
అడ్డం తిరిగిన ‘కథ’
ఇటలీలో ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ప్రజలు ప్రభుత్వం ప్రతిపా దించిన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో ఇటలీ ప్రధాని మాటేయో రెంజీ తన పదవికి రాజీనామా చేశారు.
ఇటలీలో ఆదివారం జరిగిన ప్రజాభిప్రాయసేకరణలో ప్రజలు ప్రభుత్వం ప్రతిపా దించిన రాజ్యాంగ సవరణకు వ్యతిరేకంగా తీర్పు చెప్పారు. దీంతో ఇటలీ ప్రధాని మాటేయో రెంజీ తన పదవికి రాజీనామా చేశారు. ఈ పరిణామాలు యూరప్‌లోని నాలుగవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన ఇటలీని మరోసారి రాజకీయ అస్థిరతలోకి నెట్టడమే కాదు, యూరోపియన్ యూనియన్‌కు, దాని కరెన్సీ యూరోకు కూడా ముప్పుగా పరిణమించేలా ఉన్నాయి.
రెంజీ 2014 ఫిబ్రవరిలో అధికార డెమోక్రటిక్ పార్టీలో తిరుగుబాటు రేపి ప్రధాని పదవిని దక్కించుకున్నారు. అతి పిన్న వయ సులో ఇటలీ ప్రధాన మంత్రి బాధ్యతలను చేపట్టినవారుగా హఠాత్తుగా ఆయన జాతీయ రంగస్థలిపైకి ప్రవేశించారు ఎడతెగని ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడు తున్న ఇటలీ ప్రజలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాలా మార్పును తెస్తా నని వాగ్దానం చేశారు. కొత్త తరం నేతగా ఆయన నిరాశానిస్పృహలలో ఉన్న యువతలో ఆశలు రేకెత్తేలా చేశారు. రాజకీయ అస్థిరతకు మారు పేరైన ఇటలీ 1945 నుంచి ఇంత వరకు 65 ప్రభుత్వాలను చూసింది. అలాంటి దేశంలో రాజ కీయ సుస్థిరత నెలకొనేలా ఎన్నికల సంస్కరణలు తెస్తున్నామంటే ప్రజలు అను కూలంగానే స్పందించారు. ఇటీవలి కాలంలో ఏ ఇటలీ ప్రధానికి లేని ప్రజాదరణ ఉన్న రెంజీ సులువుగానే తన ఎన్నికల సంస్కరణలకు వీలుగా రాజ్యాంగాన్ని సవరించగలనని విశ్వసించారు.
ఇటలీ పార్లమెంటులోని ఉభయ సభలకు సమాన అధికారాలు ఉంటాయి. ఎగువ సభ సభ్యులు దేశంలోని వివిధ ప్రాంతాలకు ప్రాతి నిధ్యం వహిస్తారు. రెంజీ తలపెట్టిన ఎన్నికల సంస్కరణలన్నీ ప్రధానంగా రెండు లక్ష్యాలతో ప్రతిపాదించినవి. ఒకటి ఎగువ సభకు, వివిధ ప్రాంతాలకు ఉండే అధి కారాలను కత్తిరించి దిగువ సభకు తద్వారా ప్రధానికి దఖలుపరచడం. రెండవది పార్లమెంటు దిగువ సభలో ఏదైనా ఒక పార్టీ అతి పెద్దదిగా ఆవిర్భవించిన వెను వెంటనే ఆ పార్టీ బలం 54 శాతం సీట్లకు చేరేలా చేయడం. సెనేట్‌గా పిలిచే ఎగువ సభ సీట్లను 100కు తగ్గించి దాన్ని లాంఛనప్రాయమైనదిగా దిగజార్చడం.
ఈ అప్రజాస్వామిక సంస్కరణలకు ప్రజామోదాన్ని తప్పక సాధించగలనే అంచనా తోనే రెంజీ ఈ రాజకీయ జూదానికి దిగారు. సరిగ్గా ఇలాగే మాజీ బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్ కూడా ఈయూ నుంచి తప్పుకోవడానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని నమ్మే ప్రజాభిప్రాయసేకరణకు దిగి పరాభవం పాలయ్యారు.
రెంజీ అంచనాలు తప్పుతాయని ఓటింగ్‌కు ముందే తేలిపోయింది. కాకపోతే దాదాపు 20 శాతం తేడాతో ప్రభుత్వ ప్రతిపాదనను తిరస్కరించే స్థాయిలో ప్రజా గ్రహం బద్ధలవుతుందని ఎవరూ ఉహించలేదు. స్థూల జాతీయోత్పత్తిలో 133 శాతం రుణంతో ఇటలీ యూరోజోన్ దేశాల్లో అతి పెద్ద రుణగ్రస్త దేశంగా ఉంది. ఈయూ పొదుపుచ ర్యలు, ద్రవ్య నియంత్రణల ఫలితంగా బ్యాంకులు సైతం నగదు కరువై కటకటలాడుతున్నాయి. ఫలితంగా నాలుగు బ్యాంకులు దివాలా తీశాయి. లక్ష యూరోల వరకు ఖాతాదార్ల డిపాజిట్లకు ప్రభుత్వం బెయిలవుట్‌ను ప్రకటించి చేతులు దులుపుకుంది. దీంతో జీవిత కాల పొదుపులన్నిటినీ కోల్పోయిన వేలాది ప్రజలు విలవిలలాడారు. ఆత్మహత్యలకు సైతం పాల్పడ్డారు.
మొత్తంగా ఇటాలియన్ బ్యాంకింగ్ వ్యవస్థే దివాళా అంచులకు చేరింది. దాదాపు 4,000 కోట్ల యూరోలను బ్యాంకులకు బెయిలవుట్‌గా అందించి వాటిని కాపాడాలని రెంజీ ప్రభుత్వం సంకల్పించింది. ప్రజల పొదుపులకు ఇవ్వలేని రక్షణను బ్యాంకులకు కల్పించడానికి ప్రస్తుత ఎన్నికల వ్యవస్థ, ప్రత్యేకించి ఎగువ సభ దీనికి ఆటంకమని భావించి రెంజీ ఎన్నికల సంస్కరణలకు తెరదీశారు. ఇప్పటికైతే డెమోక్రటిక్ పార్టీ మరో ప్రధానిని ఎన్నుకుని, ప్రభుత్వాన్ని నడిపించడం సజావుగా జరిగిపోవచ్చు. కానీ రేపు ఎన్నికలు జరిగితే బెప్పి గ్రిల్లె నేతృత్వంలోని ఫైవ్ స్టార్ పార్టీ గెలిచే అవకాశం ఉన్నదని ఈ ప్రజాభిప్రాయసేకరణ స్పష్టం చేసింది.
ఈయూ పట్ల తీవ్ర వ్యతిరేకత గల ఆ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఇటలీ ఈయూ నుంచి నిష్ర్క మిమంచే రెండో దేశం కావడం తప్పకపోవచ్చు. ఇటలీ బ్యాంకులు దివాళా తీసినా లేక ఈయూ నుంచి ఇటలీ నిష్ర్కమించినా యూరో భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారు తుంది. జూన్ 23న బ్రిటన్‌లో జరిగిన ప్రజాభిప్రాయ సేకరణలో సైతం ప్రజలు అనూహ్యమైన రీతిలో ఈయూ వ్యతిరేకతను ప్రకటించారు. ఆస్ట్రియాలో రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పచ్చి మితవాద నియో నాజీ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రమాదం కొద్దిలో తప్పిపోయింది. అయినా ఆ పార్టీ ఆధ్యక్ష అభ్యర్థికి 46 శాతం ఓట్లు లభించడం కీలకమైన అంశం. యూరప్ అంతటా పెరుగుతున్న సంప్రదాయే తర, అతి వాద వామపక్షాలు, పచ్చిమితవాద పార్టీలన్నీ ఈయూకు వ్యతిరేకమైనవే. బ్రెగ్జిట్ మొదలు అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ విజయం వరకు, ఇటలీ, ఆస్ట్రియా పరిణామాలూ ప్రజల్లో ప్రస్తుత వ్యవస్థపట్ల వ్యతిరేకత బలంగా ఉన్నదని స్పష్టం చేస్తున్నాయి. ఆ విషయాన్ని ఈయూ గుర్తిస్తున్నట్టు కనబడదు.
1950లలో బొగ్గు, ఉక్కు పరిశ్రమల కూటమిగా ప్రారంభమైన ఈయూ నేడు దేశాలకు అతీ తమైన సూపర్ నేషనల్ సంస్థగా మారింది. సభ్య దేశాలకు సంబంధించిన ప్రతి అంశాన్ని శాసించేదిగా మారింది. జాతీయ ప్రభుత్వాలకు జవాబుదారీ వహించా ల్సిన పని లేని, ప్రజలు ఎన్నుకోని యూరోపియన్ కమిషన్ (ఈసీ) సభ్యులు దేశాల ఆర్థిక వ్యవస్థలను శాసిస్తున్నారు. వివిధ దేశాల మంత్రులతో కూడిన ఈయూ కౌన్సిల్, ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులతో కూడిన ఈయూ పార్లమెంటు అధికారాలు నామమాత్రమైనవే. పైగా అన్ని ఈయూ సభ్య దేశాలూ అమలు చేయాల్సిన కీలక నిర్ణయాలన్నిటినీ నేటికీ ఆరు వ్యవస్థాపక దేశాలే చేస్తున్నాయి. జాతీయ ప్రభుత్వాలకు తమ ప్రయోజనాలను పరిరక్షించుకునే సొంత ఆర్థిక, వాణిజ్య విధానాలను రచించుకుని ఒప్పందాలను చేసుకునే స్వేచ్ఛ ఉండేలా ఈయూను ప్రజాస్వామీకరించాలనే సూచనలను బ్రెగ్జిట్ షాక్ తర్వాత సైతం ఈయూ పెడచెవిన పెడుతోంది. ఇప్పటికైనా ఈయూ తన వైఖరిని మార్చుకోకపోతే అప్రతిష్టాకరంగా చరిత్ర రంగస్థలి నుంచి తప్పుకోవాల్సి రావచ్చు.