సాక్షి, రాజమహేంద్రవరం: అధికారం ఉందా లేదా అనే విషయంతో సంబంధం లేకుండా.. ఆపద వేళ ప్రజలను ఆదుకున్న వారే అసలైన నాయకులు. అటువంటి వారిని ప్రజ లు పార్టీలతో సంబంధం లేకుండా నెత్తిన పెట్టుకుంటారు. రాజకీయాల్లో ఢక్కామొక్కీలు తిన్నామని, ‘ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ’ అని తరచూ గర్వంగా చెప్పుకొంటూ కాలరెగరేసే తెలుగుదేశం పార్టీ నేతలు ఈ చిన్న విషయాన్ని మరచినట్టున్నారు. కరోనా వ్యాప్తిని అదుపు చేసేందుకు లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు.. కూలి లేక.. కూటికి నోచుకోక అల్లాడుతున్న ప్రజలకు ఇతోధికంగా సాయం అందిస్తున్నాయి. ప్రభుత్వాలు, పలు సంస్థలతో పాటు పలువురు దాతలు, వైఎస్సార్ సీపీ నాయకులు కూడా తమకు తోచిన రీతిలో నిత్యావసరాలు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కుల వంటివి అందిస్తూ నిరుపేదలను ఆదుకుంటున్నారు.
ప్రజలను వదిలేశారిలా..
- టీడీపీలో నంబర్–2గా చలామణీ అవుతున్న యనమల రామకృష్ణుడు అమరావతికే పరిమితమయ్యారు. ఆరుసార్లు ఎమ్మెల్యేగా చేసిన తుని నియోజకవర్గ ప్రజలు యనమల సోదరద్వయం తీరుతో విసుగెత్తిపోయి ఇంటికి సాగనంపారు. అందుకనే యనమల బ్రదర్స్ కరోనా మహమ్మారి కమ్ముకుంటున్న ప్రస్తుత తరుణంలో సైతం అక్కడి ప్రజలు ఎలా ఉన్నారనే వాకబు కూడా చేయలేదని అంటున్నారు. అదే యువకుడైన ప్రభుత్వ విప్ దాడిశెట్టి రాజా రెండోసారి ఎమ్మెల్యేగా చేసిన ప్రజలకు తన వంతు చేదోడుగా ప్రజలకు విస్తృతమైన సేవలందిస్తూ వారి మన్ననలు అందుకుంటున్నారు.
- అవిభక్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రికార్డు కాలం టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసి, గత ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రిగా చక్రం తిప్పిన నిమ్మకాయల చినరాజప్ప కరోనా భయంతో ఉన్న ప్రజలకు ధైర్యం కల్పించడంలో నామ్‌కే వాస్తే అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. స్థానికేతరుడని కూడా చూడకుండా పెద్దాపురం ప్రజలు రెండోసారి ఆయనను ఎమ్మెల్యేను చేశారు. ప్రస్తుత ఆపత్కాలంలో రాజప్ప తమకు భరోసా అందిస్తారని ఆ నియోజకవర్గ వాసులు ఎదురుచూశారు. తీరా ఏదో ఒకటీ అరా అదీ కూడా పార్టీ కార్యకర్తల కార్యక్రమాల్లోనో.. అధికారులతో మొక్కుబడి సమీక్షల్లోనో ఫొటోలకు పోజులిచ్చి చేతులు దులిపేసుకున్నారని పెద్దాపురం ప్రజలు ఆక్షేపిస్తున్నారు.
- రాజమహేంద్రవరం సిటీ ప్రజలు ఆదిరెడ్డి భవానీని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. ఆమె కూడా ప్రస్తుత పరిస్థితుల్లో నగర ప్రజలను కనీసంగా కూడా కలుసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. భవానీ చారిటబుల్ ట్రస్టు పేరుతో చేసిన ఒకటీ అరా సేవా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేతో పాటు నగర మేయర్‌గా పని చేసిన ఆమె అత్త వీరరాఘవమ్మ, మామ, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుల్లో ఏ ఒక్కరూ కనిపించలేదు.
- రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి ధవళేశ్వరం ఇండస్ట్రియల్ కాలనీలో 100 మంది కార్మికులకు మొక్కుబడిగా బియ్యం, మాసు్కలు ఇచ్చి ఊరుకున్నారు. ఆ తరువాత పత్తా లేకుండా పోయారని ఆ నియోజకవర్గ ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. రెండుసార్లు గెలిపించినందుకు ఆయన తమ కు చేసే మేలు ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు.
- మండపేటలో వరుసగా రెండోసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావు కూడా ఇదే దారిలో ఉన్నారు. ఈ నెల 6న మండపేట మున్సిపల్ కార్యాలయంలో పారిశుద్ధ్య సిబ్బందికి మాసు్కలు, శానిటైజర్లు అందజేశారు. అంతే.. ఆ తరువాత ఆయన అడ్రస్ లేరని పలువురు ఆక్షేపిస్తున్నారు.
- కరోనా భయం సర్వత్రా నెలకొన్న వేళ టీడీపీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్‌వీఎస్ వర్మ (పిఠాపురం), దాట్ల బుచ్చిబాబు (ముమ్మిడివరం) తదితరులు ప్రజలను కనీసంగా కూడా పలకరించడం లేదు.
- జ్యోతుల నెహ్రూ (జగ్గంపేట) కొద్దోగొప్పో కార్యక్రమాలు చేస్తున్నా, గొల్లపల్లి సూర్యారావు (రాజోలు), బండారు సత్యానందరావు (కొత్తపేట), వనమాడి కొండబాబు (కాకినాడ సిటీ).. ఇలా దాదాపు మాజీలంతా ప్రజలతో పని లేదన్నట్టుగా కనీసం ముఖం కూడా చూపించడం లేదు.
‘ఒట్టి మాటలు కట్టిపెట్టోయ్.. గట్టి మేల్ తలపెట్టవోయ్’ అన్నాడు మహాకవి గురజాడ. ప్రస్తుత కరోనా విపత్కాలంలో రాష్ట్ర ప్రభుత్వంతో పాటు దీనిని అక్షరాలా ఆచరిస్తున్న వారు ఎందరో కనిపిస్తున్నారు. స్పందించే హృదయం ఉన్న ప్రతి ఒక్కరూ తమ శక్తికి తగినట్టు ‘బాధాసర్పదషు్టల’కు మనసారా సాయం అందిస్తున్నారు. ప్రజాసేవే పరమావధిగా ముందుకు కదులుతున్నారు. ఇటువంటి ఆపద సమయంలో ప్రజలకు అన్నివిధాలా అండగా ఉండాల్సిన ‘పచ్చ’ నేతలు మాత్రం దాదాపు పత్తా లేకుండా పోయారు.
మానవాళిని కబళించేందుకు వేయి తలల విషనాగులా బుసలు కొడుతున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు.. ఇళ్లల్లోనే ‘లాక్’ అయ్యి, ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్న ప్రజలకు సాయం చేసేందుకు.. రాష్ట్ర ప్రభుత్వం మంచి మనసుతో కృషి చేస్తూంటే.. దానిని చూడలేక.. మీడియా ముందు నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఒడ్డున కూర్చుని విమర్శల రాళ్లు విసురుతున్నారు. తద్వారా తమకు దూషించే నోళ్లే తప్ప.. సాయం చేసే చేతులు లేవన్న విషయాన్ని నిరూపించుకుంటున్నారు.
దోచుకుని.. దాచుకుని..
గత ప్రభుత్వ హయాంలో ఇటు తుని నుంచి అటు రాజోలు వరకూ.. టీడీపీ ప్రజాప్రతినిధులు, నేతలు మట్టి, ఇసుక అక్రమ రవాణా, వివిధ పనుల్లో పర్సంటేజీలు నొక్కేసి వందల వేల కోట్ల రూపాయలు కొల్లగొట్టారు. అక్రమంగా ఆర్జించిన సొమ్ములను ఓట్ల కోసం ఎన్నికల్లో కుమ్మరించి, ప్రలోభాలతో కొంతమంది ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యారు. నిరంతరం ‘ప్రజలే దేవుళ్లు’ అని చెప్పుకొనే టీడీపీ నాయకులు ప్రజలకు కష్టం వచ్చినప్పుడు మాత్రం ముఖం చాటేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అండగా ఉండాల్సిన బాధ్యతను వారు విస్మరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నమ్మి ఓటేస్తే ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా కనీసం సాంత్వన కల్పించలేని నాయకులు భవిష్యత్తులో ఏ ముఖం పెట్టుకుని వస్తారని జిల్లా ప్రజలు
ప్రశ్నిస్తున్నారు.
అండగా నిలుస్తున్న వైఎస్సార్ సీపీ నేతలు, శ్రేణులు
టీడీపీ నేతల తీరుకు పూర్తి భిన్నంగా అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు ద్వితీయ శ్రేణి నేతలు వ్యవహరిస్తున్నారు. లాక్‌డౌన్ వేళ ప్రజలకు తోచిన సాయం చేస్తూ కొండంత అండగా నిలుస్తున్నారు. తొలి విడతగా రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలోని 14 లక్షల పై చిలుకు కుటుంబాలకు వెయ్యి రూపాయలు, బియ్యం, కందిపప్పు ఉచితంగా పంపిణీ చేసి భరోసా కల్పించింది. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులూ ప్రజలకు ధైర్యం చెబుతూ, దగ్గరుండి మరీ వారి బాగోగులు చూసుకుంటున్నారు.
ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖ మం్రత్రి కురసాల కన్నబాబు, రాష్ట్ర కాపు కార్పొరేషన్ చైర్మన్ జక్కంపూడి రాజా, మాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ పెదపాటి అమ్మాజీ, ఎంపీలు వంగా గీత, మార్గాని భరత్‌రామ్, చింతా అనురాధ, ఎమ్మెల్యేలు, కో ఆర్డినేటర్లు, పార్టీ యంత్రాంగం యావత్తూ నిత్యం ప్రజలతోనే ఉంటూ వారికి ఆపన్నహస్తం అందిస్తున్నారు. సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. వీరితో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రముఖులు, యువత విస్తృతంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కళ్లముందే ఇంత జరుగుతున్నా చీమ కుట్టినట్టయినా చలించని టీడీపీ నేతల తీరును జిల్లా ప్రజలు ఆక్షేపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment