bommana raj kumar
-
వస్త్ర వ్యాపార రారాజు బొమ్మన ఇకలేరు
సాక్షి, రాజమహేంద్రవరం: వస్త్ర వ్యాపార రంగం రారాజు, అజాత శత్రువు, సామాజిక సేవకుడు, ప్రముఖ వస్త్ర, జ్యూయలరీ వ్యాపారి, వైఎస్సార్ సీపీ నాయకుడు బొమ్మన రాజ్‌కుమార్(62) ఇకలేరు. ఆయన కరోనాతో హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో 27 రోజులుగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఆయన అంత్యక్రియలు బుధవారం దోసకాయలపల్లిలో జరగనున్నాయి. కల్మషం లేని మనిషి, అందరినీ చిరునవ్వుతో పలకరించే ఆయన మరణవార్త తెలియడంతో వెంటనే నగరంలో రాజకీయ, వ్యాపార తదితర రంగాలకు చెందిన ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. మృతికి సంతాపంగా పలు వ్యాపార సంస్థలు మూసివేశారు. 20వ ఏటే వ్యాపార రంగంలోకి.. బొమ్మన రాజ్‌కుమార్ తన 20వ ఏటే వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. తండ్రి రామచంద్రరావుకు చేదోడు వాదోడుగా ఉంటూ అంచెలంచెలుగా ఎదిగారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వారు కూడా వ్యాపార రంగంలోనే స్థిరపడ్డారు. ఎవరు సాయం కోరి వచ్చినా కాదనలేని మనసు ఆయనది. వ్యవసాయం అంటే ఎనలేని అభిమానం. తరచూ వ్యవసాయక్షేత్రాలకు వెళ్లి వస్తుండేవారు. ఆయన వస్త్ర వ్యాపార రంగంలో రాష్ట్ర వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్లాత్ మర్చంట్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. వ్యాట్ ట్యాక్స్ రద్దు ఉద్యమానికి సారథ్యం వహించారు. 2001 నుంచి నిరంతరాయంగా 19 ఏళ్లుగా ది జాంపేట కో–ఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్‌గా ఉన్నారు. ది రాజమండ్రి చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా 5 సంవత్సరాలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బొమ్మన రామచంద్రరావు చాంబర్ ఆఫ్ కామర్స్ ట్రస్ట్ కల్యాణ మండపం నిర్మాణానికి çకీలక పాత్ర పోషించారు. జీవిత కాల ట్రస్టీ సభ్యుడిగా ఉన్నారు. యునైటెడ్ వీవర్స్ ఫ్రంట్ కన్వీనర్‌గా వ్యవహరించారు. మహాత్మా గాంధీ హోల్‌సేల్ క్లాత్ కాంప్లెక్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్ర దేవాంగ సంక్షేమ సంఘం గౌరవ అ«ధ్యక్షుడిగాను, రాజమహేంద్రవరం దేవాంగ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగాను వ్యవహరిస్తున్నారు. శ్రీశైలం దేవస్థానం దేవాంగ సత్రం చైర్మన్‌గా కూడా ఉన్నారు. ఆయన వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం మొట్టమొదటి నగర కన్వీనర్‌గా బాధ్యతలు చేపట్టారు. అనంతరం 2014 ఎమ్మెల్యేగా పోటీ చేశారు. సామాజిక సేవల్లో అందె వేసిన చెయ్యిగా పేరు పొందారు. 2019 ఎన్నికల సమయంలో పిఠాపురం నియోజకవర్గ పరిశీలకునిగా వ్యవహరించారు. నేడు నగరంలో వ్యాపార సంస్థల బంద్ బొమ్మన ఆకస్మిక మృతికి తీవ్ర దిగ్భ్రాంతి చెందుతూ బుధవారం రాజమహేంద్రవరం నగరంలో వ్యాపార సంస్థలను బంద్ చేస్తున్నట్టు వ్యాపారులు ప్రకటించారు. నగరంలోని ఆయన స్వగృహంలో ఉదయం 7 నుంచి 8 గంటల మధ్య అభిమానుల సందర్శనార్థం బొమ్మన మృతదేహాన్ని ఉంచనున్నారు. అనంతరం కోరుకొండ మండలంలోని దోసకాయలపల్లి వ్యవసాయక్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రముఖుల సంతాపం రాజ్‌కుమార్ మృతికి పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. రాజమహేంద్రవరం ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజమహేంద్రవరం, అమలాపురం పార్లమెంట్ జిల్లా అధ్యక్షులు కొయ్యే మోషేన్‌రాజు, తోట త్రిమూర్తులు, రాజమహేంద్రవరం సిటీ, రూరల్ కోఆర్డినేటర్లు శ్రీఘాకోళ్లపు శివరామసుబ్రహ్మణ్యం, ఆకుల వీర్రాజు, మాజీ ఎమ్మెల్యేలు రౌతు సూర్యప్రకాశరావు, ఆకుల సత్యనారాయణ, చందన రమేష్, వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి కర్రిపాపారాయుడు, రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి రెడ్డి రాధాకృష్ణ(రాజబాబు), పార్టీ నాయకులు నందెపు శ్రీనివాస్, పోలు కిరణ్‌కుమార్ రెడ్డి పోలు విజయలక్ష్మి, మేడపాటి షర్మిలారెడ్డి, చందన నాగేశ్వర్, చాంబర్ అధ్యక్ష, కార్యదర్శులు లక్ష్మీనారాయణ జవ్వార్, మద్దుల మురళీకృష్ణ, మాజీ అధ్యక్షుడు అశోక్‌కుమార్ జైన్, బూర్లగడ్డ వెంకట సుబ్బారాయుడు తదితరులు సంతాపం వ్యక్తం చేశారు. -
గడప గడపకు సమైక్యనినాదం
సాక్షి, కాకినాడ : రాష్ర్ట సమైక్యత కోసం పోరాడుతున్న వైఎస్సార్సీపీకి అండగా నిలవండి.. సమై క్యాంధ్ర కోసం అలుపెరగక పోరు సల్పుతున్న వైఎస్ జగన్‌కు బాసటగా నిలవండి.. విభజన కుట్రలను అడ్డుకోండి అంటూ పార్టీ నేతలు ప్రజలకు పిలుపు నిచ్చారు. పార్టీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి కోరుకొండ మండలం గుమ్మిలేరులో సమైక్య నినాద పాదయాత్ర చేశారు. రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ నాయకుడు బొడ్డు అనంత వెంకట రమణచౌదరితో కలిసి పురవీధుల్లో పాదయాత్ర చేసి రాష్ర్టం ముక్కలైతే జరిగే నష్టాలను ప్రజలకు వివరించారు. రాజమండ్రి 32వ డివిజన్ పరిధిలో నగర కో-ఆర్డినేటర్ బొమ్మన రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో గడపగడపకు వైఎస్సార్సీపీ సమైక్య పాదయాత్ర చేశారు. ఈ పాదయాత్రలో బొడ్డు అనంత వెంకటరమణచౌదరి, జిల్లా మైనార్టీ సెల్ కన్వీనర్ నయీం, మైనార్టీ సెల్ రాష్ర్ట కమిటీ సభ్యుడు అహ్మద్ పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ పార్టీ కో ఆర్డినేటర్ ఆకుల వీర్రాజు హుకుంపేటలో, ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఏలేశ్వరంలో గడపగడపకు పాదయాత్ర నిర్వహించారు. పెద్దాపురం కో ఆర్డినేటర్ నాయుడు వాలుతిమ్మాపురంలో, కాకినాడ రూరల్ కో ఆర్డినేటర్ చెల్లుబోయిన వేణు ఇంద్రపాలెంలో గడపగడపకు వైఎస్సార్ సీపీ సమైక్యపాదయాత్ర నిర్వహించారు. అలాగే జగ్గంపేట మండలం గుర్రప్పాలెంలో జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో గడప గడపకు వైఎస్ఆర్ సీపీని నిర్వహించారు. -
ఇళ్ల కేటాయింపులో అక్రమాలు
కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : పేదలకు ప్రభుత్వం చేపట్టిన గృహాల కేటాయింపులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్ కుమార్, పార్టీ నాయకుడు చోడిశెట్టి రాఘవ బాబు, 50వ డివిజన్ ఇన్ చార్జి చింతపల్లి సత్యనారాయణ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఈ అక్రమాలపై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు. లాలాచెరువు ప్రాంతంలో నిర్మించిన 360 వాంబే గృహాల నంబర్ల కేటాయింపునకు గురువారం రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి ఆర్డీఓ ఎం. వేణుగోపాలరెడ్డి, హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ గృహాల మంజూరులో పలు అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి స్ధానికులను కాదని ఎమ్మెల్యే అనుచరులకు, ఆయన నివాసంలో, థియేటర్లలో పనిచేసే వారికి ఇళ్లు కేటాయించారని నాయకులు ఆరోపించారు. స్థానికులను కాదని, ధవళేశ్వరం, మండపేట, రామచంద్రపురం గ్రామాల వారికి కేటాయించారని ఆరోపించారు. లబ్ధిదారు ఎంపికలోనే లోపాలు ఉన్నపుడు నంబర్ల కేటాయింపునకు డ్రా ఎలా తీస్తారని వారు ప్రశ్నించారు. రాజమండ్రిలోని గృహసముదాయాల లబ్ధిదారుల ఎంపికలో కూడా లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు. ప్రస్తుత జాబితాను పక్కనపెట్టాలని, నాలుగురోజుల పాటు ఈ బాబితాను సమీక్షించి నిజమైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని బొమ్మన, చోడిశెట్టి, గోరంట్ల తదితరులు పట్టుబట్టారు. మీరు స్పందించకుంటే కోర్టులో సవాలు చేస్తామని, కలెక్టర్, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. డ్రా నిర్వహణకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు. దీంతో ఒకదశలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా క్రైం డీఎస్పీ ఉమాపతి వర్మ, సీఐలు గంగరాజు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, అంబికాప్రసాద్ తదితరులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. కేటాయింపులు 27కి వాయిదా గృహాల మంజూరుపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆర్డీఓ ఎం.వేణుగోపాలరెడ్డి డ్రా ను ఈ నెల 27వ తేదికి వాయిదా వేశారు. లబ్ధిదారుల జాబితాను ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాలలో ఉంచుతామని, వీటిని చూసి అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ అధికారులతో మూడు బృందాలను ఈ సమస్యపై నియమిస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలలోగా లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు తమకు తెలపాలన్నారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, సాంస్కృతిక విభాగం కన్వీనర్ ఆనంద్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు పాల్గొన్నారు.