ఫోటో కర్టసీ: ఏషియానెట్ న్యూస్
తిరువనంతపురం: కేరళలో మహిళలపై వేధింపులు, హింస కేసుల నమోదు రోజురోజుకు తీవ్రమవుతోంది. నిన్నగాక మొన్న వివాహితను దారుణంగా హత్య చేశాడో ఉన్మాది. తాజాగా అత్తింటి వేధింపులతో కేరళలోని కన్నూర్ జిల్లా పయ్యన్నూర్‌కు చెందిన సునీషా ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కలకలం రేపింది. అయితే ఈ రాత్రికి తాను ప్రాణాలతో ఉంటానో లేదో అనుమానమే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న సునీషా (26) తన సోదరుడితో మాట్లాడిన ఆడియో తాజాగా వెలుగులోకి వచ్చింది.
సునీషా ఒకటిన్నర సంవత్సరాల క్రితం విజేష్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఈ ఆదివారం అత్తమామల ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద రీతిలో శవమై తేలింది. అయితే ఆమె చనిపోవడానికి కొన్ని రోజుల ముందు సోదరుడు సుధీష్‌తో భర్త, అత్తమామల వేధింపులు, తాను అనుభవిస్తున్నమానసిక క్షోభ గురించి ఫోన్ ద్వారా మొరపెట్టుకుంది. భర్త తీవ్రంగా కొట్టడం, అత్త జుట్టుపట్టుకుని లాగడం లాంటి విషయాలను చెప్పుకుంది.
అలాగే మామ కూడా హెల్మెట్‌తో తనపై దాడి చేశాడని కూడా బాధితురాలు వాపోయింది. అంతేకాదు ఈ రాత్రి నేను సజీవంగా ఉంటానా డౌటే అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆడియో ఇపుడు స్థానిక మీడియాలో వైరల్‌గా మారింది. భర్త కొడుతుండగా సునీషా మరో ఆడియో రికార్డు చేసింది. తన అత్త కొడుతున్నపుడు, మామ తనతో అసభ్యంగా ప్రవర్తించినపుడు ఎందుకు మాట్లాడలేదని భర‍్తని ప్రశ్నించడం, అలాగే తనను కొడుతున్న విజువల్స్ కూడా రికార్డ్ చేస్తానని సునీషా చెప్తే.. ఏం చేసుకుంటావో..చేసుకో పో అని విజేష్ చెప్పడం లాంటివి ఇందులో రికార్డైనాయి. దీంతో మొదట సునీషాది ఆత్మహత్యగా భావించినా, అత్తింటి వారే ఆమెను హత్యచేసి వుంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
చదవండి : మహిళపై రెచ్చిపోయిన ఉన్మాది,15 కత్తి పోట్లు, చివరికి..
మరోవైపు తాము ఎన్ని ఫిర్యాదులు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లనే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పెళ్లైన దగ్గర్నుంచీ విజేష్, అతని తల్లిదండ్రులు సునీషాను వేధించారన్నాని సోదరుడు తెలిపాడు. దీంతో ఆమెను ఇంటికి తీసుకుపోవాలని చాలాసార్లు ప్రయత్నించినా, ఇందుకు విజేష్ సుతరామూ అంగీకరించ లేదన్నాడు. ఆమెను తీసుకెళ్లేందుకు వచ్చేటపుడు ఒంటరిగా రావద్దని, రాజకీయ పలుకుబడి ఉన్న అత్తింటివాళ్లు ఏదైనా చేస్తారని కూడా తనను హెచ్చరించిందని సుధీష్ తెలిపాడు.
ఆమెను అక్కడినుంచి తీసుకొచ్చేందుకు పయ్యన్నూర్ పోలీసులను ఆశ్రయిస్తే.. ఆ కుటుంబంతో మాట్లాడి రేపు వస్తుంది, మాపు వస్తుంది కావాలనే తాత్సారం చేశారని ఆరోపించాడు. సునీషాను బయటకు అనుమతించకుండా కట్టడి చేశారని ఒక్కోసారి ఆమెకు తిండికూడా పెట్టేవారు కాదని వాపోయాడు. కాగా అనుమానాస్పద మరణంగా కేసు నమోదు చేసినట్లు పయ్యన్నూర్ పోలీసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment