తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): కారులో భీమవరం వెళ్తున్న నాన్నను వెనక్కి తీసుకువస్తానని బైక్‌పై వెళ్లిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కోరంగి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన చింతలపూడి చంద్రశేఖర్ అక్కడి ఆంధ్రా పాలిటెక్నిక్ వద్ద పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు మల్లికార్జున్ అలియాస్ అర్జున్ (21) అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో బీడీఎస్ (దంత వైద్యులు) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖ ర్ పని మీద ఆదివారం వేకువన కారులో భీమవరం బయలుదేరారు.
ఒంటరిగా వెళ్లవద్దని, అమ్మను కూడా వెంట తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ ఒక్కరే వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆపేందుకు అర్జున్ ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ తీయకపోవడంతో ఆయన కారును ఆపాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్‌పై కాకినాడ నుంచి బయలుదేరాడు. జాతీయ రహదారి 216లో కోరంగి పంచాయతీ సీతారామపురం పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి అతడి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్‌ను రోడ్ సేఫ్టీ పోలీస్ కానిస్టేబుల్ స్థానిక సీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అర్జున్ మృతి చెందాడు.
విలపిస్తున్న తల్లిదండ్రులు
అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకూ తమకు లేకుండా పోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. రోజూ తన పాదాలకు నమస్కరించాకే కళాశాలకు బయలుదేరేవాడని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ‘నన్నయినా నీతో తీసుకువెళ్లు.. లేదా అమ్మనైనా తీసుకువెళ్లు’ అని చెప్పిన కొడుకుతో ‘ఈ రోజు ఆదివారం కదా! అమ్మతో పాటు ఇంటి వద్ద ఉండు. నేను భీమవరం వెళ్లి వస్తాను’ అని చెప్పి చంద్రశేఖర్ బయలుదేరారు. అమలాపురం చేరేసరికి కొడుకు ప్రమాదానికి గురయ్యాడనే సమాచారం తెలియడంతో తల్లడిల్లిపోయారు. బీడీఎస్ ఫస్టియర్ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడైన అర్జున్ తమందరిలో చురుకుగా ఉండేవాడని, అతడి హఠాన్మరణం తమను కలచివేసిందని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment