‘నువ్వు దక్కకపోతే.. ఫొటోలు అందరికీ చూపిస్తా’ | Women Suicide in East Godavari District over Harassment | Sakshi
Sakshi News home page

‘నువ్వు దక్కకపోతే.. ఫొటోలు అందరికీ చూపిస్తా’

Published Wed, Oct 16 2019 2:00 PM | Last Updated on Wed, Oct 16 2019 2:00 PM

Women Suicide in East Godavari District over Harassment - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, తాళ్లరేవు (తూర్పుగోదావరి జిల్లా): వేధింపులు తాళలేక కోరంగి పంచాయతీ చినబొడ్డు వెంకటాయపాలెం గ్రామానికి చెందిన వివాహిత పినపోతు లీలావతి ఆత్మహత్య చేసుకుంది. కోరంగి ఎస్సై వై.సతీష్‌ కథనం ప్రకారం, లీలావతికి కాకినాడ ఏటిమొగకు చెందిన వీరబాబుతో పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ముగ్గురు సంతానం. పలు కారణాలతో భార్యాభర్తలు విడిపోయి వేరుగా ఉంటున్నారు. ఒంటరిగా ఉండలేక లీలావతి వైజాగ్‌ వెళ్లి ఒక బ్యూటీ పార్లర్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో లీలావతిపై మేనమామ సంగాడి ఈశ్వరరావు వేధింపులకు దిగాడు. ‘ఒంటరి జీవితం ఎందుకు, నేను తోడుగా ఉండి చూసుకుంటా’నంటూ ఫోనులో వేధించేవాడు. అందుకు లీలావతి అంగీకరించకపోవడంతో ‘నీవు నాకు దక్కకపోతే చంపేస్తాన’ని ఫోనులో బెదిరించేవాడు.

ఇదిలా ఉండగా వైజాగ్‌కు చెందిన వడిసెల సంతోష్‌కుమార్‌ రికార్డింగ్‌కు అమ్మాయిలను పంపించేవాడు. వారికి మేకప్‌ వేయడానికి బ్యూటీషియన్‌ కావాలని లీలావతికి మాయమాటలు చెప్పి అనకాపల్లి తీసుకువెళ్లి అసభ్యకరంగా ఫొటోలు తీశారు. ‘ఆ ఫొటోలు చూపించి నువ్వు నాకు దక్కకపోతే ఫొటోలు అందరికీ చూపించి, నీ తల్లిదండ్రుల పరువు తీస్తామ’ని బెదిరించడం మొదలుపెట్టారు. ఆ వేధింపులు తాళలేక 20 రోజుల క్రితం స్వగ్రామం చేరుకున్న లీలావతి మంగళవారం చీరతో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన కిందకు దింపారు. అప్పటికే ఆమె మృతి చెందింది. లీలావతి తల్లి దోమ వీరలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై సతీష్‌ తెలిపారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement