కాకినాడ బ్యాంక్ పేట ప్రాంతంలో పరిస్థితిని మున్సిపల్ అధికారులతో సమీక్షిస్తున్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి
సాక్షి, కాకినాడ: కరోనా మహమ్మారి జిల్లాను అతలాకుతలం చేస్తోంది. జిల్లాలో బుధవారం నాటికి ఆరుగురిలో పాజిటివ్ లక్షణాలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. మరో 97 మందిని వైరాలజీ టెస్టులు చేసేందుకు కాకినాడ జీజీహెచ్‌కు తరలించి చర్యలు తీసుకుంటోంది. రాజమహేంద్రవరం, కాకినాడ నగరాలతోపాటు పెద్దాపురం, పిఠాపురం ప్రాంతాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడమే కాకుండా రాజమహేంద్రవరంలో ఒక వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన విషయం తెలిసిందే. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడ, పెద్దాపురాల్లోని ఇద్దరు వ్యక్తుల్లో కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపించింది. (కరోనా : అమెరికాలో ఒక్క రోజులోనే 884 మంది మృతి)
దీంతో కాకినాడలోని కొంత భాగాన్ని జిల్లా యంత్రాంగం రెడ్ జోన్‌గా ప్రకటించింది. ఆ ప్రాంతంలో గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేసి నియంత్రణ చర్యలు చేపట్టింది. వీరిలో రాజమహేంద్రవరానికి చెందిన ఇద్దరు, కాకినాడకు చెందిన ఇద్దరు, పెద్దాపురానికి చెందిన ఒకరు, పిఠాపురానికి చెందిన ఒకరిలో కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నారు. రాజమహేంద్రవరం శాంతినగర్‌లో పాజిటివ్ వచ్చిన రోగి కోడలు (36), మనవడు (18), మనుమరాలు (16)కు సైతం పాజిటివ్‌గా తేలింది.
తేరుకోకపోతే ముప్పే..
పాజిటివ్ వచ్చిన వ్యక్తులు, ఢిల్లీకి వెళ్లి వచ్చినట్లు అధికారులు నిర్ధారించిన 25 మంది ఎక్కడెక్కడ తిరిగారు, ఎవరెవరిని కలిశారనే విషయాలు రాబట్టడంలో అధికారులు తలమునకలయ్యారు. ఢిల్లీతోపాటు ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ స్వచ్ఛందంగా వచ్చి సంబంధిత అధికారులను సంప్రదించాలని జిల్లా కలెక్టర్ డి.మురళీధర్‌రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు. అందరికీ ఉచిత వైద్య నిర్ధారణతో పాటు చికిత్స కూడా అందజేస్తామన్నారు. (కేవలం 29 సబ్జెక్టులకే పరీక్షలు )
రెవెన్యూ, పోలీస్, వైద్యాధికారులతో ర్యాపిడ్ యాక్షన్, జాయింట్ యాక్షన్ కమిటీలు ఏర్పాటు చేయడంతోపాటు జిల్లా, పట్టణ, మండల, గ్రామ స్థాయి అధికారుల సమన్వయంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితులను గురించి ఈ కమిటీలు అధికారులకు నివేదికలిస్తున్నాయి. ఇతర దేశాలు, రాష్ట్రాలు, ఢిల్లీ నుంచి వచ్చిన వారి వివరాలను తెలిపేలా కలెక్టరేట్‌లో ప్రత్యేక అత్యవసర విభాగాన్ని ఏర్పాటు చేశారు.
వైఎస్సార్ గార్డెన్స్ ప్రాంతంలో హై అలర్ట్
పిఠాపురం: ఒక యువకుడికి కరోనా పాజిటివ్ రావడంతో పట్టణ ప్రజలు ఉలిక్కిపడ్డారు. స్థానిక వైఎస్సార్ గార్డెన్స్ ఏరియాలో అధికారులు హై అలెర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వెళ్లి వచ్చిన కాకినాడకు చెందిన ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రాగా ఆ వ్యక్తి గత 20వ తేదీన పిఠాపురం వచ్చి ఇక్కడ ఒక విశ్రాంత పోలీసు అధికారి, సహకార సంఘం నాయకుడు తదితర 20 మంది వ్యక్తులతో గడిపినట్టు తేలింది. వారందరినీ గుర్తించిన అధికారులు కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. వారిలో పిఠాపురం వైఎస్సార్ గార్డెన్స్‌లో నివాసముంటున్న ఒక 20 ఏళ్ల యువకుడికి పాజిటివ్ రిపోర్టులు రావడంతో అంతటా అప్రమత్తమైంది.
బుధవారం ఇలా..
జిల్లాలో బుధవారం ఒక్క రోజే 90 నమూనాలు పరీక్షించగా.. 69 నెగిటివ్, 5 పాజిటివ్, 16 ఫలితాలు రావాల్సి ఉంది.
కేసులపై నిరంతర నిఘా...
జిల్లా కరోనా అనుమానిత కేసులపై అధికారులు పర్యవేక్షిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా రూరల్, అర్బన్ ప్రాంతాల్లో 17,658 మందిపై పర్యవేక్షణ కొనసాగుతోంది.
165 క్వారంటైన్ కేంద్రాలు:
జిల్లా వ్యాప్తంగా ‘కోవిడ్–19’ వైరస్ అనుమానితులకు వైద్య సేవలు అందించేందుకు 165 క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు. అందులో 6509 పడకలు సిద్ధంగా ఉంచారు. 3441 మంది స్వీయ గృహ నిర్బంధంలో ఉన్నారు. 351 మంది క్వారంటైన్ కేంద్రాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment