
తాళ్లరేవు మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరరావు ఇక లేరు. అనారోగ్యంతో ఆస్పత్రిలోనే..
సాక్షి, కాకినాడ: మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు దొమ్మేటి వెంకటేశ్వరరావు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగానూ ఈయనకు ఒక పేరుంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ దొమ్మేటి పని చేశారు. ఇక సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో.. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించారు.
చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దొమ్మేటి వెంకటేశ్వరావు ఫౌండేషన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నమూయడం గమనార్హం. దొమ్మేటి మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.
ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన