సాక్షి,పాలకొండ రూరల్(శ్రీకాకుళం): నాలుగు నెలల పసిపాప పాల కోసం ఏడిస్తే అమ్మ ఇక రాలేదు. రెండేళ్ల బుజ్జాయిలు ఆకలంటే ఆ తల్లి గోరుముద్దలు తినిపించలేదు. ముగ్గురు కుమార్తెల ఆలనాపాలనా చూసేందుకు ఆ అమ్మ ఇక లేదు. వేధింపులు తట్టుకోలేని మానసిక స్థితిలో కన్నబిడ్డలను వదిలేసి ఆ అమ్మ వెళ్లిపోయింది. పాలకొండ పట్టణం గారమ్మ కాలనీ 6వ లైన్‌కు చెందిన ప్రియాంక(24) బుధవారం ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పాలకొండ పట్టణం గారమ్మకాలనీ 6వ లైన్‌కు చెందిన గౌడు మమతకు ప్రియాంక(24), గాయత్రి అనే ఇద్దరు కుమార్తెలున్నా రు. భర్త మరణించడంతో మమతే పిల్లలను పెంచి పెద్ద చేశారు. స్థానికంగా ఒక ప్రైవేటు కాలేజీలో పనిచేస్తూ పెద్ద కుమార్తెకు 2019లో టెక్కలి పట్టణానికి చెందిన సొదై కిరణ్‌కు ఇచ్చి వివాహం చేశారు. 2020లో ప్రియాంకకు తొలికాన్పులో ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. ఇటీవల రెండో కాన్పులో మరో ఆడపిల్ల పుట్టింది. అప్పటి నుంచి భర్త కుటుంబం నుంచి ఆమెకు సమస్యలు మొదలయ్యాయి. సంతానం అంతా ఆడపిల్లలు కావడంతో వారిని పెంచేందు కు, బాగోగులు చూసేందుకు అదనపు సొమ్ము కావాలంటూ భర్తతో పాటు అత్త, భర్త పెద్ద సోదరుడు, ఆయన భార్యతో పాటు మరో ఇద్దరు తోటికోడళ్లు వేధింపులకు గురి చేసినట్లు ప్రియాంక తన సూసైడ్ నోట్‌లో పేర్కొన్నారు. ఈ గొడవలు జరుగుతుండ గా బుధవారం కన్నవారింటిలో ఉన్న ప్రియాంక తన తల్లి, సోదరి పనులకు వెళ్లిపోయిన తర్వాత ఇంటిలో ఉరి వేసుకుంది.
అమ్మ కాళ్లు పట్టుకుని..
మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ప్రియాంక చెల్లి గాయత్రి ఇంటికి వచ్చే సరికి తలుపులు వేసి ఉన్నాయి. నాలుగు నెలల పసిపాప గుక్కపట్టి ఏడుస్తోంది. ఏమై ఉంటుందోనని ఆమె తలుపులు తోసు కుని లోపలకు వెళ్లి చూస్తే.. ప్రియాంక ఉరి వేసుకుని కనిపించింది. పక్కనే ఉయ్యాలలో ఉన్న చంటిబిడ్డ కింద పడి తల్లి కాళ్లను పట్టుకుని ఏడుస్తోంది. ఈ దృశ్యాన్ని చూసి గాయత్రి చలించిపోయింది. వెంటనే తల్లికి, చుట్టుపక్కల వారిని సమాచారం అందించింది. వీరంతా ఇంటికి చేరుకుని ఆ దృశ్యాలను చూసి గుండెలవిసేలా రోదించారు. ప్రియాంక కఠిన నిర్ణయంతో ముగ్గురు పిల్లలు తల్లిలేనివారయ్యారంటూ కన్నీరు పెట్టారు.
Comments
Please login to add a commentAdd a comment