Dommeti Venkateswarlu
-
మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు కన్నుమూత
సాక్షి, కాకినాడ: మాజీ ఎమ్మెల్యే దొమ్మేటి వెంకటేశ్వరావు (66) ఇక లేరు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 2004 నుండి 2009 వరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పని చేశారు దొమ్మేటి వెంకటేశ్వరరావు. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డికి ఆప్తుడిగానూ ఈయనకు ఒక పేరుంది. గతంలో డీసీసీ అధ్యక్షుడిగానూ దొమ్మేటి పని చేశారు. ఇక సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర పాదయాత్ర సమయంలో.. వెంకటేశ్వరరావు కలిసి తన మద్దతును ప్రకటించారు. చాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. దొమ్మేటి వెంకటేశ్వరావు ఫౌండేషన్ ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ కన్నమూయడం గమనార్హం. దొమ్మేటి మృతి పట్ల ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్, పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఇదీ చదవండి: చంద్రబాబు వ్యాఖ్యలపై వెల్లువెత్తిన నిరసన -
వైఎస్ఆర్ సీపీలోకి దొమ్మేటి వెంకటేశ్వర్లు
-
జగన్ సమక్షంలో వైఎస్ఆర్ సీపీలోకి దొమ్మేటి
సాక్షి, కర్నూలు : తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు గురువారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో దొమ్మేటితో పాటు ఆయన అనుచరులు ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్‌తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ చేశారని విమర్శించారు. రాజన్న రాజ్యం జగన్‌తోనే సాధ్యమని అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో దొమ్మేటి కూడా పాల్గొన్నారు. అంతకు ముందు పాదయాత్రలో భాగంగా పెండేకల్ చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఫించన్లు రావడం లేదంటూ వృద్ధులు వాపోయారు. వైఎస్ఆర్ సీపీ అధికారంలోకి రాగానే అర్హులకు ఫించన్లు ఇవ్వడమే కాకుండా, ఫించన్లు రూ.2వేలు చేసి, అందరికి సకాలంలో అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. -
డీసీసీ అధ్యక్ష పదవికి దొమ్మేటి రాజీనామా
కాకినాడ, న్యూస్‌లైన్:మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది జిల్లా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి.. అసలే ‘విభజన’ శాపంతో సార్వత్రిక ఎన్నికల్లో డిపాజిట్లు దక్కక కుదేలైన కాంగ్రెస్ పార్టీలో ఊహించని రీతిలో భారీ కుదుపు చోటు చేసుకుంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టుగా దొమ్మేటి వెంకటేశ్వర్లు ప్రకటించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను శనివారం పీసీసీ అధ్యక్షుడు ఎన్.రఘువీరారెడ్డికి పంపించారు. వ్యక్తిగత కారణాల వల్ల పదవి నుంచి తప్పుకుంటున్నట్టు దొమ్మేటి తన లేఖలో పేర్కొన్నారు. 2004లో తాళ్లరేవు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున దొమ్మేటి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. 2009లో టికెట్ ఆశించి భంగపడ్డాడు. 2012లో అప్పటి డీసీసీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో ఆయన స్థానంలో దొమ్మేటిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రి ఎంఎం పళ్లంరాజుకు అనుచరునిగా కొనసాగుతున్న దొమ్మేటి ప్రస్తుతం పళ్లంరాజు ఒత్తిడి మేరకే రాజీనామా చేసినట్టుగా పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దొమ్మేటి స్థానంలో డీసీసీ అధ్యక్షునిగా ఎమ్మెల్సీ కందుల దుర్గేష్‌ను నియమించే అవకాశాలున్నట్టు చెబుతున్నారు. పదవికి రాజీనామా చేసిన దొమ్మేటి ప్రస్తుతానికి పార్టీలోనే కొనసాగుతున్నట్టుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్‌లో కొనసాగడం వల్ల రాజకీయ ఎదుగుదల ఉండదన్న భావనతో పార్టీనీ వీడే అవకాశాలున్నాయని అంటున్నారు. త్వరలోనే అధికార తెలుగుదేశం పార్టీలో చేరనున్నారనే వార్తలు విన్పిస్తున్నాయి. జాతీయ పార్టీ అయిన బీజేపీలో చేరితే మేలని ఆయన అనుచరులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్టు చెబుతున్నారు.