కోటగుమ్మం (రాజమండ్రి), న్యూస్‌లైన్ : పేదలకు ప్రభుత్వం చేపట్టిన గృహాల కేటాయింపులో భారీ ఎత్తున అక్రమాలు జరిగాయని వైఎస్సార్ సీపీ, టీడీపీ నాయకులు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ బొమ్మన రాజ్ కుమార్, పార్టీ నాయకుడు చోడిశెట్టి రాఘవ బాబు, 50వ డివిజన్ ఇన్ చార్జి చింతపల్లి సత్యనారాయణ, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితరులు ఈ అక్రమాలపై ప్రత్యక్ష ఆందోళనకు దిగారు.
లాలాచెరువు ప్రాంతంలో నిర్మించిన 360 వాంబే గృహాల నంబర్ల కేటాయింపునకు గురువారం రాజమండ్రి వేంకటేశ్వరా ఆనం కళా కేంద్రంలో డ్రా తీసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. రాజమండ్రి ఆర్డీఓ ఎం. వేణుగోపాలరెడ్డి, హౌసింగ్ అధికారులు, లబ్ధిదారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే ఈ గృహాల మంజూరులో పలు అవకతవకలు జరిగాయని, అర్హులను పక్కనపెట్టి స్ధానికులను కాదని ఎమ్మెల్యే అనుచరులకు, ఆయన నివాసంలో, థియేటర్లలో పనిచేసే వారికి ఇళ్లు కేటాయించారని నాయకులు ఆరోపించారు. స్థానికులను కాదని, ధవళేశ్వరం, మండపేట, రామచంద్రపురం గ్రామాల వారికి కేటాయించారని ఆరోపించారు. లబ్ధిదారు ఎంపికలోనే లోపాలు ఉన్నపుడు నంబర్ల కేటాయింపునకు డ్రా ఎలా తీస్తారని వారు ప్రశ్నించారు. రాజమండ్రిలోని గృహసముదాయాల లబ్ధిదారుల ఎంపికలో కూడా లోపాలు ఉన్నాయని ధ్వజమెత్తారు.
ప్రస్తుత జాబితాను పక్కనపెట్టాలని, నాలుగురోజుల పాటు ఈ బాబితాను సమీక్షించి నిజమైన అర్హులకు ఇళ్లు కేటాయించాలని బొమ్మన, చోడిశెట్టి, గోరంట్ల తదితరులు పట్టుబట్టారు. మీరు స్పందించకుంటే కోర్టులో సవాలు చేస్తామని, కలెక్టర్, రెవెన్యూ, హౌసింగ్ అధికారులు దీనికి బాధ్యత వహించాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. డ్రా నిర్వహణకు అధికారులు చేసిన ప్రయత్నాన్ని వారు అడ్డుకున్నారు. దీంతో ఒకదశలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తగా క్రైం డీఎస్పీ ఉమాపతి వర్మ, సీఐలు గంగరాజు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, అంబికాప్రసాద్ తదితరులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
కేటాయింపులు 27కి వాయిదా
గృహాల మంజూరుపై ప్రతిపక్షాలు చేసిన ఆరోపణల నేపథ్యంలో ఆర్డీఓ ఎం.వేణుగోపాలరెడ్డి డ్రా ను ఈ నెల 27వ తేదికి వాయిదా వేశారు. లబ్ధిదారుల జాబితాను ఆర్డీఓ, ఎమ్మార్వో కార్యాలయాలలో ఉంచుతామని, వీటిని చూసి అభ్యంతరాలు ఉంటే తమ దృష్టికి తేవాలని ఆయన సూచించారు. రెవెన్యూ, మున్సిపల్, హౌసింగ్ అధికారులతో మూడు బృందాలను ఈ సమస్యపై నియమిస్తున్నామన్నారు. శనివారం సాయంత్రం 5 గంటలలోగా లబ్ధిదారుల జాబితాపై అభ్యంతరాలు తమకు తెలపాలన్నారు. వైఎస్సార్ సీపీ సేవాదళ్ కార్యదర్శి సుంకర చిన్ని, సాంస్కృతిక విభాగం కన్వీనర్ ఆనంద్, టీడీపీ నాయకులు వాసిరెడ్డి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు పాల్గొన్నారు.