వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే | Tallarevu Popular for making heavy yokes and large bridles | Sakshi
Sakshi News home page

వీళ్లకు వీర‘తాళ్లు’ వేయాల్సిందే

Published Mon, Jun 12 2023 3:21 AM | Last Updated on Mon, Jun 12 2023 3:21 AM

Tallarevu Popular for making heavy yokes and large bridles - Sakshi

భారీ ఓడలు సముద్రంలో లంగరు వేయాలన్నా.. ఆలయ వీధుల్లో రథాలు పరుగులు తీయాలన్నా.. ఆ ఊళ్లో తయారయ్యే భారీ తాళ్లు, పగ్గాలను వాడాల్సిందే. తాళ్ల తయారీలో యంత్రాలు రంగప్రవేశం చేసినా.. ఆ ఊరి కార్మికుల పనితనం ముందు దిగదుడుపే. నౌకల్లో ఉపయోగించే భారీ మోకులు.. తాళ్లు.. పగ్గాల తయారీకి వందల ఏళ్ల నుంచీ తాళ్లరేవు గ్రామం ప్రసిద్ధి చెందింది. 

సాక్షి ప్రతినిధి, కాకినాడ: కాకినాడ–అమలాపురం మధ్య జాతీయ రహదారిపై వెళ్లే ప్రతి ఒక్కరి చూపు తాళ్లరేవు రాగానే టక్కున ఆగిపోతుంది. తాళ్లే కదా.. ఎక్కడైనా తయారవుతాయనుకుంటే పొరబడ్డట్టే. ఇక్కడ తయారయ్యే తాళ్లకు పెద్ద చరిత్రే ఉంది. పెద్ద, పెద్ద కర్మాగారాల్లో తయారయ్యే తాళ్లు ఇక్కడ చేతితో తయారుచేసే తాళ్ల ముందు నిలవలేవంటే ఆశ్చర్యమేస్తుంది.

అత్యధిక నాణ్యత.. 50 శాతం తక్కువ ధరల్లో ఇక్కడ తాళ్లు లభిస్తాయి. పాత తాళ్లు కొత్తగా అలంకరించుకోవాలన్నా.. తక్కువ ధరకే అవి దొరకాలన్నా తాళ్లరేపు పేరును తలవాల్సిందే. సెకండ్‌ హ్యాండ్‌ (పాత తాళ్ల)ను రీ ప్రాసెసింగ్‌ చేసి కొత్తవిగా తయారు చేయడంలో చేయి తిరిగిన నైపుణ్యం అక్కడి వారి సొంతం.  

200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంతో.. 
ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపారం కోసం ఇక్కడకు వచ్చి స్థావరాలు ఏర్పాటు చేసుకోవడంతో ఇప్పుడున్న కోరంగి అభయారణ్య ప్రాంతం అప్పట్లో పట్టణంగా విరాజిల్లింది. అమెరికా, రష్యా, ఇరాన్, ఇరా­క్‌ తదితర దేశాల నుంచి ఓడలు కోరంగి రేవు ద్వా­రానే ఎగుమతి, దిగుమతులు సాగించేవి. కోరంగి నుంచి కేంద్రపాలిత యానాం వరకు విస్తరించి ఉన్న సముద్ర తీరానికి ఓడలు, పెద్దపెద్ద బోట్లు రాకపోకలు సాగించేవి.

2 వేల నుంచి 20 వేల టన్నుల సా­మర్థ్యం గల ఓడలు సైతం ఇక్కడకు వచ్చేవి. సుమా­రు 200 ఏళ్ల క్రితం సంభవించిన జల ప్రళయంలో ఓడలు, ఓడరేవుతో సహా కొట్టుకుపోయాయి. అప్ప­ట్లో వేటకు వెళ్లిన వందలాది మత్స్యకారులు మృత్యు­వాతపడ్డారు. ఇంటి యజమానులు మృత్యువాత పడటంతో జీవనోపాధి కోసం ఇక్కడి మహిళలు కొబ్బరి, తాటి నారతో తాళ్లు తయారుచేసి విక్రయించడం ప్రారంభించారు. అలా మొదలైన తాళ్ల తయా­రీ తాళ్లరేవులో కుటీర పరిశ్రమగా మారింది.

ప్రస్తు­తం మహిళలు, పురుషులు సైతం తాళ్లను తయారు చేస్తూ ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది. తాళ్లరేవు ప్రాంతంలో కొబ్బరి, తాటి, నైలాన్, ప్లాస్టిక్‌ తాళ్లను తయారు చేస్తున్నారు. అర అంగుళం నుంచి అడుగున్నర మందంతో భారీ తాళ్లను సైతం ఇక్కడ తయారు చేస్తున్నారు. ఓడలకు, ఫైబర్‌ బోట్లకు వినియోగించే తాళ్లు కూడా ఇక్కడ తయారవుతున్నాయి. రథాలకు వినియోగించే పగ్గాలను సైతం ఇక్కడే తయారు చేస్తున్నారు. 

ఏటా 900 టన్నుల తాళ్ల ఎగుమతి 
ఏటా 900 టన్నుల వరకు తాళ్లు ఇక్కడ తయారవుతున్నాయి. తెలంగాణ, గుజరాత్, పశ్చిమ బెంగాల్‌ తదితర ప్రాంతాలకు ఇక్కడి తాళ్లను ఎగుమతి చేస్తున్నారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ వ్యాపార లావాదేవీలు ప్రారంభించిన సందర్భంలో కోరంగిలో ఓడలు రాకపోకలకు వీలుగా ఓడ రేవును ఏర్పాటు చేయడ­మే తాళ్ల పరిశ్రమలు ఏర్పాటుకు దోహదం చేసింది.  

మేడిది.. పెమ్మాడి వంశీకులతో మొదలై.. 
తొలుత ఈస్ట్‌ ఇండియా వ్యాపారులతో పెనవేసుకున్న తాళ్ల బంధం కాస్తా వారసత్వ సంపదగా మారింది. తొలినాళ్లలో తాళ్లరేవుకు చెందిన మేడిది, పెమ్మాడి వంశీయులు తాళ్లు తయారుచేసే వారు. తాళ్ల తయారీ వంశపారంపర్యంగా మారి నాలుగు తరాలుగా నేటికీ కొనసాగుతుండటం విశేషం. ఇక్కడ తయారయ్యే తాళ్లను టన్నుల కొద్దీ చెన్నై, కేరళ, ముంబై, కోల్‌కతా, గుజరాత్‌ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు.

ఓడలు, బోట్లలో వినియోగించిన అనంతరం వృథాగా వదిలేసే పగ్గాలను తక్కువ ధరకు తాళ్లరేవు గ్రామస్తులు వేలంలో కొనుగోలు చేస్తుంటారు. రాష్ట్రంలోని పలు పోర్టులతోపాటు ఇతర రాష్ట్రా­ల్లోని పోర్టులలో వేలం వేసే పాత తాళ్లను కొనుగోలు చేస్తుంటారు. వాటిని గ్రేడింగ్‌ చేసి.. శుద్ధిచేసి కొత్త తాళ్లు తయారు చేసి విక్రయిస్తున్నారు.  

బ్రిటిష్‌ కాలం నుంచీ.. 
బ్రిటిష్‌ కాలం నుంచి తాళ్లరేవు, కోరంగిలలో తాళ్లు తయారు చేస్తున్నాం. నాలుగు తరాలుగా తాళ్ల తయారీలో నిపుణులు ఇక్కడ ఉన్నారు. కోరంగిలో ఓడరేవు ఉండడంతో ఓడలు భారీ స్థాయిలో ఇక్కడికి వచ్చేవి. ఈస్ట్‌ ఇండియా కంపెనీ ప్రతినిధులు, బ్రిటిషర్లు కోరంగిని వ్యాపార కేంద్రంగా ఎంచుకోవడంతో భారీ నౌకలు, బోట్లు, నావలను తాళ్లరేవులో తయారు చేసేవారు. అలా ఓడలకు అవసరమైన తాళ్లు, మేకులు తదితర పరిశ్రమలు అప్పట్లో కోరంగి పరిసర ప్రాంతాల్లో ఏర్పాటయ్యాయి. ఇప్పటికీ తాళ్ల తయారీని కొనసాగుతోంది.  – పెమ్మాడి కాశీ విశ్వనాథం,  బోట్ల తయారీ యూనిట్‌ ప్రతినిధి 

ప్రత్యేక ప్రావీణ్యత ఉంది 
మా తాత ముత్తాతల నుంచి తాళ్లు తయారు చేస్తున్నాం. తాళ్ల తయారీయే వృత్తిగా కొనసాగుతోంది. రోజుకు రూ.­300 నుంచి రూ.600 వరకు సంపాదిస్తాం. తాళ్ల తయారీకి సంబంధించి మాకు ప్రత్యేక ప్రావీణ్యత ఉంది. మా దగ్గర తాడు తీసు­కె­ళ్లిన వారు మళ్లీమళ్లీ కొనుగోలు చేస్తుంటారు.  – మందపల్లి జ్యోతిబాబు,  తాళ్ల తయారీ కార్మికుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement