సాక్షి, రాజమహేంద్రవరం: వస్త్ర వ్యాపార రంగం రారాజు, అజాత శత్రువు, సామాజిక సేవకుడు, ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొమ్మన రాజ్‌కుమార్(62) ఇకలేరు. ఆయన కరోనాతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 27 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం దోసకాయలపల్లిలో జరగనున్నాయి. కల్మషం లేని మనిషి, అందరినీ చిరునవ్వుతో పలకరించే ఆయన మరణవార్త తెలియడంతో వెంటనే నగరంలో రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి సంతాపంగా పలు వ్యాపార సంస్థలు మూసివేశారు.
20వ ఏటే వ్యాపార రంగంలోకి..
బొమ్మన రాజ్‌కుమార్ తన 20వ ఏటే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి రామచంద్రరావుకు చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. ఎవరు సాయం కోరి వచ్చినా కాదనలేని మనసు ఆయనది. వ్యవసాయం అంటే ఎనలేని అభిమానం. తరచూ వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి వస్తుండేవారు. ఆయన వస్త్ర వ్యాపార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమానికి సారథ్యం వహించారు. 2001 నుంచి నిరంతరాయంగా 19 ఏళ్లుగా ది జాంపేట కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు. ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కల్యాణ మండపం నిర్మాణానికి çకీలక పాత్ర పోషించారు. జీవిత కాల ట్రస్టీ సభ్యుడిగా ఉన్నారు. యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. మహాత్మా గాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అ«ధ్యక్షుడిగాను, రాజమహేంద్రవరం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సామాజిక సేవల్లో అందె వేసిన చెయ్యిగా పేరు పొందారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు.
నేడు నగరంలో వ్యాపార సంస్థల బంద్
బొమ్మన ఆకస్మిక మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ బుధవారం రాజమహేంద్రవరం నగరంలో వ్యాపార సంస్థలను బంద్ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అభిమానుల సందర్శనార్థం బొమ్మన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.
ప్రముఖుల సంతాపం
రాజ్‌కుమార్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు, తోట త్రిమూర్తులు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కోఆర్డినేటర్లు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, చందన రమేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్, పోలు కిరణ్‌కుమార్ రెడ్డి పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ, మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment