వెనామీ రొయ్యల పట్టుబడి , పట్టుబడి చేసిన వనామీ రొయ్యలు
సాక్షి, అమలాపురం: కరోనా దెబ్బకు ఆక్వా మరింత కుదైలేంది. గత మూడు నెలలు నుంచి ఎగుమతులు నిలిచిపోయి. ధరలు పడిపోయి ఆందోళనలో ఉన్న రైతులకు..తాజా లాక్‌డౌన్‌తో ప్రొసెసింగ్ ప్లాంట్లు కూడా మూతపడడంతో కొనేవారు కూడా లేక లబోదిబోమంటున్నారు. ఒకవైపు చెరువుల్లో పలు రకాల వైరెస్ విజృంభిస్తుండడంతో పట్టుబడులు చేస్తున్నా...కొనేవారు లేకపోవడంతో భారీ నష్టాలను చవిచూడనున్నారు. కరోనా ప్రభావంతో చైనా, అమెరికా, యూరప్ దేశాలకు వనామీ రొయ్యల ఎగుమతులు దాదాపుగా నిలిచిపోయాయి. దీంతో గడిచిన మూడు నెలలుగా ఆక్వా రైతులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో పెద్దగా పట్టుబడులు జరగకున్నా మార్చి నెల నుంచి జోరందుకున్నాయి.
కౌంట్ రాకున్నా వైట్ స్పాట్‌తోపాటు ఇతర వైరెస్‌ల కారణంగా కౌంట్‌తో సంబంధం లేకుండా పట్టుబడులు చేస్తున్నారు. అయితే వీటిని కొనేవారు లేకుండా పోయారు. జిల్లాలో అధికారికంగాను, అనధికారికంగాను కలిపి సుమారు 62 వేల ఎకరాల్లో వెనామీ సాగు జరుగుతోంది. ఇప్పుడు 80 శాతం విస్తర్ణంలో సాగు జరుగుతుండగా, ఎకరాకు కనీసం 2 టన్నులకుపైగా దిగుబడిగా వస్తుంది. పట్టుబడులు జోరుగా సాగుతున్నందున ఒక్క మార్చి నెల 15 నుంచి ఏప్రిల్ 20 మధ్యన సుమారు 74 వేల మెట్రిక్ టన్నుల రొయ్యలు మార్కెట్‌కు రానున్నాయని అంచనా. వైరెస్‌ల కారణంగా అల్లవరం, అమలాపురం, ఉప్పలగుప్తం, ముమ్మిడివరం, తాళ్లరేవు, కాట్రేనికోన మండలాల్లో పట్టుబడులు జోరుగా సాగుతున్నాయి.
రొయ్యలు కొనేవారు లేకుండా పోవడంతో రైతులకు ఏం చేయాలో పాలుపోకుండా పోయింది. అంతర్జాతీయంగా ఎగుమతులు లేకుండా పోవడంతో ఎగుమతిదారులు కొనుగోలు పూర్తిగా నిలిపివేశారు. దీనికి తోడు స్థానికంగా నిల్వ చేసే కోల్డ్ స్టోరేజ్‌లను ఆదివారం జనతా కర్ఫ్యూ, సోమవారం నుంచి మార్చి 31 వరకు లాక్ డౌన్ కారణంగా మొత్తం వీటిని మూసివేయాలని అధికారులు ఆదేశించారు. వీటిలో పనిచేసే కారి్మకులు ఇళ్లకు పరిమితం కావడం, అక్కడక్కడా వస్తున్నా పోలీసులు అడ్డుకోవడంతో కొనుగోలు మొత్తం నిలిచిపోయింది.
జిల్లాలో ప్రధాన ఎగుమతి కంపెనీలకు చెందిన కోల్డ్‌స్టోరేజ్‌లు సుమారు 54 వరకు ఉన్నాయని అంచనా. సామర్థ్యాన్ని బట్టి 5 వేలు నుంచి పది వేల మెట్రిక్ టన్నుల నిల్వ సామర్ధ్యం ఉంది. సుమారు రెండు లక్షల మంది కారి్మకులు పనిచేస్తున్నారు. కారి్మకులు ప్లాంట్‌లకు రాకపోవడానికి తోడు, మూడు నెలలుగా ఎగుమతులు నిలిచిపోయి కోల్డ్‌స్టోరేజ్‌లు నిండుకున్నాయని ఎగుమతిదారులు చెబుతున్నారు. దీనివల్ల ఇప్పుడు పట్టుబడుగా వస్తున్న రొయ్యలను కొనుగోలు చేయలేమని వారు చేతులు ఎత్తివేస్తున్నారు.
అంతర్జాతీయంగా కాకుండా జాతీయ, స్థానిక మార్కెట్‌కు సైతం రొయ్యలు వెళ్లే పరిస్థితి లేదు. అమలాపురం, మలికిపురం, ఉప్పాడ, తొండంగి, తాళ్లరేవు, కాట్రేనికోన వంటి ప్రాంతాల్లో చిన్నచిన్నగా కొనుగోలు చేసే రొయ్యల కేంద్రాలు సైతం లాక్‌డౌన్‌తో మూతపడ్డాయి. వీటి ద్వారా రోజుకు కనీసం 5 టన్నుల వరకు రొయ్యలు కొనుగోలు చేస్తారు. అంతరాష్ట్రాల రవాణా బంద్ కావడం, బస్సులు, లారీలు తిరగకపోవడంతో వీరు కొనుగోలు చేసినా సరుకు బయటకు వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది.
నిత్యావసర వస్తువుల జాబితాలో చేర్చండి: మంత్రులను కోరిన ఆక్వా రైతులు
రొయ్యలను నిత్యవసర వస్తువుల జాబితాలో చేర్చాలని కోనసీమ ఆక్వా రైతులు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖమంత్రి పినిపే విశ్వరూప్, జిల్లా ఇన్‌చార్జిమంత్రి, మత్స్యశాఖమంత్రి మోపిదేవి వెంకటరమణ, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్‌లను విజ్ఞప్తి చేశారు. కోనసీమ ఆక్వా రైతులు అమలాపురంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. రైతులు విపత్కర పరిస్థితుల్లో ఉన్నందున ప్రభుత్వం స్పందించాలని వారు వేడుకున్నారు. దీనిపై మంత్రులు విశ్వరూప్, మోపిదేవి, ఎమ్మెల్యే పొన్నాడలకు ఫోన్‌లు చేసి తమ సమస్యలను ఏకరువుపెట్టుకున్నారు.
దీనిపై స్పందించిన మంత్రులు జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి రొయ్యల రవాణా వరకు అనుమతులు ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారని కోనసీన ఆక్వా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రమేష్‌రాజు ‘సాక్షి’కి తెలిపారు. ఇప్పుడు పరిస్థితుల్లో ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోకపోతే వారు ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితి ఉత్పన్నమవుతుందని అల్లవరానికి చెందిన ఆక్వారైతు గుండెపూడి రాంబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వాను నిత్యావసర వస్తువుగా పరిగణించి స్థానికంగా కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేందుకు అనుమతులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ఆక్వా ఎగుమతులు, కొనుగోలు, రవాణాకు ప్రభుత్వం అంగీకారం
లాక్‌డౌన్ నుంచి మినహాయింపునిస్తూ జీవో జారీ చేసిన ప్రభుత్వం ఆక్వా ఎగుమతులు కొనుగోలు చేసే కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు, ఆక్వా ఉత్పత్తులను ఒకచోట నుంచి మరో చోటుకు రవాణా చేసేందుకు ప్రభుత్వం అనుమతిని తాజాగా ఇవ్వడంతో ఊపిరి పీల్చుకుంటున్నారు. వీటిని లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం ఈ మేరకు సోమవారం జీవో జారీ చేసింది.
అగ్రికల్చర్ అండ్ కో ఆపరేషన్, యానిమల్ హజ్బెండరీ, డెయిరీ డెవలప్‌మెంట్, ఫిషరీస్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పూనం మాలకొండయ్య జీవో 209ని విడుదల చేశారు. వీటిని అన్ని జిల్లాల కలెక్టరేట్లకు పంపించారు. ప్రస్తుతం ఆక్వాలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా హేచరీలు, ప్రాసెసింగ్ సెంటర్లు, ఆక్వా మేత, మందుల దుకాణాలు, హేచరీల నుంచి పిల్ల రవాణా, రొయ్యల రవాణాలకు లాక్‌డౌన్ నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment