
చట్టం ఫిరాయింపుదార్ల చుట్టమా?
రెండో మాట
ఒక పార్టీ తరఫున ఎన్నికైన లెజిస్లేటర్లలో మూడింట ఒక వంతు సభ్యులు మరొక పార్టీలో విలీనం కావడానికి నిర్ణయిస్తే దానిని ఇంతకు ముందు చట్టం అనుమతించేది. కానీ 2003లో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ వెసులుబాటును మార్చింది. కానీ ‘గొర్రెలు తినేవాడికి బదులు, బర్రెలు తినేవాడు వచ్చాడు’ అన్నట్టు సభ్యులలో మూడింట రెండువంతులు సమ్మతిస్తే ఆమోదించాలని అవకాశవాద సవరణ తెచ్చారు. ఇదొక తాతాచార్యుల ముద్ర.
‘లెజిస్లేటర్లు (శాసనకర్తలు) ఏ పార్టీ అభ్యర్థులుగా ఎన్నికలలో నిలబడి గెలిచారో, ఆ పార్టీకి కట్టుబడి ఉండకుండా మరో పార్టీలోకి అర్ధంతరంగా ఫిరాయించడం అనే రోగం 1967 సాధారణ ఎన్నికల తరువాత రాష్ట్రాలలో విస్తృతంగా వ్యాపించడం మొదలైంది. ఆ తరువాత ఈ గోడదూకుళ్లను కట్టడి చేస్తూ వచ్చిన చట్టం కూడా రాష్ట్రాల స్థాయిలో లెజిస్లేటర్ల ఫిరాయింపులను నిరోధించడంలో విఫలమవుతూ వచ్చింది. చట్టంలో అనేక బలహీనతలు చోటు చేసుకున్నాయి.’
న్యాయశాస్త్ర కోవిదుడు ఆచార్య ఎం.పి. జైన్ (ఇండియన్ కానిస్టిట్యూషనల్ లా: 2011)
భారత రాజ్యాంగం ఆచరణలో సక్రమంగా అమలు కాకపోవడానికి కారణం రాజ్యాంగ పత్రం కాదు, దానిని అమలు పరిచే పాలకులేనని డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ చెప్పారు. అనంతరకాలాలలో పాలకులు రాజ్యాంగానికి చేసిన సవరణల చట్టాలలోని లొసుగుల వల్లనే ప్రజాస్వామిక వ్యవస్థ దేశంలో మూడుపూవులు, ఆరుకాయలుగా పరిఢవిల్లడంలో విఫలమవుతున్నదన్న సంగతి కూడా వాస్తవం. దీని దుష్ఫలితాన్ని నేడు ప్రజలూ, వ్యవస్థలూ అనుభవించడం చూస్తున్నాం.
లెజిస్లేచర్లలో మెజారిటీ పాలక పక్షాలు మైనారిటీలుగా తారుమారు కావడానికీ, మైనారిటీలో ఉన్న ప్రతిపక్షాలు మెజారిటీ సంతరించుకోవడానికీ; ప్రభుత్వాలు కుప్పకూలడానికీ ఈ ఫిరాయింపులే కారణమవుతున్నాయి. పెట్టుబడిదారీ ప్రపంచంలో పలుచోట్ల ఉన్న పరిమిత ప్రజాస్వామ్యంలో ఇలాంటి తమాషా అరుదే అయినా, ఎదిగీ ఎదగని ఇండియా వంటి భారీ అసమ వ్యవస్థలో మైనారిటీ ప్రజాస్వామ్యం ప్రభావం వల్ల మనది ‘ఫిరాయింపుల డెమోక్రసీ’గానే చూడవలసి వస్తున్నది. చివరికి పరిస్థితులు ఏ స్థితికి దిగజారిపోతున్నాయంటే పాలకులూ, రాజకీయులే కాకుండా, ఇటీవల అవినీతిలో భాగ స్వాములుగా అనేక సందర్భాలలో బయటపడిన క్రికెట్ నిర్వహణ సంస్థలు, క్రికెట్ బోర్డు వంటి సంస్థలు కూడా సుప్రీంకోర్టును ‘పరిమితులు దాటుతోంద’ని విమర్శించే సాహసం చేస్తున్నాయి. ఆ సంస్థల, బోర్డుల ప్రైవేటు వ్యవహారాలలో న్యాయస్థానాలు జోక్యం చేసుకోవడం వాటికి నచ్చడం లేదు.
ఈ జాడ్యం పాలకుల నుంచి సంక్రమించింది. న్యాయ వ్యవస్థల నిర్వహణలో కూడా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ ఒక్క విషయంలో రాజ్యాంగం ఆ వ్యవస్థకు ప్రత్యేక అధికారాలు కల్పించింది. అదేమిటంటే- ప్రభుత్వ చట్టాలకూ, లెజిస్లేచర్ల నిర్ణయాలకూ భాష్యం చెప్పే హక్కు. తన అవినీతికర చర్యలను మార్చుకోవడానికీ లేదా సంస్కరించుకోవడానికీ క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నట్టేనా? అని ఒక సందర్భంలో సుప్రీంకోర్టు నిగ్గుతీయవలసి వచ్చింది.
1967 తరువాతి పరిణామం
లెజిస్లేటర్ల ఫిరాయింపులను అరికట్టడానికీ, ప్రవేశపెట్టిన చట్టాన్ని ఉల్లంఘిస్తున్న పాలక, ప్రతిపక్షాల ఎత్తుగడలకు అడ్డుకట్ట వేయడానికీ న్యాయస్థానాలు చేస్తున్న యత్నాలు పూర్తిగా సఫలం కావడం లేదు. ఇంతకూ ఎక్కడుంది అసలు లోపం? రాజ్యాంగంలో భాగంగా అవతరించిన పదో షెడ్యూలు ఆసరాగా 1985లో 52వ సవరణ ద్వారా ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందింది. ఈ షెడ్యూలు కిందనే, ఈ ఫిరాయింపుల నిరోధక చట్టం కిందనే సుప్రీంకోర్టు అనేక తీర్పులు (1993/1994/1996లలో) ఇచ్చింది. పాలకపక్షం తరఫున, ప్రతిపక్షాల సహకారంతో శాసనసభలకు స్పీకర్లుగా ఎంపికైన సభాపతులు తీసుకున్న పాక్షిక నిర్ణయాలను కూడా ఆ తీర్పులు ప్రశ్నించాయి, విమర్శించాయి. నిజానికి ఫిరాయింపుల నిరోధక చట్టంలో చేయవలసిన మార్పులనూ సుప్రీంకోర్టు పరామర్శించింది. 1967 ఎన్నికల తరువాతనే ఫిరాయింపుల సమస్య దేశానికీ, న్యాయస్థానాలకూ ఎందుకు ప్రశ్నార్థకమైంది? 1950ల నాటికి గానీ, 1960 తొలిదశకు గానీ దేశంలో బహుళ రాజకీయ వ్యవస్థ రూపుదాల్చలేదు.
అందుకే ఫిరాయింపులు, వాటితో వచ్చే దుష్ఫలితాలు అప్పటికి అనుభవంలో లేవు. 1967లో పదహారు రాష్ట్రాలలో ఎన్నికలు జరిగాయి. అప్పుడు కాంగ్రెస్ మెజారిటీ కోల్పోయింది. ఒక్క రాష్ట్రంలో మాత్రం ఆ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగలిగింది. సరిగ్గా ఈ పరిణామం నేపథ్యంగానే, ఆ సంవత్సరం నుంచే సంకీర్ణ ప్రభుత్వాల ఏర్పాటుకు కూడా రంగం సిద్ధమైంది. లెజిస్లేటర్లు ఫిరాయింపులకు పాల్పడడానికి ‘ఉప్పు’ అందించింది కూడా ఈ దశే. 1967 - 1971 మధ్య దేశంలో 142 మంది పార్లమెంట్ సభ్యులు, 1900 మంది శాసనసభల సభ్యులు తమ తమ పార్టీలకు చెల్లుచీటీలిచ్చి, ప్రలోభాలకు లోనై వలసల స్థాయిలో ఇతర పార్టీలలోకి దూకడం జరిగింది. హరియాణాలో ఆరంభమైన ఈ తతంగం మిగతా రాష్ట్రాలలో ప్రభుత్వాలు కూలిపోయే వరకు సాగింది.
ఈ వలసలన్నీ, ‘ముఖ్యమంత్రి పదవి సహా అనేక పదవులు తాయిలం చూపడం వల్ల లేదా మనం గౌరవంగా ఇక్కడ చెప్పుకోవడానికి వీల్లేని పద్ధతుల ద్వారానూ సంభవించాయి’ (ప్రొఫెసర్ ఎం. పి. జైన్). ఇంత అనుభవం తరువాత మాత్రమే ఈ ఫిరాయింపుల డెమోక్రసీకి సవరణ చట్టం తేవడానికి, అది కూడా లోపభూయిష్టంగానే- పాలకులు ముందుకు వచ్చారు. ఈ చట్టంలో ఉన్న ప్రధానమైన బలహీనత లేదా లోపం ఏమిటి?
కోరలు లేని చట్టం
ఒక లెజిస్లేటర్ వ్యక్తిగత స్థాయిలో పార్టీ ఫిరాయిస్తే ఈ చట్టం శిక్షించగలుగుతుంది. కొందరు సభ్యులు మూకుమ్మడిగా పార్టీ ఫిరాయిస్తే దానిని ఆ పార్టీలో చీలికగానే ఈ చట్టం పరిగణిస్తుంది. దీనికి శిక్ష లేదు. ఎందుకని? ఫిరాయింపుల మీద నిర్ణయం ప్రకటించే అధికారం స్పీకర్‌కు ఉన్నా తటస్థ వ్యక్తిగా వ్యవహరించడానికి ఆయన తటపటాయిస్తున్నాడు. స్పీకర్ తన పార్టీ ‘మైకం’ నుంచి బయటపడలేకపోతున్నాడు. స్పీకర్‌గా ఎన్నికైన వ్యక్తి తన పార్టీ నుంచి తాత్కాలికంగా తెగతెంపులు చేసుకున్నట్టు కనిపించినా, విపక్షం అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి వీలులేని వాతావరణాన్ని అధికారపక్షం నుంచే కల్పించుకుంటున్నాడు. లొసుగుల కారణంగా ఈ ధోరణికి కూడా చట్టం అడ్డుకట్ట వేయలేకపోతున్నది. ఈ ధోరణి తీవ్రత ఎలాంటిది? ఆ తీవ్రతకు తొలి ఉదాహరణగా గయాలాల్ అనే హరియాణా శాసనసభ్యుడు ఒకే రోజు మూడు పార్టీలు మార్చాడు. అప్పటి నుంచి ‘ఆయారామ్-గయారామ్’ అని రాజకీయ నిఘంటువులో ఫిరాయింపుదారులకు ఒక మారుపేరు అవతరించింది.
1991లో తమిళనాడులో ఇద్దరు అభ్యర్థులు ఏఐఏడీఎంకే తరఫున గెలిచారు. తరువాత మరొక పార్టీలోకి ఫిరాయించారు. అయితే తాము ఇండిపెండెంట్లమని వారు వాదించబోతే సుప్రీంకోర్టు నోటికి కళ్లెం వేసింది. ఆ శాసనసభ్యులను అనర్హులనే తేల్చింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి గెలిచి పార్టీ మారినా శాసన సభ్యత్వానికి అతడిని అనర్హుడిగానే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అలాగే ఒక సభ్యుడు స్పీకర్‌గా ఎన్నికైతే తను ఎన్నికైన పార్టీకి రాజీనామా చేయవచ్చు. ఐదేళ్ల కాలం పూర్తయిన తరువాత మళ్లీ సొంత పార్టీలో చేరినా ఆయన మీద అనర్హత వేటు పడదని చట్టం భరోసా ఇస్తోంది. ఈ మినహాయింపు క్లాజునూ మార్చవలసి ఉంది. అలాగే ఒక పార్టీ తరఫున ఎన్నికైన లెజిస్లేటర్లలో మూడింట ఒక వంతు సభ్యులు మరొక పార్టీలో విలీనం కావడానికి నిర్ణయిస్తే దానిని ఇంతకు ముందు చట్టం అనుమతించేది. కానీ 2003లో వచ్చిన 91వ రాజ్యాంగ సవరణ చట్టం ఈ వెసులుబాటును మార్చింది. కానీ ‘గొర్రెలు తినేవాడికి బదులు, బర్రెలు తినేవాడు వచ్చాడు’ అన్నట్టు సభ్యులలో మూడింట రెండువంతులు సమ్మతిస్తే ఆమోదించాలని అవకాశవాద సవరణ తెచ్చారు. ఇదొక తాతాచార్యుల ముద్ర. ఆ ముద్ర నుంచి వీపు తప్పించుకున్నా, భుజం తప్పించుకోలేకపోయిందని అంటారు పెద్దలు. అయితే సభ్యులు ఒక బృందంగా గానీ, వ్యక్తులుగా గానీ పార్టీ ఫిరాయించాలంటే శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి, మళ్లీ ఎన్నికలకు వెళ్లవలసిందేనని అదే 91వ సవరణ స్పష్టం చేసిందన్న వాస్తవం మరచిపోరాదు.
ఫిరాయింపులను ప్రశ్నించే హక్కు ఇంతకు ముందు ఏ న్యాయస్థానానికీ ఉండేది కాదు. కానీ ఈ తప్పుడు క్లాజును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఫిరాయింపు నిరోధక చట్టం అప్పటినుంచి న్యాయవ్యవస్థ సమీక్షా పరిధిలోకి వచ్చిందన్న నిజాన్ని పాలకులు విస్మరించరాదు.
ఈ పూర్వరంగంలో ఆ మూడింట రెండువంతుల మెజారిటీ కోసమే చంద్రబాబు ప్రభుత్వం గానీ, కేసీఆర్ ప్రభుత్వం గానీ అడ్డదారులు తొక్కుతున్నాయి. అసలు ప్రతిపక్షాన్నే ఖాళీ చేయించే వ్యూహంతో అవసరం ఉన్నా లేకున్నా చెరొక డజను లేదా రెండు డజన్ల మంది ప్రతిపక్ష సభ్యులను ఇప్పటికే బజారుకెక్కిన ప్రలోభాలకు గురిచేశారు. దీని దుష్ఫలితాలకు 1993, 1994, 1996 నాటి సుప్రీంకోర్టు తీర్పులతో పాటు ప్రజాబాహుళ్యం కూడా సాక్ష్యంగా నిలుస్తాయి.
వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు
abkprasad2006@yahoo.co.in