సాక్షి, తూర్పు గోదావరి: కూటమిలో చిచ్చుతో అనపర్తి రాజకీయాల్లో ఒక్కసారిగా అలజడి రేగింది. మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి టికెట్ దక్కకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహావేశాలకు లోనయ్యారు. టీడీపీ కరపత్రాలను, జెండాలను కుప్పలుగా తగలబోసి అందులో ఓ సైకిల్‌ను వేసి కాల్చేశారు. అధిష్టాన నిర్ణయంతో తీవ్ర అసంతృప్తి గురైన నల్లమిల్లి తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించారు.
‘‘నాకు టికెట్ రాకుండా పెద్ద కుట్ర చేశారు. నాకు జరిగిన అన్యాయం ప్రజలకు వివరిస్తా’’ అంటూ గురువారం ఉదయం అనుచరులతో జరిగిన సమావేశంలో ఆయన కన్నీళ్లు పెట్టకున్నారు. రేపటి నుంచి కుటుంబ సభ్యులతో ప్రజల్లోకి వెళ్తానన్న ఆయన.. ప్రజల నిర్ణయం మేరకు పోటీ చేస్తానని ప్రకటించారు. ‘‘నేను టీడీపీకి మద్దతివ్వను. బీజేపీకి కూడా ఓటు వేయమని చెప్పను. చంద్రబాబు నన్ను నమ్మించి మోసం చేశారు. నా నియోజకవర్గంలో ఏ మాత్రం బలం లేని బీజేపీకి ఎలా సీటు కేటాయిస్తారు?.. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చేది లేదు’’ అంటూ స్పష్టం చేశారాయన.
టీడీపీ తరఫున అనపర్తి టికెట్‌ను ఈ మాజీ ఎమ్మెల్యే ఆశించారు. అయితే తనతో సంప్రదింపులేం జరపకుండా అధినేత చంద్రబాబు పొత్తులో భాగంగా ఆ సీటును చంద్రబాబు బీజేపీకి ఇచ్చేందుకు అంగీకరించారు. అనపర్తి బీజేపీ అభ్యర్థిగా ఎం. శివకృష్ణంరాజు పేరును బీజేపీ బుధవారం సాయంత్రం నాటి జాబితాలో అధికారికంగా ప్రకటించింది. దీంతో.. నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు.
అంతకు ముందు.. అనపర్తిలో నల్లమిల్లి అనుచరుల ఆగ్రహావేశాలతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అనపర్తి సీటు ఇచ్చినట్లే ఇచ్చి లాగేసుకున్నారంటూ నల్లమిల్లి అనుచరుల ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు కట్టప్ప రాజకీయాలు ఆపాలంటూ నినాదాలు చేశారు. మంట్లలో సైకిల్‌ను టీడీపీ కరపత్రాలను తగలబెట్టారు. ఈ క్రమంలో ఈ ఉదయం తన నివాసంలో అనుచరులతో భేటీ అయిన రామకృష్ణారెడ్డి.. చివరకు రెబల్‌గా పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment