‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. ఇదొక్కటే కాదు లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ అంబేడ్కర్ గురించి వెల్లడించిన నమ్మశక్యం కాని నిజం. రాజ్యాంగ పరిషత్తుకు అంబేడ్కర్ ఏనాడూ నేరుగా ఎన్నికవలేదన్నదీ అలాంటి వాస్తవమే. 1945–46 ఎన్నికల్లో అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నిక కాలేకపోయినప్పుడు ఆయనకు స్థానం కల్పించడం కోసం ముస్లిం లీగ్ శాసనసభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ తన స్థానాన్ని త్యాగం చేశారు. అంబేడ్కర్ ఆనాడు పరిషత్తు సభ్యుడిగా లేకుంటే భారతదేశానికి ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది.
మన జాతిరత్నాల గురించి నిజంగా మనకు తెలుసునా? వాళ్లను మనం పీఠాలపై ప్రతిష్ఠించుకుని గౌరవించుకుంటాం. వారి గురించి తరచుగానూ, అనర్గళంగానూ మాట్లాడు కుంటూ ఉంటాం. వాళ్ల మాటల్ని కూడా యథాతథంగా స్వీకరించి మన జీవితాలకు బాటలు పరుచుకుంటాం. అయితే అదంతా వేరు, వాళ్ల గురించి తెలియడం వేరు. ఇటీవల నేను చదివిన ఒక పుస్తకం బి.ఆర్.అంబేడ్కర్ గురించి నాకు తెలియని అనేకమైన విషయాలను వెల్లడించింది. అవేవీ వాస్తవ విరుద్ధమైనవి కావు. అలాగే సుప్రసిద్ధమైనవి కూడా! అయితే అవి అందరికీ తెలిసిన మనిషిగా అంబేడ్కర్‌లో భాగమై ఉన్నవి కావు. ఎలాంటివంటే, నిజంగా ఆయనొక స్వాతంత్య్ర సమరయోధుడు కాదని మీకు తెలుసా? 1942 నుండి 1946 వరకు ఆయన వైస్రాయ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్‌లో కార్మిక శాఖ మంత్రిగా ఉన్నారు. అంతకు ముందు, 1931లో ఆయన: ‘‘బ్రిటిష్ వారి నుండి భారత ప్రజలకు తక్షణ అధికార మార్పిడి జరగాలని అణగారిన వర్గాలవారు (అప్పుడు షెడ్యూల్డ్ కులాలు అని పిలిచేవారు) నిరసించలేదు. నినదించలేదు. ఉద్యమించలేదు’’ అని వ్యాఖ్యానించి ఉన్నవారు.
ఈ విషయాన్ని నేను అశోక్ లాహిరి పుస్తకం ‘ఇండియా ఇన్ సెర్చ్ ఆఫ్ గ్లోరీ’ నుంచి గ్రహించాను. ‘‘స్వాతంత్య్ర పోరాటంలో అంబేడ్కర్ పోషించిన పాత్రేమీ లేకపోవడం అన్నది ఆయన అద్భుతమైన జీవన ప్రగతిలో అత్యంత వివాదాస్పదమైన అంశం’’ అంటాడు అశోక్ లాహిరి. అది నన్నెంతో విస్మయానికి గురి చేసిందని నేను ఒప్పుకొని తీరాలి. అయితే ఇదొక్కటి మాత్రమే కాదు లాహిరి పుస్తకం బహిర్గతం చేసిన నమ్మలేని నిజం. అంబేడ్కర్ అసలు రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికే కాలేదని తెలుస్తోంది. 1945–46 ఎన్నికల్లో ఆయన పార్టీ ‘ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ ఫెడరేషన్’ (ఎస్.సి.ఎఫ్.) 151 రిజర్వుడు సీట్లలో కేవలం రెండింటిని మాత్రమే గెలుచుకుంది. ‘బాంబే ప్రొవిన్షి యల్ అసెంబ్లీ’ నుంచి ఎస్.సి.ఎఫ్. ఒకే ఒక్క సీటును గెలుచుకున్న ఫలితంగా అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తు సభ్యుడు కాలేకపోయారు.
దాన్ని మించిన పరాజయం... అంబేడ్కర్‌కు మద్దతు ఇచ్చేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడం! ‘‘డాక్టర్ అంబేడ్కర్‌కు రాజ్యాంగ పరిషత్తు తలుపులతో పాటుగా కిటికీలు కూడా మూసి వేయబడ్డాయి’’ అని సర్దార్ పటేల్ ప్రకటించారు. ‘‘చూద్దాం... రాజ్యాంగ పరిషత్తులోకి అతడెలా ప్రవేశిస్తాడో’’ అని కూడా అన్నారు. ఆ పరిస్థితుల్లో ముస్లిం లీగ్ శాసన సభ్యుడు జోగేంద్రనాథ్ మండల్ కాస్తా అంబేడ్కర్ వైపు నిలబడ్డారు. అంబేడ్కర్ కోసం తన సీటును త్యాగం చేశారు. అలా మండల్‌తో పాటు ఒకరిద్దరు ఎస్సీ ఎమ్మెల్యేలు, ఒకటీ లేదా రెండు ఆంగ్లో–ఇండియన్ ఓట్లతో బెంగాల్ నుంచి అంబేడ్కర్ రాజ్యాంగ పరిషత్తుకు ఎన్నికయ్యారు.1947 జూలైలో మళ్లీ ఆయన ఇబ్బందుల్లో పడ్డారు. బ్రిటిష్ పార్లమెంటు భారత స్వాతంత్య్ర చట్టాన్ని ఆమోదించిన తర్వాత ఇండియాకు ఒకటి, పాకిస్థాన్‌కు ఒకటిగా రాజ్యాంగ పరిషత్తు విభజన జరిగింది. పర్యవసానంగా బెంగాల్ నుంచి అనేకమంది సభ్యులు తమ భారత రాజ్యంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోయారు. వారిలో అంబేడ్కర్ ఒకరు.
అయితే మళ్లొకసారి ఆయన్ని ఊహించని అదృష్టం కాపాడింది. కాంగ్రెస్ పార్టీతో విభేదాల కారణంగా ఎం.ఆర్. జయకర్ రాజీనామా చేయడంతో ఆయన స్థానం ఖాళీ అయింది. అంతేకాదు... ఈసారి భారతదేశంలోని ప్రముఖ రాజకీయ నాయకులు అంబేడ్కర్ సభ్యత్వా నికి తోడ్పాటును అందించేందుకు íసిద్ధమయ్యారు. వారిలో రాజ్యాంగ పరిషత్తు చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ ఒకరు. అప్పటి బొంబాయి ప్రధానమంత్రి బి.జి.ఖేర్‌కు ఆయన లేఖ రాశారు. ‘‘ఏ ఇతర పరిగణనలతోనూ నిమిత్తం లేకుండా తన సేవలను ఎవరూ వదులుకోలేని విధంగా ఉన్న ఆయన పనితీరును మాత్రమే గుర్తిస్తూ రాజ్యాంగ పరిషత్తులో, వివిధ కమిటీలలో ఆయన నియామకానికి ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. ఆయన బెంగాల్ నుంచి ఎన్నిక య్యారని మీకు తెలిసిందే! ఆ ప్రావిన్సు విభజన వల్ల 1947 జూలై 14 నుంచి ఆయన తన రాజ్యాంగ పరిషత్తు సభ్యత్వాన్ని కోల్పోవలసి వచ్చింది కనుక వెంటనే ఆయనను ఎన్నుకోవలసిన అవసరం ఉంది’’ అని అంబేడ్కర్‌కు ఆసరాగా నిలిచారు.
చివరికి పటేల్ కూడా అంబేడ్కర్ పట్ల తన వైఖరి మార్చు కున్నారు. అంబేడ్కర్‌కు సభ్యత్వం ఇప్పించేందుకు ఖేర్‌ను ఒప్పించడంతో పాటు, జయకర్ రాజీనామా వల్ల ఏర్పడిన ఖాళీని భర్తీ చేయ బోయిన జి.వి. మావలంకర్‌కు నచ్చజెప్పి, ఆయన్ని పక్కకు తప్పించ డంలో పటేల్ కీలకమైన పాత్ర పోషించారని లాహిరి రాశారు. అంటే దేశానికి ఇది త్రుటిలో తప్పిన ముప్పు. అంబేడ్కర్ కనుక ఆనాడు రాజ్యాంగ పరిషత్తులో సభ్యుడిగా లేకపోయుంటే ఎలాంటి రాజ్యాంగం తయారై ఉండేదో ఊహించండి. ప్రజాస్వామ్యానికి మాతృమూర్తి అని మనం నేడు చెప్పుకుంటున్న దేశం తన రాజ్యాంగ పితను కోల్పోయి ఉండేది.
ఈ పుస్తకంలోని నమ్మశక్యం కాని వాస్తవాలు నాలా మీలోనూ జనింపజేసే అవకాశం ఉన్న ఒక ప్రశ్నను లేవనెత్తడం ద్వారా నేను ఈ వ్యాసాన్ని ముగిస్తాను. అంబేడ్కర్‌కు, బహుశా భారతదేశానికి కూడా మార్గనిర్దేశం చేసిన హస్తం ఏదైనా ఉండిందా? అంబేడ్కర్ మన రాజ్యంగ పరిషత్తులో భాగం అని నిర్ధారించడానికి ఎవరిదైనా, లేదా ఏదైనా గట్టిగా ప్రభావం ఉన్నట్లు కనిపిస్తోంది. వాళ్లెవరు? అది ఏమిటి? అన్నదే ఆ ప్రశ్న.
వ్యాసకర్త సీనియర్ జర్నలిస్ట్
Comments
Please login to add a commentAdd a comment