వీడు అసలు మనిషేనా! ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు.. | Kakinada Devika Murder Case: Forensic Experts Probe, Post Mortem Report | Sakshi
Sakshi News home page

Kakinada Devika Murder Case: ఎముకలు విరిగేంత బలంగా 15 కత్తిపోట్లు

Published Mon, Oct 10 2022 3:09 PM | Last Updated on Mon, Oct 10 2022 3:27 PM

Kakinada Devika Murder Case: Forensic Experts Probe, Post Mortem Report - Sakshi

వెంకట సూర్యనారాయణను కట్టేసిన స్థానికులు.. దేవిక (ఇన్‌సెట్‌)

తన ప్రేమను కాదందన్న అక్కసుతో మానవ మృగంలా మారిపోయి యువతిని దారుణంగా హతమార్చాడో దుర్మార్గుడు. కత్తిలో నరికి అత్యంత దారుణంగా అమాయకురాలిని పొట్టన పెట్టుకున్నాడు. ఉన్మాదిలా మారి తమ కూతురి ప్రాణం బలిగొన్న రాక్షసుడిని ఉరి తీయాలని హతురాలి కుటుంబీకులు డిమాండ్‌ చేస్తున్నారు.


కాకినాడ క్రైం:
ప్రేమోన్మాది గుబ్బల వెంకట సూర్యనారాయణ చేతిలో హతమైన కాదా దేవికపై జరిగిన దాడి అత్యంత పాశవికమైనదని ఫోరెన్సిక్‌ నిపుణులు నిర్ధారించారు. కాకినాడ జీజీహెచ్‌లో దేవిక మృతదేహానికి ఆదివారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. వారి నివేదిక ప్రకారం.. దేవికను నిందితుడు కత్తితో విచక్షణా రహితంగా పొడిచాడు. దీంతో ఆమె ముఖం, మెడ భాగాల్లో లోతైన గాట్లు పడ్డాయి. 

సూర్యనారాయణ ఆమె కాలర్‌ బోన్‌లో కత్తి దింపి ఎడమ వైపునకు చీల్చేశాడు. రెండువైపులా నరకడంతో మెడలోని రక్తనాళాలు పూర్తిగా తెగిపోయాయి. దేవిక మరణానికి అదే కారణమని గుర్తించారు. విచక్షణారహితంగా కత్తితో పొడుస్తూండటంతో దేవిక రెండు చేతులూ అడ్డం పెట్టి రక్షించుకునే ప్రయత్నం చేసింది. అయితే అంతకు మించిన బలంతో అతడు కత్తితో పొడవడంతో దేవిక రెండు మోచేతుల పైభాగాల్లో లోతైన గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే ఆమె ఎడమ చేతి ఎముకను సత్యనారాయణ నరికేశాడు. 

ఆమె రెండు భుజాలు శరీరం నుంచి వేరు పడ్డాయి. ఎడమ భుజానికి ఆధారమైన హ్యూమరస్‌ ఛిద్రమైంది. అక్కడి ఎముకలో సైతం కత్తి దిగింది. కత్తి నేరుగా మెడలో దించిన ఆనవాళ్లున్నాయి. దేవిక శరీరంలో మొత్తం 15 బలమైన గాయాలున్నట్టు పోస్టుమార్టం నివేదికలో పేర్కొన్నారు.


ఆ రాక్షసుడిని ఉరి తీయాలి

చదువు పూర్తి చేసుకుని, ఉద్యోగం చేసుకుంటుందనుకుంటే ఇలా దారుణంగా హత్యకు గురవుతుందని ఊహించలేదని దేవిక కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు. తమ వద్దే పెరిగి, చదువుకుంటోందని, ఉద్యోగం వస్తే కళ్లలో పెట్టుకుని చూసుకుంటుందని అనుకుంటే దేవుడు అన్యాయం చేశాడంటూ దేవిక అమ్మమ్మ బోరున రోదించింది. అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటుందని హైదరాబాద్‌లో తాము నిశ్చింతగా ఉంటే కిరాతకుడి చేతిలో తమ కూతురు బలైపోయిందని దేవిక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. తమ కుమార్తెని హత్య చేసిన రాక్షసుడిని ఉరి తీయాలని డిమాండ్‌ చేశారు. (క్లిక్‌: ప్రేమోన్మాది ఘాతుకం.. పట్టపగలే నడిరోడ్డుపై కిరాతకం)


దేవిక కుటుంబానికి ప్రభుత్వం అండ: మంత్రి చెల్లుబోయిన వేణు 

రామచంద్రపురం/కె.గంగవరం: ప్రేమోన్మాది చేతిలో అత్యంత కిరాతకంగా హత్యకు గురైన కాదా దేవిక కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలబడి ఆదుకుంటుందని రాష్ట్ర బీసీ సంక్షేమం, సమాచార, పౌర సంబంధాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అన్నారు. కరప మండలం కూరాడలో హత్యకు గురైన కాదా దేవిక తల్లిదండ్రులను, ఇతర కుటుంబ సభ్యులను మంత్రి వేణు కె.గంగవరంలో ఆదివారం సాయంత్రం పరామర్శించి ఓదార్చారు.

ఈ సందర్భంగా మంత్రి వేణు మాట్లాడుతూ ఆటవికంగా హత్యకు పాల్పడిన హంతకుడిపై ప్రభుత్వం తర్వతగతిన విచారణ పూర్తి చేసి కఠిన చర్యలు తీసుకుంటుందన్నారు. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు రాజకీయాలు ప్రస్తావించకూడదని, ప్రతి ఒక్కరూ ఇలాంటి దుశ్చర్యలను ఖండించాలన్నారు. ప్రభుత్వం మహిళలకు అండగా ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవాని, కె.గంగవరం మండల విప్‌ కొప్పిశెట్టి లక్ష్మణ్, శెట్టిబలిజ సంఘం అధ్యక్షుడు నరాల ఏడుకొండలు, వైఎస్సార్‌సీపీ నాయకుడు పంపన సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement