బాధితుడి ఇంటి వద్ద పారిశుద్ధ్య పనులు చేస్తున్న మున్సిపల్ సిబ్బంది
పిఠాపురం: పట్టణంలోని ఒక యువకుడు కరోనా నుంచి కోలుకుని ఇంటికి చేరిన 24 గంటలు గడవక ముందే అదే ప్రాంతంలో మరో వ్యక్తికి పాజిటివ్ వచ్చింది. దీంతో పిఠాపురంలో అధికారులు హై ఎలర్ట్ ప్రకటించారు. పిఠాపురం తారకరామానగర్‌లో నివాసముంటున్న ఒక వ్యక్తి తెలంగాణలోని మంచిర్యాలలో కూలి పనికి వెళ్లి, గత నెల 22 తిరిగి పిఠాపురం చేరుకున్నాడు. ఇప్పటికే రెడ్‌జోన్‌లో ఉన్న ఆ ప్రాంత ప్రజలకు ఇటీవల కరోనా పరీక్షలు నిర్వహించగా మంచిర్యాల నుంచి వచ్చిన వ్యక్తికి పాజిటివ్ వచ్చింది.
దీంతో అప్రమత్తమైన అధికారులు అతడిని రాజానగరం జీఎస్‌ఎల్ ఆస్పత్రికి తరలించారు. అతడి కుటుంబ సభ్యులు ఇద్దరిని, పక్కింటిలోని ఆరుగురిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఇంటిని, ఆ ప్రాంతాన్ని పరిశీలించి హై ఎలర్ట్ ప్రకటించారు. ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ ఆర్డీఓ చిన్నికృష్ణ పర్యవేక్షణలో పిఠాపురం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారి డాక్టర్ విజయశేఖర్, సీఐ బి.అప్పారావు, ఎస్సై అబ్దుల్ నబీ పరిస్థితిని సమీక్షించారు.
క్వారంటైన్‌కు మరో తొమ్మిది మంది
పాజిటివ్ వచ్చిన వ్యక్తితో కలిసి మంచిర్యాల పనికి వెళ్లిన గొల్లప్రోలు మండలం తాటిపర్తి, కొడవలి, చేబ్రోలుకు చెందిన తొమ్మిది మందిని తాటిపర్తి హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన క్వారంటైన్ సెంటర్‌కు అధికారులు తరలించారు. వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకూ మంచిర్యాల వెళ్లి వచ్చిన వారితో పాటు వారి బంధువులు తదితర 75 మందికి కరోనా పరీక్షలు చేశారు.
31 మంది రక్తనమూనాల సేకరణ
శంఖవరం: కత్తిపూడిలో శనివారం 31 మంది రక్తనమూనాలు సేకరించినట్లు వైద్యుడు పి.రవికుమార్ తెలిపారు. పిఠాపురంలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ వ్యక్తి పని కోసం తెలంగాణలోని మంచిర్యాలకు కత్తిపూడికి చెందిన 30 మందితో వెళ్లాడు. దీంతో వారికి కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి కత్తిపూడిలోని రెడ్‌జోన్ ప్రాంతాన్ని సందర్శించారు.
రాజమహేంద్రవరంలో మరో ఐదుగురికి పాజిటివ్
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): రాజమహేంద్రవరంలో శనివారం రాత్రి ఐదు కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నగరంలోని మంగళవారపుపేటలో శుక్రవారం 28 ఏళ్ల మహిళకు పాజిటివ్‌గా వచ్చిన విషయం తెలిసిందే. ఆమెతో కాంటాక్ట్ అయిన కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారికి నిర్వహించిన వైద్య పరీక్షల్లో శనివారం ఐదుగురికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. వారిని రాజానగరం జీఎస్‌ఎల్ కోవిడ్–19 జిల్లా ఆసుపత్రికి తరలించారు. వీరందరూ మంగళవారపుపేట, కొత్తపేటకు చెందినవారు. కేసులు పెరగడంతో కలెక్టర్ డి.మురళీధరరెడ్డి హుటాహుటిన రాజమహేంద్రవరం చేరుకుని పరిస్థితిని అధికారులతో సమీక్షించారు. పాజిటివ్ కేసులు వచ్చిన మంగళవారపుపేట, కొత్తపేటలను రెడ్‌జోన్‌గా ప్రకటించారు. ఆ రెండు ప్రాంతాలకు వెళ్లే మార్గాలన్నింటినీ బారికేడ్లతో మూసివేశారు. పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment