గంగనాపల్లి పుంత భూమిలో ఉన్న శ్మశాన ప్రాంతాన్ని చదును చేస్తున్న అక్రమార్కులు
సాక్షి ప్రతినిధి, తూర్పుగోదావరి,కాకినాడ: విలువైన భూములనే కాదు ఊరవతల ఉన్న శ్మశాన భూములనూ వదలబోమంటున్నారు అధికార పార్టీకి చెందిన నేతలు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ఆమె భర్త సత్తిబాబు అండ చూసుకుని రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తిన తెలుగు తమ్ముళ్లు శ్మశానాల్లో కూడా ప్లాట్లు వేసి అమ్ముకోవడానికి పావులు కదుపుతున్నారు. కోటి రూపాయల విలువైన స్థలాన్ని చదును చేసేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.
శ్మశానంలో ఆక్రమణకు యత్నం
కాకినాడ రూరల్ మండలం గంగనాపల్లి గ్రామం దక్షిణం వైపు ఏపీ త్రయం గంగనాపల్లి, కొవ్వాడ, చీడిగ గ్రామ పొలిమేరలను కలుపుతూ పుంత మార్గం ఉంది. సర్వే నెంబర్ 79/18లో పుంతలోని కొంత భాగంలో బ్రాహ్మణులు, జంగాలు, ఎరుకల సామాజిక వర్గానికి చెందిన శ్మశానం ఉంది. దాదాపు 40 సెంట్లు విస్తీర్ణంలోని భూమిని గతంలో కూడా ఆక్రమించి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేద్దామని కొందరు యత్నించారు. శ్మశానమంటే ఇళ్ల స్థలాలు ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రారని దాన్ని పోరంబోకు భూమిగా రికార్డుల్లో మార్చేందుకు కూడా ప్రయత్నించారు. అప్పట్లో సదరు సామాజిక వర్గాలు ప్రతిఘటించడంతో ఆక్రమణ తంతు ఆగింది. మళ్లీ ఇప్పుడు ఆ భూమిపైనే అక్రమార్కుల కన్ను పడింది. ఎమ్మెల్యే అండతో కొందరు టీడీపీ నాయకులు రియల్ ఎస్టేట్ బ్రోకర్లుగా అవతారమెత్తి దాన్ని కబ్జా చేసేందుకు పావులు కదిపారు. చదును చేసేసి ప్లాట్లుగా విభజన చేసి అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారు పొక్‌లైన్‌తో చదును చేస్తూ అమ్మకాలు కూడా చేస్తున్నారు. అంతటితో ఆగకుండా ఆ పక్కనే రైల్వే భూముల్లో కూడా అనధికారికంగా రోడ్డేసి ఆక్రమణకు యత్నిస్తున్నారు. స్థానిక అధికారులు కూడా ఆక్రమణదారులకు వత్తాసు పలుకుతున్నారన్న ఆరోపణలున్నాయి. మొత్తానికి లేఅవుట్ వేసేసి, ప్లాట్లుగా విభజన చేసి సొమ్ము చేసుకునేందుకు పథక రచన చేశారు.
చోద్యం చూస్తున్న అధికారులు...
కళ్ల ముందే శ్మశానాన్ని చదును చేసి కబ్జా చేసేస్తుంటే ఏ ఒక్క అధికారీ అడ్డు పడటం లేదు. పెద్దల అండదండలతో ఆక్రమణకు పాల్పడుతున్నారని తెలిసీ వారి జోలికే వెళ్లడం లేదు. ఎమ్మార్వో, ఆర్డీవో స్థాయి అధికారుల దృష్టికి వెళ్లినా నిలువరించే ప్రయత్నం జరగలేదన్న ఆరోపణలున్నాయి. దీంతో సదరు గంగనాపల్లి గ్రామస్తులు నేరుగా ఆర్డీఓకు, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశారు. కోటి రూపాయల విలువైన భూమిని కబ్జా చేస్తూ, గ్రామంలో ఉన్న వారిని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఫిర్యాదుదారులు ఆరోపించారు. దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిపైనా, వారికి సహకరించిన వారిపైనా క్రిమినల్ కేసు నమోదు చేయాలని బాధిత గ్రామస్తులు కోరుతున్నారు.
చదును యత్నాన్ని ఆపాం
గంగనాపల్లిలో భూమిని చదును చేస్తున్నారని తెలుసుకొని వీఆర్‌ఓను పంపించి, ఆపించాం. సర్వేయర్‌ను కూడా పంపుతున్నాం. పరిశీలించాక సర్వేయర్ ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. పుంత భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తే మాత్రం క్రిమినల్ కేసులు పెడతాం.– కె.సుబ్రహ్మణ్యం, తహసీల్దార్, కాకినాడ రూరల్
Comments
Please login to add a commentAdd a comment