
సాక్షి, కర్నూలు : తూర్పు గోదావరి జిల్లా డీసీసీ మాజీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ దొమ్మేటి వెంకటేశ్వర్లు గురువారం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ పిల్లి సుభాష్ చంద్రబోస్ ఆధ్వర్యంలో దొమ్మేటితో పాటు ఆయన అనుచరులు ఇవాళ ఉదయం కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలో ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ను కలిశారు. వైఎస్ జగన్ వారికి కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దొమ్మేటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ..వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తలపెట్టిన ప్రజాసంకల్పయాత్రకు విశేష స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. వైఎస్ జగన్తోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని భావించి తాము పార్టీలో చేరినట్లు తెలిపారు. చంద్రబాబు ఈ నాలుగేళ్లలో రాష్ట్రాన్ని అవినీతిలో నంబర్ వన్ చేశారని విమర్శించారు. రాజన్న రాజ్యం జగన్తోనే సాధ్యమని
అన్నారు. ప్రజాసంకల్పయాత్రలో దొమ్మేటి కూడా పాల్గొన్నారు.
అంతకు ముందు పాదయాత్రలో భాగంగా పెండేకల్ చేరుకున్న వైఎస్ జగన్‌కు గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆయన గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్థానికులు తమ సమస్యలను వైఎస్ జగన్ దృష్టికి తీసుకు వచ్చారు. ఫించన్లు రావడం లేదంటూ వృద్ధులు వాపోయారు. వైఎస్‌ఆర్ సీపీ అధికారంలోకి రాగానే అర్హులకు ఫించన్లు ఇవ్వడమే కాకుండా, ఫించన్లు రూ.2వేలు చేసి, అందరికి సకాలంలో అందేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment