అందమైన వాతావరణం.. ప్రణాళిక ప్రకారం నిర్మించిన ఇళ్లు.. అంతర్గత రహదారులు, నీటి సరఫరా లాంటి సకల సదుపాయాలతో కనిపిస్తున్న ఈ పునరావాస కాలనీ తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరులో ఉంది. కాలనీ పనులను పర్యవేక్షిస్తున్న గృహనిర్మాణ శాఖ ఈఈ శ్రీనివాసరావును ‘సాక్షి’ పలకరించగా నిర్వాసితులకు వేగంగా పునరావాసం కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు. ఇళ్ల నిర్మాణం పూర్తయిందని, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాల పనులను పక్షం రోజుల్లోగా పూర్తి చేస్తామని తెలిపారు.
సాక్షి, అమరావతి: ఆయకట్టు రైతులకు చేకూరే ప్రయోజనాలకు దీటుగా, పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గోదావరిలో వరద ప్రవాహం పెరిగేలోగా 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని 17,760 నిర్వాసిత కుటుంబాలకు పునరావాస పనులను శరవేగంగా చేసేందుకు రూ.3,383.31 కోట్లు ఖర్చు చేస్తోంది. 45.72 మీటర్ల కాంటూర్ పరిధిలోని మిగిలిన 84,731 నిర్వాసిత కుటుంబాలకు దశలవారీగా పునరావాసం కల్పించాలని నిర్ణయించింది. మొత్తమ్మీద నిర్వాసితులకు సహాయ పునరావాసం కల్పించడానికి రూ.24,249.14 కోట్లను వ్యయం చేయనుంది.
నాడు అరకొర పునరావాసం.. అస్తవ్యస్తంగా పనులు
పోలవరం నిర్మాణం వల్ల ఉభయ గోదావరి జిల్లాల్లోని 373 గ్రామాలు ముంపునకు గురికావటంతో పాటు 1,05,601 కుటుంబాలు నిర్వాసితులుగా మారతారు. వారికి ‘భూసేకరణ చట్టం–2013’ ప్రకారం పునరావాసం కల్పించాలి. అయితే కమీషన్ల కోసం పోలవరాన్ని ఏటీఎంలా మార్చుకున్న గత సర్కార్ పునరావాస కల్పనపై దృష్టిపెట్టకుండా కేవలం 3,110 కుటుంబాలకు మాత్రమే అరకొర పునరావాసంతో సరిపెట్టింది. కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో ఆ కుటుంబాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. గత సర్కారు గోదావరి ప్రవాహాన్ని మళ్లించడానికి వీలుగా స్పిల్‌వేను పూర్తి చేయకుండానే ఎర్త్ కమ్ రాక్‌ఫిల్ డ్యామ్ నిర్మాణం కోసం ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్‌ల నిర్మాణాన్ని ప్రారంభించింది. కానీ ఆ పనులను ఆదిలోనే వదిలేయడంతో వరద ప్రవాహానికి కాఫర్ డ్యామ్‌లు అడ్డంకిగా మారి గతేడాది గోదావరి వరద ముంపు గ్రామాలను చుట్టుముట్టింది. ఫలితంగా ముంపు గ్రామాల ప్రజలు అవస్థలు ఎదుర్కొన్నారు.
పునరావాసంపై నేడు ప్రత్యేక దృష్టి..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగానే పోలవరం ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ వహించారు. నిర్వాసితుల పునరావాసం, స్పిల్ వే, కాఫర్ డ్యామ్‌ల పనులను సమన్వయం చేసుకుంటూ 2021 డిసెంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం వల్ల లబ్ధి పొందే రైతుల కంటే మిన్నగా నిర్వాసితుల జీవన ప్రమాణాలుండేలా
పునరావాసం కల్పించాలని ఆదేశించారు.
► గిరిజనులకు రూ.3.59 లక్షలు. గిరిజనేతరులకు రూ.3.34 లక్షలతో 379.25 చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం ఉండేలా పక్కా ఇళ్లను కట్టి నిర్వాసితులకు ఇవ్వాలని ఆదేశించారు. పునరావాస కాలనీలకు విద్యుత్, తాగునీరు తదితర సౌకర్యాలన్నీ కల్పించాలన్నారు. పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రం, గ్రామ సచివాలయం, ఆరోగ్య కేంద్రం కూడా నిర్మించాలని ఆదేశించారు.
► గిరిజనులకు భూమికి బదులుగా రెండెకరాల సాగు భూమిని సేకరించి ఇవ్వాలని ఆదేశించారు. నిర్వాసితులకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలని నిర్దేశించారు.
► గోదావరికి వరద పెరిగేలోగా 41.15 కాంటూర్ పరిధిలోని 17,760 కుటుంబాలకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. మిగిలిన కుటుంబాలకు దశలవారీగా వేగంగా పునరావాస కల్పనకు చర్యలు చేపట్టాలని సూచిస్తూ పనుల పర్యవేక్షణకు పోలవరం అడ్మినిస్ట్రేటర్‌గా ఐఏఎస్ అధికారి ఓ.ఆనంద్‌ను నియమించారు.
శరవేగంగా పనులు..
► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలోని ముంపునకు గురయ్యే 69,686 ఎకరాలకుగానూ 68,087.88 ఎకరాలను సేకరించారు. మరో 1600.50 ఎకరాలను సేకరణకు కసరత్తు చేస్తున్నారు. సేకరించిన భూమికి రూ.3,304.6 కోట్లను పరిహారంగా చెల్లించారు. మిగిలిన భూసేకరణకు రూ.273.43 కోట్లు ఖర్చు చేయనున్నారు.
► 41.15 మీటర్ల కాంటూర్ పరిధిలో ముంపునకు గురయ్యే 98 గ్రామాల్లోని 17,760 కుటుంబాల ప్రజలకు ఉభయ గోదావరి జిల్లాల్లో 47 పునరావాస కాలనీల్లో ఇళ్లను నిర్మిస్తున్నారు. పునరావాసం కల్పించే సమయంలో ఒక్కో కుటుంబానికి రూ.6.36 లక్షలను పరిహారం ఇవ్వనున్నారు. గిరిజన కుటుంబాలకు మరో రూ.50 వేలను జత చేసి రూ.6.86 లక్షలను అందజేయనున్నారు.
► నిర్వాసితులకు వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించనున్నారు.
కష్టాలు గట్టెక్కుతున్నాయి
వరద కష్టాలు గట్టెక్కే రోజు వస్తోంది. మూడేళ్లుగా ఈ రోజుల కోసం కళ్లలో ఒత్తులు వేసుకుని మరీ ఎదురు చూస్తున్నాం. ఎంత కాలానికి జగనన్న పుణ్యమాని అనుకున్నది అవుతోంది. ఏటా జూలై వస్తుందంటే వరదలకు ఎక్కడ తల దాచుకోవాలా అని భయపడే వాళ్లం. మరో నెల రోజుల్లో పునరావాస కాలనీకి వెళ్లే సంతోషంలో ఉన్నాం.. – గురుగుల సుబ్బరాజు, దేవీపట్నం.
కల నెరవేరుతోంది..
నిత్యం గోదావరి ఆటుపోట్ల మధ్య బతుకు దుర్భరంగా ఉండేది. కాలనీ పూర్తయిందని అధికారులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మొన్నామధ్య వరదలు వచ్చినప్పుడు మా కష్టాలను గట్టేక్కిస్తానని చెప్పారు. మాట ప్రకారం కాలనీలు పూర్తి చేశారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కల నెరవేరబోతోంది. – కొమరం పోచమ్మ, రమణయ్యపేట, దేవీపట్నం మండలం
Comments
Please login to add a commentAdd a comment