ఆత్మహత్యకు పాల్పడిన వివాహిత వనిత
ధర్మవరం అర్బన్: అదనపు కట్నం తేలేదని విడాకులు నోటీసు పంపడంతో మనస్తాపానికి గురైన వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. రెండు రోజుల కిందట ధర్మవరం చెరువులో తేలిన మహిళ మృతదేహం వనిత (30)దిగా గుర్తించారు. పోలీసులు, మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు వివరాలిలా ఉన్నాయి. హిందూపురానికి చెందిన పూల గుర్రప్ప, చెన్నకేశమ్మ దంపతుల రెండో కుమార్తె వనితను 2017 ఫిబ్రవరి 12న ధర్మవరంలోని మార్కెట్‌వీధికి చెందిన చంద్రమౌళికి ఇచ్చి వివాహం చేశారు.
భార్యాభర్తలు బెంగళూరులో ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవారు. అయితే కొద్ది రోజులుగా అదనపు కట్నం కోసం వనితకు వేధింపులు మొదలయ్యాయి. భర్త చంద్రమౌళితోపాటు అత్త కొండమ్మ, మరిది నాగేంద్రలు అదనపు కట్నం కింద రూ.5లక్షలు, ఒక కారు తీసుకురావాలని ఆమెను మానసికంగా హింసించేవారు. పెద్దల సమక్షంలో పంచాయితీ చేసి కాపురానికి పంపినా చంద్రమౌళిలో మార్పు రాలేదు.
విడాకుల నోటీసుతో మనస్తాపం..
మెట్టినింటి నుంచి విడాకుల నోటీసు అందడంతో వనిత తన భర్తను నిలదీయడానికి హిందూపురం నుంచి ఈ నెల ఏడో తేదీన ధర్మవరం వచ్చింది. అప్పటి నుంచి తిరిగి ఇంటికి రాలేదు. తన కూతురు కనిపించడం లేదని వనిత తండ్రి గుర్రప్ప హిందూపురం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. తొమ్మిదో తేదీన ధర్మవరం చెరువులో గుర్తు తెలియని మహిళ శవం బయటపడిందని హిందూపురం పోలీసులు గురప్పను ఇక్కడకు తీసుకురాగా.. మృతురాలు తమ కూతురేనని గుర్తించి కన్నీటి పర్యంతమయ్యాడు.
తన కూతురు చావుకు అల్లుడు చంద్రమౌళి, అత్త కొండమ్మ, మరిది నాగేంద్రలు కారణమని, వారిపై చర్యలు తీసుకోవాలని గుర్రప్ప ధర్మవరం పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం వనిత మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment