ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు! | ACB Officers Attack On Gollaprolu Police Station | Sakshi
Sakshi News home page

రామ రామ.. కృష్ణ కృష్ణ..ఆ ఎస్సై అవినీతికి అంతే లేదు!

Published Sun, Nov 17 2019 6:22 AM | Last Updated on Sun, Nov 17 2019 1:53 PM

ACB Officers Attack On Gollaprolu Police Station - Sakshi

గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌ (ఏసీబీకు పట్టుబడ్డ ఎస్సై రామకృష్ణ)

గొల్లప్రోలు పోలీసు స్టేషన్‌పై ఏసీబీ అధికారులు దాడి చేసి ఎస్సైను అరెస్ట్‌ చేయడం ఈ ప్రాంతంలో కలకలం సృష్టించింది. లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్‌ సింహాచలం ఉదంతం చర్చనీయాంశమైంది. ఈ స్టేషన్‌ ఏర్పడిన తరువాత మొదటిసారి ఏసీబీ దాడి చేసిందని ఈ ప్రాంతీయులు అంటున్నారు. ఈ ఎస్సైపై ఇప్పుడు పలు ఆరోపణలు, వివాదాలు బయటపడుతున్నాయి.  

సాక్షి, గొల్లప్రోలు (పిఠాపురం): స్థానిక ఎస్సైగా బి.రామకృష్ణ 2014 బ్యాచ్‌లో ఎస్సైగా ఉద్యోగం పొందారు. పెద్దాపురం, కాకినాడ పోర్టు స్టేషన్లలో పనిచేసిన ఆయన.. 2017 జనవరి 17న గొల్లప్రోలుకు బదిలీపై వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వంలో ఈయనను ఒక పోలీసు ఉన్నతాధికారి ప్రోద్భలంతో ఇక్కడికి చేయించారు. ఈయన అన్నిట్లోనూ బేరసారాలకు దిగేవారన్న ఆరోపణలు ఉన్నాయి. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ నుంచి పేకాట, రోడ్డు ప్రమాదాలు వరకు ప్రతి కేసులోనూ చేతులు తడపాల్సివచ్చేదట. చివరకు కుటుంబ తగాదాలు, ఆస్తి తగాదాలు వంటి సివిల్‌ వివారాల్లో కూడా తలదూర్చి వసూళ్లకు పాల్పడేవాడని ఇప్పుడు పలువురు చెబుతున్నారు. ఇటీవల చెందుర్తి, వన్నెపూడి, కొడవలి గ్రామాల్లో భార్యాభర్తలు, ప్రేమ వ్యవహారాల్లో నమోదైన కేసులో ఇరువర్గాలను రాజీ పెట్టి మామూళ్లు వసూళ్లు చేసినట్లు బాధితులు తెలిపారు. వన్నెపూడిలో పురుగు మందు తాగిన కేసులో రూ.30 వేల వరకు వసూలు చేశాడని ఆరోపణలు వస్తున్నాయి. ఇటీవల ప్రత్తిపాడు జంక్షన్‌లో ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటనలో బస్సు విడుదల చేయడానికి రూ.30 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణ వచ్చింది.

పేకాడుతున్న వారి వద్ద దొరికిన మొత్తం సొమ్ములో నామమాత్రపు మొత్తం చూపుతూ నమోదు చేసిన సంఘటనలు నిత్యకృత్యం. గొల్లప్రోలులో రెండు పేకాట శిబిరాలు, మల్లవరంలో కోడిపందేల నిర్వహణకు ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. దీపావళి పండగకు బాణసంచా దుకాణాలకు అనుమతి ఇవ్వడానికి రూ.3 లక్షల మేర వసూలు చేసినట్టు తాజాగా వెల్లడైంది. హైవేపై చీకటి వ్యాపారాల నుంచి ముడుపులు తీసుకున్నట్టు ఆరోపణ. స్థానిక కొత్తపేటలో గోడ తగాదా విషయంలో కేసు రాజీకి రూ.20 వేలు, ఎస్సీపేటలో ఒక కేసుకు రూ.10 వేలు తీసుకున్నారని బాధితులు చెబుతున్నారు. స్టేషను బెయిల్‌ విషయంలో కేసును బట్టి రూ.5 వేల నుంచి రూ.20 వేలు వరకు వసూలు చేసేవారట. ఇటీవల గొల్లప్రోలులోని కొత్తపేటలో పేకాట కేసులో పట్టుబడ్డ 9 మంది నుంచి రూ.27 వేలు వసూలు చేసి, దానిని పెట్టీ కేసుగా మార్చారన్న ఆరోపణ ఉంది. 

గ్రావెల్‌ తరలింపులో..  
పక్క నియోజకవర్గం నుంచి గ్రావెల్, మట్టి ఇక్కడకు తరలించడానికి ముందుగా స్టేషను మామూళ్లు వసూలు చేసేవారు. స్థానిక రెవెన్యూ అధికారులకు, నియోజకవర్గ ప్రజాప్రతినిధి కళ్లు గప్పి మరీ గ్రావెల్‌ దందా సాగించేవారని ఆరోపణలు ఉన్నాయి. పట్టుకున్న వాహనాలను విడుదల చేయించుకోవడానికి భారీ ముడుపులు చెల్లించాల్సి వచ్చేది.  

బాస్‌ ఇన్‌స్పెక్షన్‌ కోసం రూ.5 లక్షల వసూలు!  
డివిజినల్‌ స్థాయి పోలీసు అధికారి ఇన్‌స్పెక్షన్‌ పేరిట పలువురి నుంచి సుమారు రూ.5 లక్షల వరకు వసూలు చేయడం అప్పట్లో సంచలనం కలిగించింది. వ్యాపారులు, మిల్లర్లు, పారిశ్రామిక వేత్తలు, చివరికి వైఎస్సార్‌ సీపీ నేతల నుంచి కూడా వసూళ్లు చేశారన్న ఆరోపణలు వచ్చాయి. రూ.2 లక్షలని చెప్పి.. రూ.5 లక్షలు వసూలు చేశారని పోలీసులే చెబుతున్నారు.

కానిస్టేబుల్‌తో వసూళ్లు.. 
ఇటీవల గొల్లప్రోలు నుంచి కాకినాడ టూటౌన్‌ బదిలీ అయిన కానిస్టేబుల్‌ సింహాచలం గతంలో మామూళ్ల దందా నడిపేవాడు. అయితే అక్కడ నుంచి సింహాచలంను మ్యూచువల్‌ అండర్‌ స్టాండింగ్‌పై అసిస్టెంట్‌ రైటర్‌గా రికార్డులు రాయడానికి ఇక్కడికి తీసుకొచ్చారు. స్టేషన్‌లో మామూళ్లు విషయంలో అతడిని సంప్రదించా ల్సిందేనని పలువురు చెబుతున్నారు. ఏసీబీ దాడిలో ఈ కానిస్టేబుల్‌ రూ.10 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడిన విషయం విదితమే. బాధితులు అతనితో మాట్లాడిన వాయిస్‌ రికార్డు పెద్ద సంచలనంగా మారింది. పోలీస్‌ స్టేషన్‌లో కింద నుంచి పైవరకు చేతులు తడపాలని....ఇందులో మాకు ఎంతో రాదంటూ అతడు మాటలును బట్టి అవినీతి సొమ్ము ఎవరెవరికి అందుతున్నాయో అర్ధమవుతోందని పలువురు అంటున్నారు.

ఎస్సై, కానిస్టేబుల్‌కు రిమాండ్‌
ఏసీబీ దాడుల్లో లంచం తీసుకుంటూ దొరికిపోయిన గొల్లప్రోలు ఎస్సై బి.రామకృష్ణ, కానిస్టేబుల్‌ సింహాచలానికి ఈ నెల 29వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్‌ విధించింది. బెయిల్‌ మంజూరు విషయంలో రూ.10 వేలు తీసుకుంటూ గురువారం రాత్రి ఎస్సై రామకృష్ణ, కానిస్టేబుల్‌ సింహాచలం ఏసీబీకు దొరికిన విషయం విదితమే. దీంతో ఏసీబీ అధికారులు నిందితులను రాజమండ్రి ఏసీబీ కోర్టులో శనివారం హాజరుపరిచారు. వారిద్దరికి కోర్టు 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఏసీబీ డీఎస్పీ రామచంద్రరావు తెలిపారు. దీంతో నిందితులను రాజమండ్రి సెంట్రల్‌ జైలుకు తరలించినట్టు ఆయన తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement