
రాజానగరం: రాజమహేంద్రవరంలోని మంగళవారపుపేట నుంచి రాజానగరంలోని కుమార్తె ఇంటికి వచ్చిన 53 సంవత్సరాల ముస్లిం మహిళకు కరోనా వైరస్ పాజిటివ్ రిపోర్టు వచ్చిందనే విషయం తెలియడంతో రాజానగరంలో కలకలం బయలుదేరింది. స్థానిక బస్టాండ్ వెనుకనున్న మార్కెట్‌ని ఆనుకుని ఉన్న దొమ్మరిపేటలో ఆ మహిళ రెండు రోజులపాటు ఉండటం, కుమార్తె కుటుంబ సభ్యులు మార్కెట్‌లో చికెన్, మటన్, చేపల వర్తకులతో కలిసిమెలసి తిరగడం ఆందోళనకు గురిచేస్తోంది. ఇక్కడ కుమార్తె ఇంట రెండు రోజులున్న సమయంలోనే రేషన్ కార్డుదారులకు ప్రభుత్వం అందించిన వెయ్యి రూపాయల నగదు సహాయాన్ని కూడా ఆమె అందుకుంది.
అనంతరం రాజమహేంద్రవరం వెళ్లిన ఆమెను, రాజానగరంలోని ఆమె కుమార్తెను, మరో ముగ్గురు కుటుంబ సభ్యులను కూడా క్వారంటైన్‌కి తరలించారు. ప్రస్తుతం ఆమెకు పాజిటివ్ రిపోర్టు రావడంతో రాజమహేంద్రవరం నుంచి రాజానగరం తీసుకువచ్చిన వ్యక్తిని, అతనితోపాటు ఉన్న మరొకరిని కూడా బుధవారం క్వారంటైన్‌కి తీసుకువెళ్లారు. రాజానగరం దొమ్మరిపేటలో గ్రామ వలంటీర్లతో ముమ్మరంగా సర్వే నిర్వహించారు. పంచాయతీ సిబ్బందితో ప్రతి రోజూ శానిటేషన్ చేస్తున్నామని నోడల్ అధికారి, తహసీల్దారు జి.బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. పై అధికారుల ఆదేశాల మేరకు అవసరమైతే ఆ ప్రాంతాన్ని కంటైన్మెంట్‌గా చేస్తామన్నారు.
రెడ్‌జోన్లో కొంతమూరు
రాజమహేంద్రవరం రూరల్: కొంతమూరు గ్రామంలో 50 ఏళ్ల వ్యక్తికి కరోనా వైరస్ సోకడంతో అధికారులు ఆ ప్రాంతాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించారు. రాజమహేంద్రవరం సబ్‌కలెక్టర్ డాక్టర్ ఆర్.మహే‹Ùకుమార్, డీఎల్‌పీవో సత్యనారాయణ, ధవళేశ్వరం సీహెచ్‌సీ వైద్యాధికారి డాక్టర్ సుధాకర్, పోలీసు అధికారులు పర్యవేక్షించడంతో పాటు, వైద్యశిబిరంతోపాటు కంట్రోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజలెవరూ బయటకు రాకుండా పగడ్బందీగా చర్యలు చేపట్టారు.