Tallarevu
-
వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే
భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది. అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్ హ్యాండ్ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం. 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వారానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి. 2 వేల నుంచి 20 వేల టన్నుల సామర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమారు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్పట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యువాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయారీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది. ప్రస్తుతం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడమే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది. మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. తొలుత ఈస్ట్ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్‌కతా, గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రాల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు. బ్రిటిష్ కాలం నుంచీ.. బ్రిటిష్ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది. – పెమ్మాడి కాశీ విశ్వనాథం, బోట్ల తయారీ యూనిట్ ప్రతినిధి ప్రత్యేక ప్రావీణ్యత ఉంది మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసుకెళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు. – మందపల్లి జ్యోతిబాబు, తాళ్ల తయారీ కార్మికుడు -
మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు కన్నుమూత
సాక్షి, కాకినాడ: మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు దొమ్మేటి వెంకటేశ్వరరావు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగానూ ఈయనకు ఒక పేరుంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ దొమ్మేటి పని చేశారు. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో.. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దొమ్మేటి వెంకటేశ్వరావు ఫౌండేషన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నమూయడం గమనార్హం. దొమ్మేటి మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన -
నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే..
తాళ్లరేవు: ‘ఇంజరం.. విద్వత్ కుంజరం..’ అన్నది అనాదిగా ఉన్న నానుడి. వేద పండితులు, విద్వాంసులు, సంగీత, సాహిత్య కళాకారులకు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని ఇంజరం గ్రామం నెలవు. ఇదేకాదు.. ఈ గ్రామంలో ఓలేటి కుటుంబానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబం నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓలేటి బంగారేశ్వరశర్మ పాఠశాల వ్యవస్థ లేని కాలంలోనే గురుకుల వ్యవస్థ పరంపరలో తన ఇంటి అరుగు మీదే విద్యార్థులకు సాహిత్యం, పాఠాలు బోధించేవారు. ఆయన కుమారుడు ఓలేటి సూర్యనారాయణశాస్త్రి గ్రేడ్–1 ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన కుమారుడు ఓలేటి శ్రీనివాసశర్మ కూడా ఉపాధ్యాయుడే. ఈయన తన ఏడుగురు కుమారులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. తన తాత, తండ్రి స్ఫూర్తితో విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని విశ్వసించి తన పిల్లలను ఉపాధ్యాయులను చేశారు. ఆయన ఇద్దరు కోడళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం. ఏడుగురు కుమారులూ ఇలా.. ఇక శ్రీనివాసశర్మ పెద్ద కుమారుడు సూర్యనారాయణశాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడిగా.. రెండో కుమారుడు వెంకటభాస్కరశర్మ సంస్కృత, సాహిత్య అధ్యాపకునిగా.. మూడో కుమారుడు వెంకట ఫణినాథశర్మ ఫిజికల్ సైన్స్ ఉపాధ్యాయుడిగా.. నాలుగో కుమారుడు వెంకట రమణశర్మ ఎస్జీటీగా పనిచేస్తున్నారు. అలాగే, ఐదో కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వ్యాకరణ అధ్యాపకుడిగా.. ఆరో కుమారుడు వెంకట బంగారేశ్వరశర్మ తెలుగు ఉపాధ్యాయుడిగా.. ఏడో కుమారుడు మృత్యుంజయశర్మ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మరోవైపు.. మూడో కుమారుడు వెంకటఫణినాథశర్మ భార్య రాజేశ్వరి, ఆరో కుమారుడు బంగారేశ్వరశర్మ భార్య వీరేశ్వరి కూడా టీచర్లే. ఇలా మొత్తం ఆ కుటుంబంలో తొమ్మిది మంది ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. అలాగే, శ్రీనివాసశర్మ కుమార్తె సుబ్బలక్ష్మి కుమారుడు, అల్లుడు కూడా ఉపాధ్యాయులే. మొత్తం మీద ఓలేటి కుటుంబమంతా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నాలుగు తరాలుగా విద్యాభివృద్ధికి కృషిచేస్తోంది. తన కుమారులు ఏడుగురూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని శ్రీనివాసశర్మ సతీమణి ఓలేటి వెంకట సీతామహాలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు. -
తూర్పు తీరం.. పారిశ్రామిక హారం; క్యూ కడుతోన్న పారిశ్రామిక దిగ్గజాలు
సాక్షి ప్రతినిధి, కాకినాడ: సముద్రతీరాన పారిశ్రామిక ప్రగతి పరుగులు తీస్తోంది. విశాఖ సరిహద్దు కాకినాడ జిల్లా తొండంగి మండలం మొదలు కోనసీమ జిల్లా సఖినేటిపల్లి వరకూ గల తీర ప్రాంతంలో పారిశ్రామికీకరణ దిశగా అడుగులు పడుతున్నాయి. సహజ వనరులకు లోటు లేని తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు చురుగ్గా పనులు జరుగుతున్నాయి. పెట్రో, పెట్రో ఆధారిత పరిశ్రమలు, ఔషధాలు, బొమ్మలు తయారీ, కాకినాడ గేట్‌వే పోర్టు, వంట నూనెలు, ఆక్వా శుద్ధి ప్లాంట్లు, హేచరీలు, బల్క్ డ్రగ్ పార్క్...ఇలా పలు పరిశ్రమలు 120 కిలోమీటర్లు సముద్ర తీరంలో ఏర్పాటవుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధిని రెండు కళ్లుగా భావిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపరచాలని ప్రణాళికలు సిద్దం చేస్తోంది. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం కోవిడ్–19 మహమ్మారితో మొదటి రెండేళ్లూ గడచిపోయాయి. ఉన్న పరిశ్రమల్లో ఉత్పత్తిలేక మందగించకుండా జాగ్రత్తలు తీసుకోవడానికే సమయం సరిపోయింది. కొత్త పరిశ్రమల ఏర్పాటు దిశగా ప్రయత్నాలు చేయడానికి వీలు కాని పరిస్థితి. కోవిడ్ నుంచి కోలుకుని పరిస్థితులు చక్కబడుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి సరళీకరించిన పారిశ్రామికీకరణ విధానాలు దిగ్గజాలైన పారిశ్రామికవేత్తలను సైతం ఆకర్షిస్తున్నాయి. సీఎం దూరదృష్టితో తూర్పు తీరంలో పరిశ్రమల ఏర్పాటుపై ప్రత్యేక పోకస్ పెట్టారు. జిల్లాల పునర్విభజన తరువాత ఏ జిల్లాకు ఆ జిల్లా పారిశ్రామిక ప్రగతికి ప్రణాళికలతో ముందుకు కదులుతున్నాయి. పారిశ్రామిక కారిడార్‌కు ఊతం తీరంలో గతంలో ప్రతిపాదించిన విశాఖ–చెన్నై పారిశ్రామిక కారిడార్‌కు ప్రభుత్వ విధానాలు ఊతమిస్తున్నాయి. కారిడార్‌లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు కూడా స్థానం ఉండటం పారిశ్రామికీకరణకు సానుకూలమవుతోంది. గత పాలకుల హయాంలో వివాదాస్పదంగా మారిన కాకినాడ ఎస్ఈజెడ్ భూ సేకరణను సీఎం జగన్మోహన్రెడ్డి చొరవతో చక్కదిద్దుతున్నారు. మరోపక్క కాకినాడ ప్రత్యేక ఆర్థిక మండలిని పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలనుకుంటున్నారు. బలవంతంగా సేకరించిన భూములను రైతులకు తిరిగి రిజిస్ట్రేషన్ చేయడమనే ప్రక్రియ దేశంలోనే తొలిసారి కాకినాడ సెజ్‌లో ప్రారంభమైంది. సీఎం సాహసోపేతమైన తాజా నిర్ణయంతో తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ పారిశ్రామికవేత్తలు నమ్మకంతో ముందుకు వస్తున్నారు. కాకినాడ తీరంలో ఒక వెలుగు ఆదిత్యబిర్లా, అరవిందో వంటి పారిశ్రామక దిగ్గజాలు తీరంలో పరిశ్రమల ఏర్పాటుకు క్యూ కడుతున్నాయి. తొండంగి మండలం కేపీ పురం–కోదాడ మధ్య బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం మూడు రోజుల క్రితం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అనేక రాష్ట్రాలు పోటీపడినప్పటికీ రాష్ట్ర ప్రతిపాదనకు ఆమోదించడం, అదీ కూడా మన కాకినాడ జిల్లాలో ఏర్పాటుకు మార్గం సుగమం కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ముఖ్యమంత్రి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చిన క్రమంలోనే ఈ ప్రాజెక్టు లభించడం శుభసూచకంగా అభివర్ణిస్తున్నారు. ఈ పార్క్ ఏర్పాటు ద్వారా రూ.6,940 కోట్ల పెట్టుబడులు వస్తాయనే అంచనాలున్నాయి. వచ్చే ఎనిమిదేళ్లలో ఈ పార్కులో రూ.46,400 కోట్ల వ్యాపార లావాదేవీలు జరుగుతూ సుమారు 15వేల మంది యువతకు అవకాశాలు లభించనున్నాయి. ఈ పార్కు ఏర్పాటుతో రాష్ట్రంలోనే ఫార్మా రంగంలో కాకినాడ తీరం ఒక వెలుగు వెలగనుందని పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. చురుగ్గా మేజర్ హార్బర్ పనులు కాకినాడ తీరంలో ఉప్పాడలో మినీ హార్బర్ నిర్మాణం కోసం దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి రూ.50 కోట్లతో ప్రణాళిక సిద్దం చేశారు. ఆయన హఠాన్మరణం తరువాత పాలకులు ఐదేళ్లపాటు ఈ నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో మత్స్యకారులకు ఇచ్చిన మాటకు మించి సీఎం జగన్ మినీ హార్బర్ స్థానే మేజర్ హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ పనులు తీరంలో వేగంగా జరుగుతున్నాయి. ఇందుకోసం రూ.422 కోట్లు కేటాయించారు. కొత్తపల్లి, తొండంగి మండలాల్లోని 25 గ్రామాల్లో 50 వేల మత్స్యకార కుటుంబాలకు లబ్థి చేకూర్చే ఈ ప్రాజెక్టు పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. సముద్ర వేటపై ఆధారపడి జీవితాలను నెట్టుకొచ్చే మత్స్యకారులు ఇంతవరకు వేటాడాక బోటు నిలపడానికి సరైన హార్బర్ కూడా ఉండేది కాదు. ఈ సమస్యను ప్రతిపక్ష నేతగా జగన్ పాదయాత్రలో గుర్తించారు. 2,500 బోట్లు వేటాడాక సరుకును దించేందుకు హార్బర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అనుబంధంగా మత్స్య ఉత్పత్తుల నిల్వ కోసం హార్బర్ సమీపాన 980 టన్నులతో గిడ్డంగులు, 40 టన్నుల సామర్థ్యం కలిగిన రెండు ఐస్ప్లాంట్లు కూడా సిద్ధవమతున్నాయి. తీరం వెంబడి... ► తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి, తాళ్లరేవు, ఐ.పోలవరం, కాట్రేనికోన తదితర తీర ప్రాంత మండలాల్లో సుమారు 20 రొయ్యల శుద్ధి కర్మాగారాలు కార్యకలాపాలు సాగుతున్నాయి. ఈ కర్మాగారాల్లో 10 నుంచి 15 వేల మంది ఉపాధి పొందుతున్నారు. ► అనపర్తి నియోజకవర్గం బిక్కవోలు మండలం భలభద్రపురంలో ఆదిత్యబిర్లా తొలి దశలో రూ.841 కోట్ల అంచనా వ్యయంతో గ్రాసిమ్ ఇండస్ట్రీ ఉత్పత్తి ఇటీవలనే ప్రారంభించింది. ఈ కర్మాగారం ద్వారా 1203 మందికి జీవనోపాధి లభిస్తోంది. ► గతంలో చంద్రబాబు పాలనలో గ్రాసిమ్ కర్మాగారం ఏర్పాటు వివాదాలతో అటకెక్కగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వ చొరవతో ఆదిత్య బిర్లా ఎంతో నమ్మకంతో ముందుకు వచ్చి ఉత్పత్తిని ప్రారంభించింది. ► తొండంగి మండలం పెరుమాళ్లపురం, ఉప్పాడ కొత్తపల్లి మండలాల మధ్య సుమారు రూ.2000 కోట్లతో గేట్‌వే ఆఫ్ కాకినాడ పోర్టు ఏర్పాటుకు ముందడుగు పడింది. ప్రముఖ ఫార్మా గ్రూప్ అరవిందో ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. ఇప్పుడున్న రెండు పోర్టులకు అదనంగా కాకినాడ గేట్‌వే పోర్టుకు ఇప్పటికే తుని నియోజకవర్గం తొండంగి మండలంలో పునాదిరాయి పడింది. ► కాకినాడ ఎస్ఈజడ్లో రూ.90 కోట్లతో సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్టు కంపెనీ గత ఏప్రిల్‌లోనే ఉత్పత్తి ప్రారంభించింది. (క్లిక్: సౌర విద్యుదుత్పత్తిలో దేశంలోనే కీలకంగా ఏపీ) ► పెద్దాపురం ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లో రూ.70 కోట్లతో నిర్మాణంలో ఉన్న దేవీ సీఫుడ్స్‌కు చెందిన ఆక్వా సీడ్ కంపెనీ త్వరలో అందుబాటులోకి రానుంది. ళీ తుని నుంచి అంతర్వేది వరకు పలు ఐస్ఫ్యాక్టరీలు, థర్మాకోల్ తయారీ ప్లాంట్లు ఏర్పాటు అవుతున్నాయి. నమ్మకంతో వస్తున్నారు తీర ప్రాంతంలో ఏర్పాటవుతోన్న పరిశ్రమలతో యువతకు ఉజ్వల భవిష్యత్ లభించనుంది. తెలుగుదేశం ప్రభుత్వంలో పాలకులు రైతులపై అక్రమంగా కేసులు బనాయించి బలవంతంగా భూములు లాక్కుని ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు చేయలేదు. భూములతో వ్యాపారాలు చేసుకుని కోట్లు సంపాదించారు. అందుకే పారిశ్రామికవేత్తలు వెనుకంజ వేశారు. ఇందుకు పూర్తి భిన్నంగా ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దూరదృష్టి, అతనిపై నమ్మకం ఉండటంతోనే పారిశ్రామిక దిగ్గజాలు ముందుకు వస్తున్నాయి. తుని నియోజకవర్గంలో రెండువేల ఎకరాలను బల్క్ డ్రగ్ పార్కుకు కేటాయిస్తున్నాం. కోదాడ, పెరుమాళ్లపురం గ్రామాల్లో బల్క్ డ్రగ్ పార్కుకు భూమిని కేటాయిస్తారు. – దాడిశెట్టి రాజా, రోడ్లు, భవనాలు శాఖా మంత్రి మత్స్యకారుల అభివృద్దికి పెద్దపీట ప్రజా సంకల్పయాత్రలో కాకినాడలో నిర్వహించిన మత్స్యకారుల సమ్మేళనంలో సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన మామీని అధికారంలోకి రాగానే అమలు చేశారు. సుమారు 25 ఏళ్లుగా కొత్తపల్లి, తొండంగి మండలాల మత్స్యకారులు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యకు పరిష్కారం చూపించారు. మినీ హార్బర్ నిర్మించాలని మత్స్యకారులు అడిగితే ఏకంగా మేజర్ హార్భర్ నిర్మాణంకు సీఎం చర్యలు తీసుకోవడం ఒక చారిత్రక నిర్ణయం. తీర ప్రాంతం పారిశ్రామికంగా అభివృద్ది సాదించడానికి మత్స్యకారుల అభ్యున్నతికి మేజర్ హార్భర్ ఎంతగానో ఉపయోగపడుతుంది. –పెండెం దొరబాబు, ఎమ్మెల్యే పిఠాపురం -
నాన్నను తీసుకొస్తానని వెళ్లి...
తాళ్లరేవు(తూర్పుగోదావరి జిల్లా): కారులో భీమవరం వెళ్తున్న నాన్నను వెనక్కి తీసుకువస్తానని బైక్‌పై వెళ్లిన ఆ యువకుడు రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయాడు. కోరంగి పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కాకినాడ జగన్నాథపురం ప్రాంతానికి చెందిన చింతలపూడి చంద్రశేఖర్ అక్కడి ఆంధ్రా పాలిటెక్నిక్ వద్ద పీఎంపీ వైద్యుడిగా పని చేస్తున్నారు. ఆయన కుమారుడు మల్లికార్జున్ అలియాస్ అర్జున్ (21) అమలాపురం కిమ్స్ వైద్య కళాశాలలో బీడీఎస్ (దంత వైద్యులు) రెండో సంవత్సరం చదువుతున్నాడు. తండ్రి చంద్రశేఖ ర్ పని మీద ఆదివారం వేకువన కారులో భీమవరం బయలుదేరారు. ఒంటరిగా వెళ్లవద్దని, అమ్మను కూడా వెంట తీసుకువెళ్లాలని చెప్పినప్పటికీ చంద్రశేఖర్ ఒక్కరే వెళ్లారు. ఈ నేపథ్యంలో ఆయనను ఆపేందుకు అర్జున్ ఫోన్ చేశాడు. తండ్రి ఫోన్ తీయకపోవడంతో ఆయన కారును ఆపాలనే ఉద్దేశంతో మోటార్ సైకిల్‌పై కాకినాడ నుంచి బయలుదేరాడు. జాతీయ రహదారి 216లో కోరంగి పంచాయతీ సీతారామపురం పెట్రోల్ బంకు వద్దకు వచ్చేసరికి అతడి బైక్ అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన అర్జున్ను రోడ్ సేఫ్టీ పోలీస్ కానిస్టేబుల్ స్థానిక సీహెచ్‌సీకి తీసుకువెళ్లి ప్రథమ చికిత్స చేయించారు. అనంతరం అంబులెన్స్‌లో కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో అర్జున్ మృతి చెందాడు. విలపిస్తున్న తల్లిదండ్రులు అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఒక్కగానొక్క కొడుకూ తమకు లేకుండా పోయాడని తల్లిదండ్రులు బోరున విలపించారు. రోజూ తన పాదాలకు నమస్కరించాకే కళాశాలకు బయలుదేరేవాడని గుర్తు చేసుకుంటూ ఆ తల్లి గుండెలు పగిలేలా రోదిస్తోంది. ‘నన్నయినా నీతో తీసుకువెళ్లు.. లేదా అమ్మనైనా తీసుకువెళ్లు’ అని చెప్పిన కొడుకుతో ‘ఈ రోజు ఆదివారం కదా! అమ్మతో పాటు ఇంటి వద్ద ఉండు. నేను భీమవరం వెళ్లి వస్తాను’ అని చెప్పి చంద్రశేఖర్ బయలుదేరారు. అమలాపురం చేరేసరికి కొడుకు ప్రమాదానికి గురయ్యాడనే సమాచారం తెలియడంతో తల్లడిల్లిపోయారు. బీడీఎస్ ఫస్టియర్ ఫస్ట్‌క్లాస్‌లో ఉత్తీర్ణుడైన అర్జున్ తమందరిలో చురుకుగా ఉండేవాడని, అతడి హఠాన్మరణం తమను కలచివేసిందని స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. -
వాట్సాప్ మెసేజ్: తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా..
తాళ్లరేవు (తూర్పుగోదావరి): చదువు తనకు భారంగా మారిందని, ఇక తాను చదవలేనని, చచ్చిపోతానంటూ ఒక విద్యార్థి తల్లిదండ్రులకు పంపిన వాట్సాప్ ఆడియో మెసేజ్ తోటి విద్యార్థులను తీవ్ర కలవరానికి గురిచేసింది. కోరంగి పోలీసులు, తోటి విద్యార్థులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం జిల్లా కావటి మండలం, గొనపకుత్తిక గ్రామానికి చెందిన లొల్ల సాయిచరణ్ కోరంగి కైట్ ఇంజినీరింగ్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. కళాశాల హాస్టల్లో ఉంటున్న సాయిచరణ్ ఆదివారం ఉదయం ఎన్సీసీ కటింగ్ చేయించుకునేందుకు బార్బర్ షాపునకు వెళ్లి వస్తానని చెప్పి అనుమతి తీసుకుని బయటకు వెళ్లి తిరిగిరాలేదు. కొద్దిసేపటి అనంతరం సాయిచరణ్ తల్లిదండ్రులు కళాశాల ప్రతినిధులకు ఫోన్ చేశారు. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయని, ఇప్పటివరకు ఎలాగో చదివానని ఇకపై తాను చదవలేకపోతున్నానని, తమ్ముడ్ని జాగ్రత్తగా చూసుకో అమ్మా, నన్ను క్షమించమ్మా అంటూ విలపిస్తూ వాట్సాప్‌లో ఆడియో మెసేజ్ చేశాడని చాలా ఆందోళనగా ఉందని తెలిపారు. తక్షణమే స్పందించిన కళాశాల ప్రతినిధులు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. చదవండి: ('ఎంత రాత్రయినా వస్తానని చెప్పి అటే వెళ్లిపోయారు') పలువురు విద్యార్థులు కోరంగి, తాళ్లరేవు, యానాం పరిసర ప్రాంతాల్లో సాయిచరణ్ ఆచూకీ కోసం గాలించారు. ఫలితం లేదు. కళాశాల హాస్టల్ వార్డెన్ కృష్ణ, సాయిచరణ్ తండ్రి షణ్ముఖరావు కోరంగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కోరంగి హెడ్‌కానిస్టేబుల్ గంగాధర్‌రావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాయిచరణ్‌కు బ్యాక్‌ల్యాగ్స్ కేవలం రెండే ఉన్నాయని, క్రీడలతోపాటు ఎన్సీసీ వంటి వాటిలో చాలా చురుకుగా ఉండేవాడని కళాశాల ప్రతినిధులు, తోటి విద్యార్థులు తెలిపారు. -
అబ్బుర పరచిన భారీ భోగిదండ
తాళ్లరేవు (ముమ్మిడివరం): చొల్లంగిపేట శ్రీవివేకానంద ఇంగ్లిషు మీడియం హైసూ్కల్ విద్యార్థులు తయారు చేసిన భారీ భోగిదండ అందరినీ అబ్బురపరచింది. నెల రోజులుగా విద్యార్థులు ఆవుపేడను సేకరించి, ఎంతో శ్రమించి ఈ దండను తయారు చేసినట్లు ప్రిన్సిపాల్ ఎంబీ శంకర్ తెలిపారు. సుమారు లక్షా పది వేలకు పైగా పిడకలతో, సుమారు 1100 మీటర్లు పొడవుతో ఈ భోగిదండ ఉన్నట్లు తెలిపారు. సంక్రాంతి సంబరాలలో భాగంగా శనివారం ఈ దండను విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించారు. ఈ దండను 300 మందికిపైగా విద్యార్థులు గ్రామంలో ప్రదర్శించి అనంతరం భోగిమంటలో వేశారు. తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు నిలువెత్తు నిదర్శనమైన పెద్ద పండుగ విశిష్టతను నేటి తరం వారికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ భారీ భోగిదండను తయారు చేసినట్లు స్కూల్ చైర్మన్ కందెళ్ల గంగబాబు తెలిపారు. -
‘నువ్వు దక్కకపోతే.. ఫొటోలు అందరికీ చూపిస్తా’
సాక్షి, తాళ్లరేవు (తూర్పుగోదావరి జిల్లా): వేధింపులు తాళలేక కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వివాహిత పినపోతు లీలావతి ఆత్మహత్య చేసుకుంది. కోరంగి ఎస్సై వై.సతీష్ కథనం ప్రకారం, లీలావతికి కాకినాడ ఏటిమొగకు చెందిన వీరబాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. పలు కారణాలతో భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండలేక లీలావతి వైజాగ్ వెళ్లి ఒక బ్యూటీ పార్లర్లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో లీలావతిపై మేనమామ సంగాడి ఈశ్వరరావు వేధింపులకు దిగాడు. ‘ఒంటరి జీవితం ఎందుకు, నేను తోడుగా ఉండి చూసుకుంటా’నంటూ ఫోనులో వేధించేవాడు. అందుకు లీలావతి అంగీకరించకపోవడంతో ‘నీవు నాకు దక్కకపోతే చంపేస్తాన’ని ఫోనులో బెదిరించేవాడు. ఇదిలా ఉండగా వైజాగ్‌కు చెందిన వడిసెల సంతోష్‌కుమార్ రికార్డింగ్‌కు అమ్మాయిలను పంపించేవాడు. వారికి మేకప్ వేయడానికి బ్యూటీషియన్ కావాలని లీలావతికి మాయమాటలు చెప్పి అనకాపల్లి తీసుకువెళ్లి అసభ్యకరంగా ఫొటోలు తీశారు. ‘ఆ ఫొటోలు చూపించి నువ్వు నాకు దక్కకపోతే ఫొటోలు అందరికీ చూపించి, నీ తల్లిదండ్రుల పరువు తీస్తామ’ని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు తాళలేక 20 రోజుల క్రితం స్వగ్రామం చేరుకున్న లీలావతి మంగళవారం చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. లీలావతి తల్లి దోమ వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్ తెలిపారు. -
థ్యాంక్స్ టు జగనన్న
సాక్షి, తాళ్లరేవు (ముమ్మిడివరం): పేద విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తూ కైట్ గ్రూప్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలల విద్యార్థినులు శుక్రవారం అభినందన ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి గ్రామంలోగల కైట్ ఇంజనీరింగ్ కళాశాలలో విద్యనభ్యసిస్తున్న సుమారు 1,500 మందికిపైగా విద్యార్థినులు ‘థాంక్యూ సీఎం, థాంక్యూ జగన్’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ పోతుల వెంకట విశ్వం మాట్లాడుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఫీజు రీయింబర్స్మెంట్ పథకాన్ని ప్రారంభించి నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు అవకాశం కల్పించారన్నారు. ప్రస్తుతం ఆయన తనయుడు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద విద్యార్థుల చదువుకయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతోపాటు వసతి, భోజనం కోసం అదనంగా ఇరవై వేలు ప్రకటించడం అభినందనీయమన్నారు. -
మళ్లీ మొదలైన మట్టి దోపిడీ
పట్టపగలే జోరుగా అక్రమ రవాణా మండలస్థాయి నాయకుడి అండదండా పట్టించుకోని ప్రభుత్వ యంత్రాంగం తాళ్లరేవులో మట్టి దోపిడీ మళ్లీ మొదలైంది. స్థానిక ఆత్రేయ గోదావరిలో డ్రెడ్జింగ్ ద్వారా తవ్వి తీసిన మట్టిని అక్రమార్కులు దర్జాగా తరలించుకుపోతున్నారు. పట్ట పగలే పొక్లెయి¯ŒS ద్వారా మట్టిని టిప్పర్లలో వేసి తరలిస్తున్నా ప్రభుత్వ యంత్రాంగం పట్టించుకో వడం లేదు. మండల స్థాయి నాయకుని అండదండలతో మట్టి అక్రమ రవాణా జోరుగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. – తాళ్లరేవు మురుగుకాలువల అభివృద్ధిలో భాగంగా సుమారు రూ.25 కోట్ల ప్రపంచ బ్యాంకు నిధులతో ఆత్రేయ డ్రెయిన్ డ్రెడ్జింగ్ పనులను నాలుగేళ్ల క్రితం ప్రభుత్వం చేపట్టింది. డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసిన మట్టిని గోదావరి చెంతన గట్లపైన, సమీప పల్లపు ప్రాంతాలలోనూ వేస్తున్నారు. ఈ మట్టిని గట్లపై వేయడం ద్వారా గోదావరి గట్లు పటిష్టమవుతాయని గోదావరి చెంతనగల రైతులు, ప్రజలు ఆనం దం వ్యక్తం చేశారు. అయితే గతంలో కొందరు అక్రమార్కులు, అధికార పార్టీ నాయకులతో కుమ్మక్కై లక్షలాది రూపాయల విలువైన మట్టిని దర్జాగా యంత్రాల సాయంతో తవ్వి లారీలు, టిప్పర్లలో తరలించి సొమ్ము చేసుకున్నారు. ఈ భాగోతంపై పలువురు ఫిర్యాదు చేయడంతో మట్టి తరలింపు నిలిచిపోయింది. అయితే రెండు రోజులుగా అక్రమార్కులు మళ్లీ మట్టి అక్రమ తరలింపునకు తెరతీశారు. నిత్యం అనేక టిప్పర్లతో మట్టిని ఇతర ప్రాంతాలకు తరలించేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం, ఇరిగేషన్, డ్రెయినేజీ అధికారులు స్పందించకపోవడం గమనార్హం. ఏటిగట్టును ఛిద్రం చేస్తున్నారు ఆత్రేయ గోదావరి చెంతనే అనేక గ్రామాలు ఉన్నాయి. వాటితో పాటు వేలాది ఎకరాల వరి ఆయకట్టు ఉంది. వరదల సమయంలో ఆయా గ్రామాలకు, వరి ఆయకట్టుకు ఎటువంటి నష్టం కలుగకుండా ఏటిగట్లు కాపాడుతూ ఉంటాయి. అటువంటి గట్లను ఇష్టానుసారం తవ్వేసి అక్రమార్కులు మట్టిని తరలించుకుపోతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీంతో భవిష్యత్‌లో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి ఉంటుందంటున్నారు. ఒక పక్క ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి ఏటిగట్లను పటిష్టం చేస్తుంటే మరోపక్క ఏటిగట్లపై ఉన్న మట్టిని దర్జాగా తరలించుకు పోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్, ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు తక్షణమే స్పందించి మట్టి అక్రమ తరలింపును నిలిపివేసి బాధ్యులపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. -
చిన్నారిని ఆదుకోరూ...!
బిడ్డకు గుండెలో రంధ్రంతో తల్లిదండ్రుల ఆవేదన దాతల సాయం కోసం ఎదురుచూపులు తాళ్లరేవు: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారికి గుండెకు రంధ్రం ఉందని తెలియడంతో ఆ కుటుంబం బెంబేలెత్తుతోంది. చిన్నారికి వైద్యం చేయించడం తమకు శక్తిమించిన పని కావడంతో దాతల సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ గౌతం నగర్‌కు చెందిన కోట ధనరాజు, గంగ దంపతులు చిన్నచిన్న కూలిపనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. వారికి స్వర్ణరాజు అనే 9 నెలల బాలుడు ఉన్నాడు. ఇటీవల స్వర్ణరాజు అనారోగ్యానికి గురవడంతో స్థానిక సబ్సెంటర్లో చూపించారు. ఆ బాలుడికి గుండె సంబంధింత వ్యాధి ఉందని, స్కానింగ్ చేయించాలని చెప్పారు. స్థానిక పంచాయతీ గుమాస్తా కుడుపూడి వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) అందించిన ఆర్థిక సహకారంతో ఆ బాబుకు స్కానింగ్ చేయించారు. బాలుడి గుండెకు రంధ్రం ఉందని, హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయింతాలని వైద్యులు చెప్పారు. ఇంటి పోషణే కష్టంగా ఉన్న తాము బిడ్డకు వైద్యం ఎలా చేయించాలో దిక్కుతోచక ఆదంపతులు తల్లడిల్లుతున్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణకు బాలుని పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన ఆస్పత్రి ఖర్చులకు రూ. రెండు వేలు ఇచ్చారు. బాలునికి ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక నాయకులకు ఆయన సూచించారు. బాలుడి శస్త్ర చికిత్సకు లక్షలాది రూపాయలు అవసరం కానున్న నేపథ్యంలో ఆదుకునే దాతలు నెం. 90149 31377ను సంప్రదించాలని ధనరాజు, గంగ దంపతులు కోరారు. -
కోనసీమ కేరళను తలపిస్తోంది
సినీ నేపథ్య గాయని చిత్ర తాళ్లరేవు : కొబ్బరి చెట్లు, గలగలా పారే గోదావరితో కోనసీమ ప్రాంతం కేరళను తలపిస్తోందని ప్రముఖ నేపథ్యగాయని చిత్ర పేర్కొన్నారు. కోనసీమ ఉత్సవాల్లో పాల్గొనేందుకు వచ్చి యానాం జీవీఎస్ రెసిడెన్సీలో బస చేసిన ఆమెను ‘సాక్షి’ పలుకరించింది. తాను తూర్పుగోదావరి జిల్లాకు రావడం ఇదే ప్రథమమని, ఈ ప్రాంతం తనను ఎంతగానో ఆకట్టుకుందన్నారు. ముఖ్యంగా గోదావరి అందాలు చూస్తుంటే చెప్పలేని ఆనందం కలుగుతోందన్నారు. ఇక్కడ దట్టమైన కొబ్బరితోటలు, పచ్చని చెట్ల నడుమ ప్రయాణిస్తుంటే కేరళలో ఉన్న అనుభూతి కలుగుతుందన్నారు. ఇక్కడి ప్రజల ఆప్యాయతానురాగాలను ఎన్నటికీ మరువలేనన్నారు. అవకాశం వస్తే మరోమారు జిల్లాకు వచ్చి ఇక్కడి పర్యాటక ప్రదేశాలన్నింటిని వీక్షించాలని ఉందన్నారు. -
ఆటోను ఢీకొన్న బస్సు : యువతి మృతి
తాళ్లరేవు : జాతీయ రహదారి 216 లోని చొల్లంగి గోడౌన్స్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చినగోవలంక గ్రామానికి చెందిన కోరుకొండ ప్రవీణ (25) అనే యువతి మృతి చెందింది. ఇంజరం పంచాయతీ చినగోవలంక గ్రామానికి చెందిన కోరుకొండ ప్రవీణ కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రిలో మూడేళ్లుగా స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. మరో నలుగురు యువతులతో కలిసి అక్కడే అద్దెకు ఉంటోంది. ప్రతి ఆదివారం స్వగ్రామానికి వచ్చి చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుంది. ప్రతి వారం మాదిరిగానే ఇంటికి వచ్చి తిరిగి సోమవారం ఆటోలో కాకినాడకు బయలు దేరింది. ఆటో చొల్లంగి ఎన్ఎస్ఎన్ రెడ్డి గోడౌన్స్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న కాకినాడ-అమలాపురం ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణకు తలపై తీవ్ర గాయాలు కావడంతో మరో ఆటోలో కాకినాడ తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వృద్ధుడు, ఒక మహిళ, చిన్నారికి సైతం గాయాలయ్యాయి. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బస్సు, ఆటో డ్రైవర్లు పరారైనట్టు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కోరంగి ఎస్సై ఆర్. ఆనంద్‌కుమార్, ఏఏఎస్సై ఆర్వీఎన్ మూర్తి సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు. జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబం ప్రవీణ మృతితో ఆ కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. ప్రవీణ తండ్రి గడ్డియ్య మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి కుటుంబ భారాన్ని ప్రవీణ మోస్తోంది. గత మూడేళ్లుగా ఆస్పత్రిలో పనిచేస్తూ తమ్ముడు బాబాసాహెబ్‌ను పాలిటెక్నిక్ చదివిస్తోంది. తల్లి అన్నపూర్ణను పోషిస్తోంది. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. చినగోవలంక గ్రామంలో విషాదం అలుముకుంది. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
తాళ్లరేవు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారి 216లోని కోరంగి పంచాయితీ సుబ్బారాయుని దిమ్మవద్ద గురువారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. వివరాలు ఇలా ఉన్నాయి. తాళ్లరేవు మండలం కోరంగిలోని ప్రతాప్ నగర్‌కి చెందిన మడికి అమ్మిరాజు (35) రొయ్యల కంపెనీలో దినసరి కూలీ. విధి నిర్వహణ నిమిత్తం సైకిల్‌పై వెళుతున్న అమ్మిరాజును ఉదయం 5.30 గంటల సమయంలో కాకినాడనుంచి అంతర్వేదికి రొయ్యల సీడుతో వెళుతున్న వ్యాన్ ఢీకొంది. అమ్మిరాజు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. రాజు మృతి విషయం తెలిసిన బంధువులు, గ్రామస్తులు సంఘటన స్థలంలో బైఠాయించారు. రహదారికి అడ్డంగా ముళ్లకంచెలు వేసి దిగ్బంధించారు. సుమారు రెండు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోగా రామచంద్రపురం సీఐ ఎ.రాంబాబు, కోరంగి ఇన్చార్జ్ ఎస్సై రమేష్‌లు ఆందోళనకారులతో చర్చించినా ఫలితం లేకపోయింది. సుమారు 8 గంటల పాటు ఈ ఆందోళన సాగింది. ప్రమాదానికి కారణమైన వ్యాన్‌లోని వ్యక్తులు ఆర్థిక సహాయం చేసేందుకు, వాహన యజమాని నుంచి నష్ట పరిహారం చెల్లించేందుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కోరంగి హెచ్‌సీ నాగేశ్వరరావు కేసు దర్యాప్తు చేస్తున్నారు.