పచ్చని కొండల మధ్య చింతూరు మండలంలోని ఓ ఆదివాసీ గ్రామం
ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్–19 వైరస్ మన్యం వైపు తొంగి చూసే సాహసం చేయలేకపోయింది. వ్యాధుల సీజన్ వచ్చిందంటే చాలు అందరి దృష్టీ మన్యంపైనే ఉంటుంది. మలేరియా, కాళ్లవాపు, శిశు, ప్రసూతి మరణాలు..ఇలా ఏ చిన్న రోగమైనా ముందుగా పలకరించేది రంపచోడవరం మన్యాన్నే. వ్యాధులు వచ్చినప్పుడు జిల్లా కేంద్రం నుంచి ప్రత్యేక బృందాలు వెళ్లాల్సిన పరిస్థితులు. ఏటా ప్రతి సీజన్‌లో ఇక్కడ ఇదే పరిస్థితి. అటువంటిది ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా గిరిజన ప్రాంతాలను తాక లేకపోయింది.
సాక్షి, రంపచోడవరం: జిల్లాలో అన్ని సదుపాయాలు, వసతులు, కమ్యూనికేషన్ కలిగిన డెల్టా, మెట్ట ప్రాంతాలను విడిచిపెట్టని కరోనా మహమ్మారి గిరి జనం దరి చేరలేకపోయింది. తొలి కరోనా పాజిటివ్ కేసు రాజమహేంద్రవరం నగరంలో నమోదైన తరువాత వరుసగా కాకినాడ, పెద్దాపురం, సామర్లకోట, పిఠాపురం, కొత్తపేట, కత్తిపూడి, తుని, కోనసీమలోని బండార్లంక, కొత్తపేటలోని ఏనుగులమహల్ వరకూ విస్తరించి జిల్లాలో 50కి పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇలా అన్ని ప్రాంతాలకూ పాకిన ఈ వైరస్ రంపచోడవరం మన్యం సరిహద్దులను కూడా తాకలేక పోయింది. మైదాన ప్రాంతంతో పోలిస్తే మన్యంలో చదువుకున్న వారి సంఖ్య తక్కువనే చెప్పొచ్చు. కానీ ఈ పారంతంలో ఒక్కటంటే ఒక్క పాజిటివ్ కేసు కూడా నమోదు కాకపోవడం విశేషమే.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏడు మండలాలున్న రంపచోడవరం మన్యంలో తెలంగాణ నుంచి వచ్చిన నాలుగు మండలాలతో కలిపి 11 మండలాలున్నాయి. రంపచోడవరంతోపాటు అదనంగా చింతూరు ఐటీడీఏ కూడా ఏర్పాటైంది. ఈ రెండు ఐటీడీఏల పరిధిలో 176 గ్రామ పంచాయతీలలో సుమారు 3.4 లక్షల మంది గిరిజనులున్నారు. మొత్తం జిల్లాలో సగానికిపైగా భూ భాగం కలిగిన ఏజెన్సీలో ఒక్క పాజిటివ్ కేసే కాకుండా అనుమానిత కేసులు కూడా నమోదు కాకపోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. అందునా రంపచోడవరం మన్యం చుట్టూ పలు రాష్ట్రాల సరిహద్దులు కూడా ఉండటం గమనార్హం. గడచిన 48 గంటల్లో జిల్లాలో బండార్లంక, కొత్తపేట ఏనుగులమహల్ తదితర ప్రాంతాల్లో నమోదైన నాలుగు పాజిటివ్ కేసులు కూడా రాష్ట్ర సరిహద్దులు దాటి తమిళనాడులోని కోయంబేడు వెళ్లి తిరిగొచ్చిన వారి ద్వారానే వచ్చాయి.
సరిహద్దులు మూసివేయడంతోనే...
ఏజెన్సీ నుంచి గిరిజనులు ఉపాధి, ఇతర అవసరాల కోసం పొరుగున పశి్చమగోదావరి, విశాఖపట్నం జిల్లాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాలకు వెళ్తుంటారు. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న పరిస్థితుల్లో గిరిజనులు జిల్లా సరిహద్దు దాటి వెళ్లకుండా స్వీయ నియంత్రణ, లాక్‌డౌన్‌ను పాటించడంతో కరోనా మన్యం దరిచేరలేదని గిరిజన నేతలు పేర్కొంటున్నారు. అక్షరాస్యత, నాగరికతలో ఇప్పటికీ మైదాన ప్రాంత ప్రజలతో ఆశించిన స్థాయిలో పోటీపడలేకున్న గిరిజనులు కోవిడ్–19 వెరస్ దరిచేరకుండా జాగ్రత్తలు తీసుకోవడంలో మాత్రం ముందున్నారని చెప్పొచ్చు.
లాక్‌డౌన్ అనంతరం బయట ప్రాంతాలకు చెందిన ఏ ఒక్కరినీ అడుగు పెట్టనీయకుండా మన్యం చుట్టూ సరిహద్దులను మూసేయడం కూడా ఇందుకు దోహదం చేసింది. మన్యంలో ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా కరోనా వైరస్ ప్రవేశించి ఉంటే నియంత్రణ సవాల్‌గా మారేదని అక్కడి వైద్య అధికారులు అభిప్రాయపడుతున్నారు. జిల్లా మొత్తంలో సగ భాగంపైనే ఆక్రమించిన మన్యంలో యంత్రాంగం తీసుకున్న పటిష్టమైన చర్యలు సత్ఫలితాలిచ్చాయి. మూడు రాష్ట్ర సరిహద్దులు, రెండు పొరుగు జిల్లాల సరిహద్దులు బంద్ చేశారు.
సరిహద్దు ఆవల నుంచి ఎవరూ రాకుండా నిరంతరం పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించడం కూడా కలిసి వచ్చింది. విశాఖ నుంచి రాకుండా డొంకరాయి, మైదాన ప్రాంతాల నుంచి రాకుండా ఏజెన్సీ ముఖద్వారం పోక్సుపేట, పశ్చిమగోదావరి నుంచి రాకుండా దండంగి వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి నిరతంరం పర్యవేక్షించారు. తెలంగాణ, ఎటపాక, చత్తీస్‌గడ్, ఒడిశా సరిహద్దుగా కుంట వద్ద చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. అడపా దడపా వలస కూలీలు వచ్చిన వారిని వచ్చినట్టే వెనక్కి తిప్పి పంపడం లేదా, మండలానికి ఒకటి చొప్పున ఏర్పాటుచేసిన క్వారంటైన్ సెంటర్‌కు తరలించడంతో కరోనా మన్యం దరిచేరకుండా జిల్లా యంత్రాంగం విజయాన్ని సాధించిది.
సమష్టి కృషి
జిల్లా కలెక్టర్ మురళీధర్‌రెడ్డి పర్యవేక్షణలో సబ్ కలెక్టర్ ప్రవీణ్ ఆదిత్య, రంపచోడవరం, చింతూరు ఐటీడీఏ పీఓలు నిషాంత్‌కుమార్, వెంకటరమణ, ఏఎస్పీ వకుల్ జిందాల్ క్షేత్ర స్థాయిలో సమన్వయ కృషి ఫలితాన్నిచ్చింది.
మన్యంలో మరణాలు
- 2018లో 67 మంది శిశువులు, ఐదుగురు తల్లులు (అనారోగ్యంతో)
- 2019లో 29 మంది శిశువులు, ఐదుగురు తల్లులు
- మూడేళ్లలో కాళ్లవాపు వ్యాధితో 20 మంది గిరిజనులు
- కరోనా పాజిటివ్ కేసులు నిల్–మరణాలు నిల్
ఆదివాసీల అప్రమత్తతే శ్రీరామరక్ష
ప్రపంచాన్నే వణికిస్తున్న కరోనా మహమ్మరిని ఏజెన్సీలోకి అడుగుపెట్టకుండా ఆదివాసీలు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తూ స్వీయ నియంత్రణలో ఉన్నారు. మారుమూల గ్రామాల్లో సైతం స్వచ్ఛందంగా రాకపోకలు నివారించి అంటువ్యాధిని తమ గ్రామాల వైపు రాకుండా జాగ్రత్తపడుతున్నారు. గతంలోకంటే సమాచార వ్యవస్థ మెరుగుపడడంతో విషయాలు ఎప్పటికప్పుడు తెలుస్తున్నాయి. లాక్‌డౌన్ నేపథ్యంలో అనేక అటుపోట్లు ఎదుర్కొంటున్నారు. అయినా బయటకు రాకుండా తమ అవసరాలను స్ధానికంగా దొరికేవాటితో తీర్చుకుంటున్నారు. ఇతర ప్రాంతాలకు పనుల కోసం వెళ్లడం కూడా తగ్గించారు.
–లండా వేణుగోపాల్, ఎస్టీయూ నాయకుడు, రంపచోడవరం
Comments
Please login to add a commentAdd a comment