ఢిల్లీలో బుధవారం నిజాముద్దీన్ మసీదు పరిసరాలను శుభ్రం చేసిన ప్రభుత్వ సిబ్బందితో భౌతిక దూరం పాటిస్తూ ఇంటర్వూ్య చేస్తున్న మీడియా ప్రతినిధులు
న్యూఢిల్లీ: గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 376 కొత్త కరోనా కేసులు, మూడు మరణాలు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం ప్రకటించింది. ఢిల్లీలో జరిగిన తబ్లిగి జమాత్‌కు హాజరై ‘కరోనా’తో తిరిగి స్వస్థలాలకు వెళ్లిన వారి వల్ల ఒక్కసారిగా కేసుల సంఖ్య పెరిగిందని వివరించింది. అంతేకానీ, ఇది దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ట్రెండ్ కాదని స్పష్టం చేసింది. కరోనాతో ఇప్పటివరకు 1,637 కేసులు, 38 మరణాలు నమోదయ్యాయని వెల్లడించింది. అలాగే, 132 మంది చికిత్స అనంతరం కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారని తెలిపింది. వీరిని మినహాయిస్తే చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య 1,446కి చేరుతుందని పేర్కొంది. ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించి బుధవారం కొత్తగా 154 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రటరీ లవ్ అగర్వాల్ వెల్లడించారు. వీటిలో జమ్మూకశ్మీర్ నుంచి 23, ఢిల్లీ నుంచి 18, తమిళనాడు నుంచి 65 ఉన్నాయన్నారు. (యూరప్‌లో 30 వేల మంది మృతి)
రాష్ట్రాల లెక్క వేరే
అయితే, వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రకటించిన సమాచారం ప్రకారం, కేసుల సంఖ్య 1,910గా, మృతుల సంఖ్య 58గా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బుధవారం సుమారు 400 కొత్త కేసులు, కనీసం 11 మరణాలు నమోదైనట్లు రాష్ట్రాల గణాంకాలు వెల్లడిస్తున్నాయి. మొత్తం కేసుల సంఖ్య ఢిల్లీలో 152కి, మహారాష్ట్రలో 335కి పెరిగిందని ఆయా రాష్ట్రాలు ప్రకటించాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 33 కొత్త కేసులు నమోదవగా, అందులో 30 ఒక్క ముంబైలోనే నమోదయ్యాయి. బుధవారం మహారాష్ట్రలో కోవిడ్–19తో ఆరుగురు మరణించారు. దాంతో, రాష్ట్రంలో మొత్తం మరణాల సంఖ్య 16కి చేరింది. కాగా, ప్రస్తుతం మహారాష్ట్రలో క్వారంటైన్‌లో ఉన్న 5 వేల మందిలో అత్యధికులు హై రిస్క్ కేటగిరీలో ఉన్న నేపథ్యంలో.. కేసుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు.
తమిళనాడులో మొత్తం కేసుల సంఖ్య 234కి చేరింది. వీటిలో 110 కేసులు ఢిల్లీలోని తబ్లిగి జమాత్‌కు హాజరైనవారికి సంబంధించినవే కావడం గమనార్హం. ఢిల్లీ జమాత్‌కు హాజరైన వారిలో ఉత్తరప్రదేశ్‌లో 569 మందిని, గుజరాత్‌లో 85 మందిని, కర్ణాటకలో 50 మంది విదేశీయులను క్వారంటైన్ చేశారు. గుజరాత్ నుంచి భారీగా దాదాపు 1,500 వరకు ఆ మత సమావేశాలకు హాజరయినట్లు సమాచారం. అస్సాం నుంచి ఢిల్లీ మర్కజ్‌కు 347 మంది హాజరు కాగా, వారిలో 230 మందిని క్వారంటైన్ చేసినట్లు ఆ రాష్ట్రం ప్రకటించింది.
లైఫ్ లైన్ విమానాలు
కరోనాపై పోరులో భాగంగా 20 వేల రైలు కోచ్‌ల్లో దాదాపు 3.2 లక్షల ఐసోలేషన్, క్వారంటైన్ బెడ్స్‌ను సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు. 5 వేల కోచ్‌ల్లో బెడ్స్ ఏర్పాటు ఇప్పటికే ప్రారంభమైందన్నారు. నిర్ధారణ పరీక్షల కిట్స్, ఔషధాలు, మాస్క్‌ల తరలింపు కోసం పౌర విమానయాన శాఖ ‘లైఫ్‌లైన్’ విమానాలను సిద్ధం చేసిందన్నారు. గత 5 రోజుల్లో ఈ విమానాల ద్వారా 15.4 టన్నుల వైద్య పరికరాల సరఫరా జరిగిందన్నారు.
నేడు సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, వలస కార్మికుల సామూహిక ప్రయాణాలు, తబ్లిగి జమాత్‌లో పాల్గొన్నవారు, ఆ తరువాత కలిసిన వారిని గుర్తించడం, నిత్యావసర వస్తువులను ప్రజలకు అందుబాటులో ఉంచడం.. తదితర అంశాలు ఆ సమావేశంలో చర్చకు రావచ్చని సంబంధిత వర్గాలు బుధవారం వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment