ఈ కశ్మీర్‌ లెక్క కరెక్టేనా? | Sakshi Guest Column On Jammu And Kashmir Delimitation Commission | Sakshi
Sakshi News home page

ఈ కశ్మీర్‌ లెక్క కరెక్టేనా?

Published Mon, Jan 3 2022 12:54 AM | Last Updated on Mon, Jan 3 2022 3:39 AM

Sakshi Guest Column On Jammu And Kashmir Delimitation Commission

కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ–కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) కమిషన్‌ ప్రతిపాదన అసంతృప్తి జ్వాలలను రగులుస్తున్నది. కేంద్రం నియమించిన డీలిమిటేషన్‌ కమిషన్‌ కొత్తగా జమ్మూలో ఆరు అసెంబ్లీ సీట్లు, కశ్మీర్‌లో ఒకటి ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు రూపొందించి, జనాభిప్రాయాన్ని కోరింది. ఈ ప్రతిపాదనలు బీజేపీకి రాజకీయ లబ్ధి చేకూర్చేవిగా ఉన్నాయనీ, జమ్మూ, కశ్మీర్‌ల మధ్య విభజన రేఖను గీసి వాటి మధ్య శత్రుత్వ భావం పెంచేలా ఉన్నాయనీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను బట్టి చూస్తే... మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది.

జమ్మూ కశ్మీర్‌లో ఉన్న రాజకీయ కేంద్రీకరణ, ఆధిపత్యంౖపై ఈ ప్రతిపాదన ఒక దాడి లాంటిది. 2019 ఆగస్టు 5న బీజేపీ నాయకత్వం లోని ప్రభుత్వం జమ్మూ కశ్మీర్‌ సాధికారతను తగ్గించడానికి ప్రారం భించిన చర్యల్లో ఇదొక భాగం అనే విమర్శలు వినిపిస్తున్నాయి. గత జనాభా లెక్కల ప్రకారం, జమ్మూ జనాభా కన్నా కశ్మీర్‌ జనాభా 15 లక్షల మంది ఎక్కువగా ఉన్నప్పటికీ కశ్మీర్‌కు 1, జమ్మూకు 6 కొత్త నియోజక వర్గాలను ఏర్పాటు చేయాలనడం పట్ల ఆశ్చర్యం వ్యక్తమవు తోంది. జమ్మూ కశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) జరగాలనేది 1995 నుంచీ బీజేపీ ఎజెండాగా ఉంది.

2020 మార్చి 6న కేంద్ర ప్రభుత్వం జమ్మూ–కశ్మీర్‌లో నియోజక వర్గాల పునర్విభజన కోసం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించింది. ఆ కమిషన్‌ డిసెంబర్‌ 20న తన అసోసియేట్‌ సభ్యులైన ముగ్గురు నేషనల్‌ కాన్ఫరెన్స్‌ ఎంపీలు, ఇద్దరు బీజేపీ ఎంపీలకు మొత్తం మీద ఆరు కొత్త నియోజకవర్గాలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనల గురించి చెప్పింది. తమ ప్రతి పాదనలపై డిసెంబర్‌ 31 లోపు ప్రతి స్పందించాలని కోరిందని ఎంపీలు పేర్కొన్నారు. కశ్మీర్‌కు మరిన్ని సీట్లు రావలసి ఉందనీ, ఈ ప్రతిపాదన తమకు ఏమాత్రం సమ్మతం కాదనీ ఎన్‌సీ ఎంపీ జస్టిస్‌ (రిటైర్డ్‌) హస్నెయిన్‌ మసూది అన్నారు.

డీలిమిటేషన్‌ కమిషన్‌ ప్రతిపాదనతో జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీలో జమ్మూ సీట్లు 37 నుంచి 43కు, కశ్మీర్‌ సీట్లు 46 నుంచి 47కు పెరుగు తాయి. జమ్మూలోని కథువా, సంబా, ఉధంపూర్, దోడ, కిష్త్వార్, రాజౌరీ జిల్లాల్లో ఒక్కో నియోజక వర్గాన్ని, కశ్మీర్‌ లోయలోని కుప్వారా జిల్లాలో ఒక నియోజకవర్గాన్ని అదనంగా ఏర్పాటు చేయాలని కమిషన్‌ ప్రతిపాదించింది. కథువా, సంబా, ఉధంపూర్‌ సెగ్మెంట్లలో హిందువులు అత్యధికంగా ఉన్నారు. జనాభా లెక్కల ప్రకారం కథువాలో 87.61 శాతం హిందూ జనాభా ఉంది. కాగా సంబాలో 86.33 శాతం, ఉధంపూర్‌లో 88.12 శాతం హిందువులు ఉన్నారు. కిష్త్వార్, దోరా, డజౌరీ జిల్లాల్లోనూ గణనీయంగా (37 శాతం నుంచి 45 శాతం) హిందువులు ఉన్నారు.

