ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్ వద్ద సోడియం హైపో క్లోరైట్ పిచికారీ చేస్తున్న పారిశుధ్య సిబ్బంది
సాక్షి, చీరాల: జిల్లాలో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. మూడు రోజుల క్రితం వరకు లండన్ వెళ్లి వచ్చిన యువకునికి తప్ప అతని కుటుంబ సభ్యులకు సైతం నెగిటివ్ రిపోర్టు రావడంతో జిల్లా ప్రజలు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ తరుణంలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన ఓ మతపెద్ద ద్వారా అతని భార్య, కుమారునితోపాటు మరో ఏడుగురికి సైతం కరోనా వైరస్ సోకినట్లు నిర్ధారణ కావడంతో జిల్లా అధికారులతోపాటు ప్రజలు భయకంపితులయ్యారు. ఇప్పటి వరకు జిల్లాలో 11 పాజిటివ్ కేసులు నమోదు కాగా, అందులో 10 కేసులు ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చినవారు, వారితో సన్నిహితంగా మెలిగిన వారే కావడం గమనార్హం. (అమెరికాలో ఒక్కరోజే 865 కరోనా మరణాలు!)
జిల్లాలో నమోదైన 11 పాజిటివ్ కేసుల్లో అత్యధికంగా చీరాలలో 4 కేసులు నమోదు కాగా, కందుకూరులో 3, ఒంగోలు నగరంలో 2, కనిగిరి, కారంచేడులో ఒక్కొక్కటి చొప్పున కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను హైరిస్క్ జోన్లుగా పేర్కొంటూ రెడ్ అలర్ట్ ప్రకటించారు. జిల్లాలో ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 280 మందిలో సుమారు 100 మందికి పైగా ఆచూకీ తెలియలేదు. వీరందరూ స్వచ్ఛందంగా క్వారంటైన్ కేంద్రాలకు వచ్చి వైద్య చికిత్స పొందాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ కోరారు. అంతే కాకుండా వీరి ఆచూకీ కోసం ప్రత్యేక టాస్‌్కఫోర్స్ బృందాలు వెతుకులాట ప్రారంభించాయి. (కౌలాలంపూర్ నుంచి అంటుకుందా? )
ఒంగోలు నగరంలో పాజిటివ్ కేసులు నమోదైన వ్యక్తి భార్య ఆ చుట్టు పక్కల పిల్లలకు ట్యూషన్ చెప్పిందని గుర్తించిన అధికారులు ట్యూషన్‌కు వెళ్లే పిల్లలను గుర్తించి కుటుంబ సభ్యులందరినీ మంగళవారం క్వారంటైన్ కేంద్రాలకు తరలించారు. ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారితో పాటు వైరస్ సోకిన వ్యక్తులతో సన్నిహితంగా ఉన్న వారందరినీ గుర్తించి దగ్గరలోని క్వారంటైన్ కేంద్రాలకు తరలించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు. జిల్లాలో ఉన్న 10 క్వారంటైన్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 696 మంది ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. ఒంగోలు జీజీహెచ్‌లో ఐసోలేషన్ వార్డులో ఉన్న వారితోపాటు జిల్లా వ్యాప్తంగా సుమారు 80 మంది అనుమానిత లక్షణాలు ఉన్న వారి శాంపిల్స్‌ను ల్యాబ్‌లకు పంపగా వారి రిపోర్టులు రావాల్సి ఉంది. జిల్లాలో ఇప్పటికే 11 కేసులు నమోదు కాగా ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన సర్వత్రా నెలకొంది
ఢిల్లీలో ఇస్తిమాకు హాజరైన 14 మందిని క్వారంటైన్‌కు తరలించడంతో నిర్మానుష్యంగా ఇస్లాంపేట
చీరాలలో..
చీరాల ప్రాంతం కరోనా కోరల్లోకి వెళ్లింది. ఢిల్లీలో మతపరమైన కార్యక్రమానికి జిల్లా నుంచి 280 మంది వెళ్లగా వారిలో 80 మంది చీరాల పరిసర ప్రాంత ప్రజలు కావడం విశేషం. చీరాల మండలంలోని సాల్మన్‌సెంటర్ పంచాయతీ నవాబుపేటలో భార్యభర్తలకు కరోనా పాజిటివ్ రావడంతో జిల్లా యంత్రాంగం ఉలిక్కిపడింది. మార్చి 12 చీరాల మండలం సాల్మన్‌సెంటర్ పంచాయతీలోని నవాబుపేటకు చెందిన వ్యక్తితో పాటు మరో ఏడుగురు ఇస్తిమాకు చీరాల నుంచి ఢిల్లీ వెళ్లారు. చీరాలలో నాలుగు పాజిటివ్ కేసు నమోదు కావడంతో జిల్లా యాంత్రాంగం చూపు చీరాలపై పడింది. జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు మొత్తం హుటాహుటిన చీరాలకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. నవాబుపేటకు చెందిన భార్యభర్తలకు పాజిటివ్ రావడంతో శనివారం ఆయన కుటుంబంతో సహ గృహనిర్భందంలోకి వెళ్లారు.
నవాబుపేట, పేరాల ప్రాంతాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. రహదారులు మూతపడ్డాయి. చీరాలలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. కంట్రోల్ రూం నెం. 08594–232327 కు ఎవరైనా అనుమానిత కేసులు ఉంటే సంప్రదించాలన్నారు. అలానే అనుమానిత కేసులు తరలించేందుకు మూడు అంబులెన్స్‌లు ఏర్పాటు చేశారు. చీరాల ప్రాంతాన్ని కంటోన్మెంట్ జోన్‌గా ఏర్పాటు చేసి జిల్లా పరిషత్ సీఈఓ, డీవైఎంహెచ్‌ఓ చీరాలలోనే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. నవాబుపేటలో రాకపోకలపై పూర్తిగా ఆంక్షలు విధించారు. వలంటీర్లు, ఏఎన్‌ఎంలు సర్వేలు నిర్వహిస్తున్నారు.
కందుకూరులో..
కందుకూరు పట్టణలంలో కరోనా కలకలం రేపింది. పట్టణానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో తీవ్ర ఆందోళనకర వాతావరణం నెలకొంది. కరోనా సోకిన ముగ్గురు వ్యక్తులు ఢిల్లీలో ప్రార్థనకు వెళ్లి వచ్చిన వారే కావడం, వారు పట్టణంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొనడంతో ప్రజలు హడలి పోతున్నారు. ప్రస్తుతం కరోనా సోకిన వ్యక్తులు ఎవరెవరిని కలిశారు, ఏ కార్యక్రమాల్లో పాల్గొన్నారనే దానిపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఢిల్లీ నుంచి వచ్చిన వ్యక్తులకు కరోనా పాజిటివ్‌గా తేలుతుండడంతో రెండు రోజుల క్రితం వీరిని ఒంగోలు రిమ్స్‌కు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఈ ముగ్గురికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో పట్టణంలో ఒక్కసారిగా కలకలం రేగింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 రోజులపాటు వీరు పట్టణంలో తిరగడంతోపాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడమే ఇందుకు కారణం. ప్రస్తుతం ఈ ముగ్గురు కుటుంబ సభ్యులను అధికారులు ఒంగోలు రిమ్స్‌కు తరలించారు.
ఆయా ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. మక్కా మసీద్‌లో ఇమామ్‌గా పనిచేసిన వ్యక్తి గత శుక్రవారం మసీదులో జరిగిన నమాజ్‌లో పాల్గొన్నారు. ఈ నమాజ్‌లో 80 మంది వరకు పాల్గొన్నట్లు గుర్తించారు. అలాగే బూడిదపాలేనికి చెందిన వ్యక్తి లింగసముద్రంలో ల్యాబ్ టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. ఈయన 50 మందికి పైగా రక్త పరీక్షలు చేసినట్లు తేలింది. వారిలో 42 మంది క్వారంటైన్‌కు స్వయంగా వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌రెడ్డి మాట్లాడుతూ.. విక్కిరాలపేటరోడ్డు, బూడిదపాలెం, మక్కామసీదు, పోతురాజుమిట్ట ప్రాంతాలను రెడ్ అలెర్ట్ జోన్స్‌గా ప్రకటిస్తున్నామని తెలిపారు. ప్రజలు అర్ధం చేసుకుని స్వియ నియంత్రణలో ఉండాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం కందూరుకు ఇన్‌చార్జిగా జెడ్పీ సీఈఓ కైలాస్‌గిరీశ్వర్, ఆర్డీఓ ఓబులేసు, డీఎస్పీ శ్రీనివాసులు, కమిషనర్ మనోహర్, వైద్యాధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు.
కనిగిరిలో..
ఢిల్లీలో నిజాముద్దీన్ ఇస్తిమాకు వెళ్లి వచ్చిన కనిగిరికి చెందిన ఏడుగురిని క్వారంటైన్ సెంటర్‌కు తరలించిన సంగతి విధితమే. వారిలో అర్బన్ కాలనీకి చెందిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో అతని కుటుంబంలోని 11 మంది, సన్నిహితులైన నలుగురు మొత్తం 15 మందిని క్వారంటైన్ సెంటర్‌కు తరలిస్తున్నట్లు కమిషనర్ డీవీఎస్ నారాయణరావు తెలిపారు. అలాగే కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తితో పూర్తిగా దగ్గరగా వ్యవహరించిన ఇద్దరు వ్యక్తులను కూడా ఒంగోలుకు తరలించినట్లు సమాచారం. కరోనా పాజిటివ్ వ్యక్తి నివాసం నుంచి 300 మీటర్ల మేర రెడ్‌జోన్‌గా ప్రకటించారు.
అ ప్రాంతంలోని అన్ని గృహాల్లో వైద్య, మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు సర్వే చేపట్టారు. కరోనా బాధితుడు నివాసం ఉంటున్న అర్బన్ కాలనీ ప్రాంతాన్ని ఎమ్మెల్యే బుర్రా మధుసుదన్ యాదవ్‌తో పాటు, జెడ్పీ సీఈఓ కైలాష్ గిరీశ్వర్, నియోజకవర్గ ప్రత్యేక అధికారి నర్శింహారావు, వైద్యులు, వివిధ శాఖల అధికారులు సందర్శించారు. కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తి జనతా కర్ఫ్యూ రోజున పోలీసులు, జర్నలిస్టులకు వాటర్ బాటిళ్లు, పండ్లు వగైరా పంపిణీ చేశాడు. ఈ నెల 23 నుంచి ఇప్పటి వరకు అతనికి దగ్గరగా వ్యవహరించిన వ్యక్తులు ఎవరనే దానిపై పూర్తిగా వివరాలు సేకరించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.
కారంచేడులో..
మండలంలోని కుంకలమర్రు గ్రామంలో మంగళవారం కరోనా పాటిజివ్ కేసు నమోదు కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ఒంగోలు ఆర్డీఓ ప్రభాకరరెడ్డి హుటాహుటిన గ్రామానికి చేరుకున్నారు. రెవెన్యూ, వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు తమ సిబ్బందిని అప్రమత్తం చేశారు. వలంటీర్లను, ఆశా, ఏఎన్‌ఎంలను రంగంలోకి దించారు. మంగళవారం ఆర్డీఓ కారంచేడు ఎంపీడీఓ కార్యాలయ సమావేశ మందిరంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను అప్రమత్తంగా ఉంచాలన్నారు. గ్రామంలో మొత్తం 12 బృందాలను ఏర్పాటు చేసి గ్రామంలోని ప్రతి ఇంటినీ జల్లెడపడతారన్నారు.
పాజిటివ్ వచ్చిన వ్యక్తితో అతి సన్నిహితంగా ఉన్న వారి పేర్లుతోపాటు, వారి ఆరోగ్య పరిస్థితిని నమోదు చేస్తామన్నారు. గ్రామానికి ఇరువైపులా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గ్రామంలోకి ఎవరూ రావద్దని, గ్రామస్తులు కూడా ఎవరూ బయటకు వెళ్లవద్దంటూ సూచించారు. గ్రామం మొత్తం సోడియం హైపోక్లోరైట్ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో డీవైఎంహెచ్‌ఓ డాక్టర్ మాధవీలత, ఇన్‌చార్జి తహసీల్దార్ బ్రహ్మయ్య, ఎంపీడీఓ ప్రద్యుమ్నకుమార్, వైద్య సిబ్బంది, రెవెన్యూ, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
జిల్లాకు కోవిడ్ హాస్పిటల్‌గా నెల్లూరు వైద్యశాల
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కోవిడ్ పాజిటివ్ కేసుల ఆరోగ్యం మెరుగుపడకపోతే వారిని నెల్లూరు జిల్లా వైద్యశాలకు తరలించనున్నారు. నెల్లూరు జిల్లా వైద్యశాలను పూర్తిస్థాయి కోవిడ్ వైద్యశాలగా మార్చారు. అక్కడ పూర్తి వెంటిలేటర్ల సౌకర్యంతోపాటు కోవిడ్‌కు అందించే అధునాతన వైద్య పరికరాలను ప్రభుత్వం సమకూర్చింది. అయితే ఒంగోలు జీజీహెచ్‌లో ఉన్న కోవిడ్ 19 అనుమానితులందరూ ఆరోగ్యంగానే ఉన్నారు. వీరికి కోవిడ్ 19 జిల్లా నోడల్ అధికారి డాక్టర్ జాన్ రిచర్డ్స్ ఆధ్వర్యంలోని వైద్య బృందం చికిత్స అందిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment