు ఉన్నా కేవలం ఒకే కుటుంబానికి చెందిన మూడు కట్టడాలకే నోటీసులు ఇవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. దీనిపై సదరు అల్వీ కుటుంబ సభ్యులు రాష్ట్ర వక్ఫ్‌బోర్డు, కేంద్ర వక్ఫ్‌బోర్డుకు మొర పెట్టుకున్న ఫలితం లేకుండా పోయింది. దీంతో న్యాయ పోరాటానికి సిద్దమవుతున్నట్లు సమాచారం. కక్ష సాధిస్తున్నారు కక్షసాధింపు చర్యగా టార్గెట్ చేశారు. చట్టబద్దంగా నూరుల్ అలీ నుంచి స్థలాలు కొనుగోలు చేశాం. 1984లో రిజిస్ట్రేషన్ జరిగింది. లింక్ దస్తావేజులు కూడా ఉన్నాయి. కోర్టు తీర్పు ఆధారంగా యార్ జంగ్ కుటుంబం నూరుల్ అలీ, ఖాజా మొయినోద్దీక్లకు విక్రయించారు. ఖాజామొయినొద్దీన్ నుంచి నూరుల్ అలీ కొనుగోలు చేయగా, ఆయన నుంచి మేము కొనుగోలు చేశాం, పక్క ఇంటి నంబర్లను వదలి మా కుటుంబానికి చెందిన మూడు ఇళ్లకు మాత్రమే నోటీసులు జారీ చేశారు. నిజంగా వక్ఫ్ బోర్డు స్థలం అయితే అన్ని గృహాలకు వర్తించాలి. – మహ్మద్ ముస్తాఫా అలీ, జీవన్ యార్ జంగ్ కాలనీ, సైదాబాద్ -
అపార్ట్‌మెంట్‌కు అడ్డొచ్చిందని...
బొబ్బిలి: ఓ బిల్డర్ వ్యాపారానికి అడ్డొచ్చిందని దశాబ్దాల తరబడి వినియోగిస్తున్న శ్మశానాన్ని మార్చేశారు. ఇప్పటికే ఓ కాలనీ వాసులకు శ్మశానానికి స్థలమిచ్చిన గ్రామానికి తరలించడంతో ఆ గ్రామానికి చెందిన గిరిజనులు తమ శ్మశానం వాడితే ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు. మున్సిపాలిటీలోని గెస్ట్‌హౌస్ కాలనీ సమీపంలో అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు ఉమ్మడిగా ఉన్న శ్మశానం సుమారు ఎకరా విస్తీర్ణంలో వాడుకలో ఉండేది. ఇటీవల ఆ పక్కనే జిరాయితీ భూమిని కొన్న ఓ బిల్డర్ పక్కన శ్మశానం ఉందన్న విషయం తెలియక కొనేసి బిల్డింగ్ నిర్మించారు. అయితే ఆ శ్మశానాన్ని మరో చోటకు తరలించేందుకు కాలనీకి చెందిన కొందరు పెద్దలు బిల్డర్‌కు సహకరించడంతో రెండు గ్రామాల మధ్య శ్మశాన వివాదం తలెత్తింది. గెస్ట్‌హౌస్ కాలనీ శ్మశానానికి ఉన్న రహదారిని తవ్వేసి పక్కనే ఉన్న పోలవానివలస శ్మశానంలో దహన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని ఉచిత సలహా ఇవ్వడమే కాకుండా పోలవానివలస గ్రామ గిరిజనులను హెచ్చరించడం, బెదిరించడంతో వారు కలెక్టరేట్లోని గ్రీవెన్స్‌సెల్‌కు ఫిర్యాదు చేశారు. కేవలం ఓ బిల్డర్ వ్యాపారం కోసం ఇక్కడి శ్మశానాన్ని తరలించడం ఏమిటని స్థానికులు వాదిస్తున్నా అధికారులు ఆదేశించారని చెబుతున్నారని స్థానికులు వాపోతున్నారు. కొత్తగా శ్మశానానికి రోడ్డు వేసేందుకు అక్కడి సమాధి చేసిన మృతదేహాలను కూడా వెలికి తీశారని గిరిజన గ్రామస్తులు వాపోతున్నారు. వెంటనే ఎవరి శ్మశానాన్ని వారికి కేటాయించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. బావి తవ్వుకుంటే పాడు చేశారు శ్మశానానికి అవసరమైన బావిని తవ్వించాం. బిల్డర్ ఇక్కడ శ్మశానం ఏమిటని బావికి ఉన్న కప్పులను తవ్వించేశారు. అసలు మా శ్మశానం వద్ద బిల్డింగ్ కట్టడమేమిటి? శ్మశానాన్ని తరలించడం ఏమిటి? మేం ఒప్పుకోం. ఎక్కడి శ్మశానం అక్కడే ఉండాలి. –అరసాడ మురళి, స్థానికుడు, గెస్ట్‌హౌస్ కాలనీ రోడ్డు తవ్వేసి మరో రోడ్డు వేశారు మా కాలనీ వాసులు వినియోగిస్తున్న శానానికి ఉన్న రహదారిని తవ్వేశారు. మరో శ్మశానానికి వెళ్లాలని మరో రోడ్డు వేశారు. మా కాలనీకి చెందిన కొందరు ప్రబుద్ధులకు అధికారులు కూడా సహకరిస్తున్నారని తెలుస్తున్నది. ఇదెక్కడి న్యాయం? కె.పార్వతి, మున్సిపల్ కౌన్సిలర్, 21వ వార్డు 1960 నుంచి ఉంటున్నాం.. మేం ఐటీఐ నిర్మించినపుడు అక్కడుండటం శ్రేయస్కరం కాదని అప్పటి చైర్మన్ ఆరి గంగయ్య మాకు ఇక్కడ స్థలమిచ్చారు. గెస్ట్‌హౌస్ కాలనీకి శ్మశానం లేదంటే మేమే స్థలమిచ్చాం. ఎవరో ఖాళీ చేయమంటే మా శ్మశానానికి వస్తామంటున్నారు. ఇదెలా కుదురుతుంది? మేం ఇచ్చేది లేదు. వాళ్ల గొడవలు వారే తీర్చుకోవాలి. మధ్యలో మా మీదకు వస్తారా? –ముంగి సింహాద్రి, గిరిజన పెద్ద, పోలవానివలస -
చచ్చినా.. కష్టమే..!
సాక్షి కడప : గండికోట ముంపు గ్రామాల ప్రజలు.. ప్రాజెక్టు కోసం అన్నీ త్యాగం చేసినా.. వారికి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. కనీస వసతులు కల్పించడంపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపకపోవడంతో ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తినడానికి కాస్త తిండి.. చనిపోతే కొంత స్థలం అవసరం. అయితే మొదటి దానికి ఇబ్బంది లేకున్నా.. రెండవ దానికి మాత్రం నానాయాతన పడుతున్నారు. గండికోట ముంపు గ్రామమైన బొమ్మేపల్లె వాసులకు ఆర్టీపీపీ పరిధిలోని కలమల వద్ద పునరావాసం కల్పించారు. అయితే అక్కడ శ్మశాన వాటికకు స్థలం కేటాయించక పోవడంతో చనిపోయిన వారికి కూడా ప్రశాంతత లేకుండా చేస్తున్నారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఎర్రన్న (85) రెండు రోజుల క్రితం చనిపోయారు. అయితే ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా అక్కడ నివసిస్తున్న బొమ్మేపల్లె వాసులకు శ్మశాన స్థలం లేదు. దీంతో అక్కడే విలపిస్తూ తరువాత ఆలోచన చేసిన ఆయన కుటుంబ సభ్యులు ఎట్టకేలకు మనువడి ఊరికి తీసుకెళ్లి అంత్య క్రియలు నిర్వహించారు. మనువడి గ్రామమైన అనంతపురం జిల్లా తిమ్మంపల్లి మండలం కల్లూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన పరిస్థితి తలెత్తింది. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి బొమ్మేపల్లెకు సంబం« దించి ఎక్కడో ఒక చోట శ్మశాన వాటికకు స్థలం మంజూరు చేయాలని అక్కడ నివసిస్తున్న ప్రజలు కోరుతున్నారు. -
శ్మశానాలను వదలని తెలుగు తమ్ముళ్లు !!
► నీరు-చెట్టు పథకానికి దొరకని చోటు ► శ్మశానంలో అడ్డగోలుగా తవ్వకాలు ► అడ్డొచ్చిన దళితులకు బెదిరింపులు ► మితిమీరిన టీడీపీ నేతల దౌర్జన్యం ► ఎప్పటిలాగే కిమ్మనని అధికారులు అక్కడలా.. నిజాయితీకి నేను బ్రాండ్ అంబాసిడర్‌ను.. అవినీతిని కూకటివేళ్లతో పెకిలిస్తా.. తప్పు చేస్తే నాయకులైనా.. అధికారులైనా వదిలే ప్రసక్తే లేదు.. నిర్లక్ష్యాన్ని సహించను.. నేను నిద్రపోను.. మిమ్మల్ని నిద్రపోనివ్వను.. అంతిమంగా పేదలకు న్యాయం జరగాలి.. తిరుపతిలో మూడు రోజులు జరిగిన టీడీపీ మహానాడులో ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ప్రసంగించారు. ఇక్కడిలా... అంతటి నీతి వాక్యాలు వల్లించే సదరు నేతకు క్షేత్రస్థాయిలో తెలుగు తమ్ముళ్ల అక్రమాలు కనిపించకపోవడం విచారకరం. ప్రభుత్వం ఏ పథకాన్ని ప్రవేశ పెట్టినా టీడీపీ నేతల చిలక్కొట్టుడుతో లబ్ధిదారులకు అన్యాయం జరుగుతోంది.. నీరు-చెట్టు, పింఛన్లు, ఫారం పాండ్స్.. ఇలా ఒకటేమిటి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నీ పథకాల్లో అవినీతిదే సింహభాగం. దర్శి: నాడు సత్యహరిశ్చంద్రుడు సత్యం కోసం శ్మశానంలో కాపలా ఉండి దాన్ని కాపాడితే.. నేడు ఈ రాష్ట్రాన్ని ఏలుతున్న తెలుగు తమ్ముళ్లు నీరు-చెట్టు పథకం పేరుతో శ్మశానాలను సైతం పూడ్చి నాలుగు రాళ్లు వెనకేసుకునేందుకు యత్నిస్తున్నారు. సదరు పథకం తమ్ముళ్లకు కాసుల వర్షం కురుపిస్తుండటంతో నిబంధనలకు నిలువునా నీళ్లొదులుతున్నారు. వాగులు, చెరువుల్లో పూడికలు తీసి భూగర్భ జలాలు పెంపొందించేందుకు ప్రభుత్వం నీరు-చెట్టు పథకాన్ని ప్రవేశ పెట్టింది. తెలుగు తమ్ముళ్లు మాత్రం నిబంధనలు తమకు వర్తించవని శ్మశానాలను సైతం దున్నేస్తూ ప్రశ్నించిన వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. ఫిర్యాదులు చేసినా పట్టించుకునే అధికారులు ఎలాగూ లేకపోవడంతో వారి అవినీతికి అడ్డే లేకుండా పోయింది. వివరాలు.. దర్శి మండలం యర్రఓబనపల్లి పంచాయతీ పరిధి అగ్నిపూరి కాలనీలో 20 ఏళ్లుగా 220 కుటుంబాలకు చెందిన ఎస్సీ,ఎస్టీలు నివాసముంటున్నారు. ఆ గ్రామ సర్వే నంబర్ 1,2లో ఐదెకరాలను చాలా ఏళ్లుగా శ్మశానం కింద వాడుకుంటున్నారు. ఆ గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు నీరు-చెట్టు పథకాన్ని ఆసరా చేసుకుని శ్మశానంలో గుంతలు తీసేలా అధికారుల నుంచి నిబంధనలకు విరుద్ధంగా అనుమతి పొందారు. సమాధులున్నా పొక్లెయిన్‌తో కొండ వరకు తవ్వేశారు. సమాధులు కూల్చి మొత్తం చదును చేశారు. గ్రామస్తులంతా ఏకమై శనివారం రాత్రి టీడీపీ నేతలను అడ్డుకున్నారు. గ్రామానికి చెందిన చింతా వెంకటేశ్వరరెడ్డి, చింతా వెంకటరామిరెడ్డి, పాలెం యోగిరెడ్డి, పేరం పోలిరెడ్డి అనే తెలుగుదేశం పార్టీ నాయకులు తమపై దౌర్జన్యానికి దిగారని పలువురు ఎస్సీలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమను కులం పేరుతో దూషించారని, శ్మశానం జోలికి వస్తే ఊచకోత కోస్తామని హెచ్చరించారని బాధితులు వెంకటయ్య, జి.విల్సన్‌బాబు, పి.హరీష్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటన స్థలానికి కొందరు గ్రామస్తులు వచ్చి ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపినట్లు స్థానికుడు గుంటూరు వెంకటయ్య తెలిపారు. పూర్వీకుల ఆనవాళ్లు మాయం శ్మశానంలో తమ పూర్వీకుల సమాధులు మాయం చేశారని ఎస్సీలు జి.ఆదాం, టి.యలమంద, జి.ఏసు, కె.రమణమ్మ, మరికొందరు గ్రామస్తులు వాపోయారు. తమ పూర్వీకుల సమాధుల ఆనవాళ్లు కూడా లేకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మనిషి చనిపోతే పూడ్చి పెట్టే ఆరడుగుల స్థలం కూడా లేకుండా చేస్తున్నారని ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. మంత్రి వాదనేంటో? దర్శి నియోజకవర్గంలో పేదల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి అయిన శిద్దా రాఘవరావు ఈ విషయంలో పేదలకు ఏం చెబుతారని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తెలుగు తమ్ముళ్ల ఆగడాలు అరికట్టాలని మంత్రిని కోరుతున్నారు. నీరు-చెట్టు పథకానికి చెరువులు, వాగులు, కుంటలకు నిధులు మంజూరు చేయాలిగానీ శ్మశానాల్లో నీరు-చెట్టు పనులు చేయడమేంటని నిలదీస్తున్నారు. నీరు-చెట్టు పనులపై దృష్టి పెట్టి అవినీతిని అరికట్టాల్సిన బాధ్యత మంత్రిపైనే ఉందని చెప్తున్నారు. మంత్రి స్పందించి తగు చర్యలు తీసుకోకుంటే ఎస్సీ,ఎస్టీలను ఏకం చేసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.