పునర్విభజన కథ ఇదీ... 
అన్ని నియోజకవర్గాల్లో దాదాపు ఒకే పరిమాణంలో ఓటర్లు ఉండేలా చూసేందుకు డీలిమిటేషన్‌ చేపడతారు. చివరిసారి దేశంలో నియోజక వర్గాల పునర్విభజన (డీలిమిటేషన్‌) 2002లో జరిగింది. జమ్మూ– కశ్మీర్‌లో మాత్రం 1995లో రాష్ట్రపతి పాలన ఉన్న కాలంలో జరిగింది. దానికి ముందు 1993లో తాత్కాలిక ప్రాతిపదికన జగ్‌మోహన్‌ డీలిమిటేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. అప్పట్లో 87 అసెంబ్లీ సీట్లు ఉండాలని ప్రతిపాదిం చారు. అయితే  2002లో ఫరూక్‌ అబ్దుల్లా ప్రభుత్వం 2026 వరకు డీలిమిటేషన్‌ను నిర్వహించడానికి వీల్లేకుండా రాష్ట్ర రాజ్యాంగాన్ని సవరించింది. కానీ 2008 నుంచి బీజేపీ డీలిమిటేషన్‌ చేపట్టాలని డిమాండ్‌ చేస్తూ వచ్చింది. జమ్మూ ప్రాంతానికి అసెంబ్లీ స్థానాల్లో తగిన వాటా వచ్చేందుకు డీలిమిటేషన్‌ అవసరం ఉందని ఆ పార్టీ వాదిస్తూ వచ్చింది.  

జమ్మూ కశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని రద్దుచేసిన అనంతరం 2020 మార్చి 6న నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియ చేపట్టడానికి కేంద్రం డీలిమిటేషన్‌ కమిషన్‌ను నియమించింది. ఈ కమిషన్‌ నిర్వహించిన ఓ సమావేశం (2021, ఫిబ్రవరి)లో బీజేపీ నాయకులు జమ్మూలో డీలిమిటేషన్‌కు కేవలం జనాభాను మాత్రమే ప్రాతిపదికగా తీసుకోకుండా అక్కడ ఉన్న భౌగోళిక పరిస్థితులనూ పరిగణనలోకి తీసు కోవాలని కమిషన్‌ను కోరారు. దీంతో జూన్‌లో కమిషన్‌ జమ్మూ కాశ్మీర్‌లో ఉన్న మొత్తం 20 జిల్లాల్లో ఉన్న భౌగోళిక పరిస్థితులు, జనాభా విస్తరణ, జనసాంద్రత, ప్రజల రాజకీయకాంక్షలు లేదా నియోజకవర్గాలకు సంబంధించిన ఆకాంక్షల సమాచారాన్ని సమర్పించాలని ఆయా జిల్లా కమిషనర్లకు ఆదేశాలు జారీ చేసింది. డిసెంబర్‌ 20 నాడు ముసాయిదా డీలిమిటేషన్‌ ప్రతిపాదనలను... కమిషన్‌ అనుబంధ çసభ్యులైన జమ్మూ కాశ్మీర్‌ ఎంపీలు ఐదుగురికీ ఇచ్చి డిసెంబర్‌ 31 లోపు తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది.

జమ్మూకు లభించాల్సినంత ప్రాతినిధ్యం లభించలేదనీ, అందు వల్ల నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలనీ ఎప్పటినుంచో బీజేపీ డిమాండ్‌ చేస్తూ వస్తోంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జమ్మూలో 25 స్థానాలు గెలుచుకుని చరిత్రలో మొదటిసారిగా సంకీర్ణ ప్రభు త్వంలో భాగస్వామి అయింది. జమ్మూకు అసెంబ్లీలో తగిన ప్రాతి నిధ్యం లభించలేదంటున్న బీజేపీ వాదం సరికాదనే విమర్శా ఉంది. ఎందుకంటే గత డీలిమిటేషన్‌లో కూడా కశ్మీర్‌ లోయ కన్నా జమ్మూకే ఎక్కువ లాభం చేకూరింది. 1995లో జరిగిన నియోజక వర్గాల పునర్విభజనలో కశ్మీర్‌కు 46 సీట్లు కేటాయిస్తే, జమ్మూకు 37 స్థానాలు కేటాయించారు. అంటే మొత్తం రాష్ట్ర జనాభాలో 56.15 శాతం ఉన్న కశ్మీర్‌ జనాభాకు 55.42 శాతం ప్రాతినిధ్యం లభించిం దన్నమాట.

అదే సమయంలో 43.84 శాతం ఉన్న జమ్మూ ప్రజలకు 44.57 శాతం ప్రాతినిధ్యం లభించింది. అంతేకాక, అంతకుముందు 1957లో జమ్మూ ప్రాంతంలో ఏర్పాటు చేసిన సీట్లకు రెట్టింపు స్థానాలు జమ్మూకు లభించాయి. కాగా, కశ్మీర్‌కు మొత్తం మీద 3 సీట్లు పెరగగా, జమ్మూ సీట్లు 7  పెరిగాయి. 1957లో జరిగిన మొదటి అసెంబ్లీ ఎన్నికల నాటికి కశ్మీర్‌కు 43 స్థానాలు కేటాయించగా, జమ్మూకు 30 స్థానాలు కేటాయించారు. లద్దాఖ్‌కు 2 సీట్లు ఇచ్చారు. జమ్మూ–కశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలులోకి వచ్చిన తర్వాత లద్దాఖ్‌ ఇప్పుడు జమ్మూ–కశ్మీర్‌లో భాగం కాదన్న సంగతి తెలిసిందే. 

డీలిమిటేషన్‌ ప్రకియ అంతా ముస్లిం జనాభా అధికంగా ఉన్న రాష్ట్రంలో హిందూ ముఖ్యమంత్రిని ప్రతిష్ఠించాలన్న బీజేపీ ‘కలల ప్రాజెక్టు’ను సాకారం చేయడానికే అని కశ్మీర్‌ లోయలో అధిక జనాభా భావిస్తోంది. 1947 నుంచి జమ్మూ–కశ్మీర్‌లో ఎన్నికైన ప్రభుత్వానికి ఒక్క గులాం నబీ ఆజాద్‌ తప్ప అందరూ కశ్మీర్‌ లోయకు చెందినవారే ముఖ్యమంత్రిగా నాయకత్వం వహించారు. డీలిమిటేషన్‌ కమిషన్‌ ప్రతిపాదన కశ్మీర్‌లోయను, జమ్మూను విభజించే ధోరణిలో ఉందని కశ్మీర్‌ రాజకీయ నాయకులు మండి పడుతున్నారు. ‘‘జమ్మూ–కశ్మీర్‌ డీలిమిటేషన్‌ కమిషన్‌ ముసాయిదా ప్రతిపాదన మాకు సమ్మతం కాదు. 2011 జనాభా లెక్కల ప్రకారం జమ్మూకు 6 జీట్లు, కశ్మీర్‌కు 1 స్థానం ఇవ్వడం న్యాయం కాద’’ని మాజీ సీఎం, ఎన్‌సీ ఉపాధ్యక్షులు ఒమర్‌ అబ్దుల్లా ట్వీట్‌ చేశారు. మరో మాజీ సీఎం, పీపుల్స్‌ డెమోక్రా టిక్‌ పార్టీ (పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ... ‘‘2019 ఆగస్ట్‌లో తీసుకున్న చట్టవిరుద్ధ, రాజ్యాంగ వ్యతిరేకమైన నిర్ణ యాన్ని చట్టబద్ధం చేసే ప్రభుత్వాన్ని జమ్మూ కశ్మీర్‌లో స్థాపించడమే అసలు గేమ్‌ ప్లాన్‌’’ అని వ్యాఖ్యానించారు. ఈ ప్రతిపాదన పూర్తిగా పక్షపాతంతో కూడుకుని ఉందని, కశ్మీర్‌లో ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉన్నవారికి ఇది ఒక షాక్‌ అని పీపుల్స్‌ కాన్ఫరెన్స్‌ చైర్మన్‌ సజాద్‌ ఘనీ విమర్శించారు.

జస్టిస్‌ (రిటైర్డ్‌) రంజనా దేశాయ్‌ అధ్యక్షునిగా ఉన్న డీలిమిటేషన్‌ కమిషన్‌ విడుదల చేసిన ఒక ప్రకటనలో... మొత్తం 20 జిల్లాలను 30 కేటగిరీలుగా విభజించి, కష్టతరమైన భౌగోళిక పరిస్థితులు, ఇతర దేశాల సరిహద్దుల్లో జీవించడం వంటి విషయాలను దృష్టిలో ఉంచు కుని అదనపు నియోజకవర్గాలను కేటాయించామని తెలియజేసింది. అలాగే జనాభా ప్రాతిపదికన మొదటిసారిగా మొత్తం 90 సీట్లలో 9 సీట్లు ఎస్టీలకు, 7 సీట్లు ఎస్సీలకు కేటాయించాలని ప్రతిపాదించామని కమిషన్‌ తెలిపింది. వాస్తవానికి 2011 జనాభా గణాంకాలను చూస్తే మొత్తం 90 సీట్లలో కశ్మీర్‌కు ప్రస్తుతం ఉన్న 46 స్థానాలను 51 స్థానాలకు, జమ్మూకు ప్రస్తుత 37 సీట్లను 39కి పెంచాల్సి ఉంది.
– ఉమర్‌ మఖ్బూల్‌,శ్రీనగర్‌ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్ట్‌ (‘ది వైర్‌’ సౌజన్యంతో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement