ఒకే ఒక్కడు.. ముప్పు తెచ్చాడు!  | One Man Spread Coronavirus In East Godavari District | Sakshi
Sakshi News home page

ఒకే ఒక్కడు.. ముప్పు తెచ్చాడు! 

Published Sun, May 24 2020 11:04 AM | Last Updated on Sun, May 24 2020 4:44 PM

One Man Spread Coronavirus In East Godavari District - Sakshi

జి.మామిడాడలో పోలీసులు, అధికారులను వివరాలు అడిగి తెలుసుకుంటున్న ఎస్పీ అస్మీ

సాక్షి, రాజమహేంద్రవరం: ప్రభుత్వం ఎంత మొత్తుకుంటున్నా కొంతమంది చెవికెక్కించుకోవడం లేదు. అవగాహనా రాహిత్యమో, ‘మనకేం అవుతుందిలే’ అనే నిర్లక్ష్యమో కానీ ప్రాణం మీదకు తెచ్చుకుంటున్నారు. రాజమహేంద్రవరంలో జిల్లాలోనే కరోనా తొలిసారిగా పాజిటివ్‌ కేసు నమోదైనప్పటి నుంచీ గొంతు నొప్పి, దగ్గు, జలుబు, జ్వరం, శ్వాసలో ఇబ్బందులు వంటి లక్షణాలున్న ప్రతి ఒక్కరూ కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని జిల్లా యంత్రాంగం పదేపదే చెబుతూనే ఉంది. కానీ ఆ మాటలను చాలామంది పెడచెవిన పెడుతున్నారు. పరీక్షలకు వెళ్లకుండా రోగాన్ని దాచిపెట్టి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. ఇటువంటి ఉదంతాలు జిల్లాను భయం గుప్పెట్లోకి నెట్టేస్తున్నాయి. ఇలా రోగాన్ని దాచిపెట్టి నాడు కత్తిపూడిలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు, తాజాగా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన హోటల్‌ క్యాషియర్‌ (ఫొటోగ్రాఫర్‌ కూడా) ప్రాణాల మీదకు తెచ్చుకున్నారు. (రంగనాయకమ్మా.. డ్రామాలెందుకమ్మా!)

కత్తిపూడిలో ఉపాధ్యాయుడు చావు తప్పి కన్ను లొట్టబోయిన చందంగా మృత్యువు అంచుల వరకూ వెళ్లి బయటపడ్డాడు. ఆ ఉపాధ్యాయుడు కరోనా లక్షణాలపై గోప్యత పాటించి పలువురికి పాజిటివ్‌ రావడానికి కారణమయ్యాడు. తాజాగా తొలి కరోనా మరణం నమోదైన గొల్లల మామిడాడలో కూడా కత్తిపూడి తరహా పరిణామమే చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గొల్లల మామిడాడలో హోటల్‌ క్యాషియర్‌ మృతి చెందాక కరోనా పాజిటివ్‌గా గుర్తించారు. ఆ కేసుతో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులన్నీ కలిపి గడచిన 48 గంటల్లో 29 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇన్ని కేసులు ఒకేసారి రావడంతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం జి.మామిడాడ, పరిసర గ్రామాల్లో సుమారు 500 మందికి పైగా కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించింది. (అవన్నీ నిరర్థక ఆస్తులే: వైవీ సుబ్బారెడ్డి )

మరింతమందికి నిర్వహిస్తోంది. జి.మామిడాడ, బిక్కవోలు, రామచంద్రపురంలో నమోదైన కేసులన్నీ మృతి చెందిన వ్యక్తితో కాంటాక్ట్‌ అయినట్టుగా ప్రాథమికంగా నిర్ధారించారు. అతడికి ఆస్తమా లక్షణాలున్నట్టు భావించి, కాకినాడ జీజీహెచ్‌లో వైద్య పరీక్షలు చేసిన నలుగురు హౌస్‌ సర్జన్లను, పదిమంది మెడికోలను క్వారంటైన్‌కు తరలించారు. మరణించిన ఆ వ్యక్తితో కాంటాక్ట్‌ అయిన వారి సంఖ్య పెరుగుతూండటం ఆందోళన కలిగిస్తోంది.  మృతుడు సకాలంలో వైద్య పరీక్షలు చేయించుకుని, తగిన చికిత్స పొంది ఉంటే ఇప్పుడు ఇంతమందికి వైరస్‌ వ్యాప్తి చెంది ఉండేది కాదని, వారందరికీ ముప్పు తప్పేదని వైద్యులు అంటున్నారు. (విజయవాడ ఎయిర్‌పోర్టులో ఏర్పాట్లు పూర్తి)

ఉలిక్కిపడిన మామిడాడ 
కరోనా వ్యాప్తి మొదలైన తరువాత జిల్లాలో ఎక్కడా ఎప్పుడూ లేని విధంగా ఒక్కసారిగా ఇన్ని కేసులు వెలుగులోకి రావడంతో గొల్లల మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఉలిక్కి పడ్డారు. సుమారు 20 వేల జనాభా కలిగిన మేజర్‌ గ్రామ పంచాయతీ గొల్లల మామిడాడ. నిత్యం వందలాదిగా జనంతో రద్దీగా ఉండే మామిడాడ నాలుగు రోడ్ల కూడలిలోని గాం«దీ»ొమ్మ సెంటర్‌లో ఉన్న హోటల్‌కు మంచి పేరు ఉంది. దీంతో స్థానికులు ఎక్కువ మంది అక్కడికే వెళ్తూంటారు. ఆ హోటల్‌లో పని చేసే క్యాషియర్‌ మృతి చెందిన తరువాత కరోనా నిర్ధారణ కావడంతో మామిడాడ, పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. శుక్రవారం ఒక్క రోజే ఆ పరిసర గ్రామాల నుంచి 213 మంది పరీక్షలు చేయించుకున్నారు. (వేలి ముద్రలు పడకపోయినా రేషన్‌)

శనివారం కూడా అదే తరహాలో సుమారు 270 మందికి పైగా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. పాజిటివ్‌ కేసులు నమోదైన వారిని అన్ని వసతులూ ఉంటే హోం ఐసోలేషన్‌ లేదా హోం క్వారంటైన్‌కు అవకాశం కలి్పస్తూ జిల్లా కలెక్టర్‌ డి.మురళీధర్‌రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కారణంగానే ప్రజలు పెద్ద సంఖ్యలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకునేందుకు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు. జి.మామిడాడలో మరణించిన వ్యక్తికి పాజిటివ్‌ అని జీజీహెచ్‌లో నిర్థారించినప్పటి నుంచి అతడితో ప్రైమరీ, సెకండరీ కాంటాక్టుల కోసం గ్రామ వలంటీర్లు, ఆశ వర్కర్లు, వైద్యులు అనపర్తి నియోజకవర్గంలో జల్లెడ పట్టారు. అనుమానితులను గుర్తించడం, వారందరినీ అప్రమత్తం చేసి వైద్య పరీక్షలకు తీసుకురావడంలో వైద్యులు ప్రశంసనీయమైన పాత్ర పోషించారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement