ఫైల్ ఫోటో
సాక్షి, కర్నూలు: కరోనావైరస్ (కోవిడ్-19) మహమ్మారికి లాక్‌డౌన్, క్వారంటైన్‌తో కళ్లెం వేయాలని చూసిన ప్రభుత్వం, జిల్లా యంత్రాంగానికి కొత్త సమస్య ఎదురైంది. ఢిల్లీలో మతపరమైన ప్రార్థనలకు వెళ్లి వచ్చిన వారిలో కరోనా లక్షణాలు ఉన్నట్లు పలు జిల్లాల్లో తేలడం, అక్కడికి వెళ్లొచ్చిన వారిలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వాసులే అధికంగా ఉండటంతో అధికారులు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమై..రానున్న పెనుముప్పును నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఢిల్లీని నుంచి వచ్చిన వారిని గుర్తించి క్వారంటైన్‌కు చేర్చిన అధికారులు.. వారి సన్నిహితులు, నివాస ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. (అమెరికాను వణికించిన భూకంపం )
కరోనా వైరస్ విదేశాల నుంచి వస్తున్న వారితో ఇండియాలో వ్యాపిస్తోందని ప్రాథమిక దశలో గుర్తించిన ప్రభుత్వం వెంటనే వారిపై దృష్టి సారించింది. విమానాశ్రయాల్లో స్క్రీనింగ్ చేయించడంతో పాటు అనుమానితులను క్వారంటైన్‌లో ఉంచింది. అయితే ఆలస్యంగా వెలుగుచూసిన ఢిల్లీ ఘటన ఇతర ప్రాంతాలతో పాటు కర్నూలు జిల్లా వాసులనూ కలవరపెడుతోంది. మార్చి 13 నుంచి 15 వరకు ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో గల మర్కజ్‌లో మతపరమైన ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారిలో కొందరికి కరోనా సోకడం, తెలంగాణలో మరణాలు కూడా సంభవించడంతో అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి.(కరోనా: మరో ప్రముఖ నటుడు మృతి )
మన ప్రభుత్వం కూడా వెంటనే సర్వే చేయించింది. ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో అత్యధికంగా కర్నూలు జిల్లా వాసులు 258 మంది ఉన్నట్లు ఇప్పటిదాకా గుర్తించారు. అందులోనూ కర్నూలు, నంద్యాల, ఆళ్లగడ్డ, చాగలమర్రి, ఆదోని ప్రాంత వాసులు ఎక్కువగా ఉన్నారు. అదీగాక 60 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉండడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమై.. వీరిని రాయలసీమ యూనివర్సిటీ, ట్రిపుల్ ఐటీల్లోని క్వారంటైన్ సెంటర్లలో చేర్చుతోంది. ఇప్పటిదాకా 188 మందిని క్వారంటైన్‌కు తరలించింది. 43 మందిని హోం ఐసోలేషన్‌లో ఉంచింది.12 మంది ఇతర రాష్ట్రాలకు వెళ్లినట్లు గుర్తించింది. మరో 15 మంది ఆచూకీ దొరకలేదు.
సర్కారు పటిష్ట చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కరోనా కట్టడికి జిల్లా అధికారులు గట్టి చర్యలు చేపట్టారు. లాక్‌డౌన్‌ను పక్కాగా అమలు చేస్తున్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతాల నుంచి వాహనాల రాకపోకలు నిలిపేశారు. ఇప్పటి వరకూ 23 మందిని ఐసోలేషన్‌లో ఉంచి..వైద్యపరీక్షలు నిర్వహించారు. వీరిలో 13 మందికి కరోనా లేదని తేలింది. సంజామల మండలం నొస్సంలో ఉండే రాజస్థాన్ యువకుడికి పాజిటివ్ వచ్చింది. మరో 9 మంది రిపోర్టులు రావాల్సి ఉంది.
ప్రస్తుత పరిస్థితిపై ఆరా
ఢిల్లీకి వెళ్లొచ్చిన వారిలో ఎక్కువమంది కర్నూలు వాసులే ఉండటంతో ప్రస్తుత పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్నితో పాటు వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక సీఎస్ జవహర్‌రెడ్డి కలెక్టర్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.
పెనుముప్పుపై అప్రమత్తం
ఢిల్లీ నుంచి వచ్చిన వారు 20 రోజులుగా జనం మధ్యనే తిరిగారు. ఒకవేళ వారికి పాజిటివ్ వస్తే వారి ద్వారా ఇంకెంతమందికి వ్యాపించి ఉంటుందోనని అధికారులు హైరానా పడుతున్నారు. ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా, ఇలాంటి తప్పిదాలు కరోనా వ్యాప్తికి కారణమవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. అందుకే ఢిల్లీకి వెళ్లిన వారి కుటుంబ సభ్యులు సైతం హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు. వారి సన్నిహితులపైనా దృష్టి సారించారు. కరోనా బాధితులకు చికిత్స అందించేందుకు ముందస్తు జాగ్రత్తగా కర్నూలు సర్వజనాస్పత్రితో పాటు విశ్వభారతి, శాంతిరామ్ బోధనాస్పత్రులను ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకుంది.
వీటిలో వెంటిలేటర్లతో పాటు అవసరమైన అన్ని సదుపాయాలు పూర్తిస్థాయిలో కలి్పంచారు. అవసరమైతే జిల్లాలోని మరిన్ని ప్రైవేటు ఆస్పత్రులను ఆ«దీనంలోకి తీసుకుని వైద్యం అందించేందుకు అధికారులు సిద్ధమయ్యా రు. వైద్యులు, నర్సుల కొరత లేకుండా ఉండేందుకు ఇప్పటికే వైద్య ఆరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. రిటైర్డ్ సిబ్బందితో పాటు ప్రైవేటు ఆస్పత్రుల సిబ్బంది సేవల వినియోగానికి ఏర్పాట్లు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment