చిన్నారిని ఆదుకోరూ...!
చిన్నారిని ఆదుకోరూ...!
Published Thu, Sep 1 2016 7:38 PM | Last Updated on Mon, Sep 4 2017 11:52 AM
బిడ్డకు గుండెలో రంధ్రంతో తల్లిదండ్రుల ఆవేదన
దాతల సాయం కోసం ఎదురుచూపులు
తాళ్లరేవు: రెక్కాడితే కానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆ చిన్నారికి గుండెకు రంధ్రం ఉందని తెలియడంతో ఆ కుటుంబం బెంబేలెత్తుతోంది. చిన్నారికి వైద్యం చేయించడం తమకు శక్తిమించిన పని కావడంతో దాతల సాయం కోసం వారు ఎదురు చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాళ్లరేవు మండలం ఇంజరం పంచాయతీ గౌతం నగర్‌కు చెందిన కోట ధనరాజు, గంగ దంపతులు చిన్నచిన్న కూలిపనులు చేసుకుంటూ జీవితాన్ని గడుపుతున్నారు. వారికి స్వర్ణరాజు అనే 9 నెలల బాలుడు ఉన్నాడు. ఇటీవల స్వర్ణరాజు అనారోగ్యానికి గురవడంతో స్థానిక సబ్‌సెంటర్‌లో చూపించారు. ఆ బాలుడికి గుండె సంబంధింత వ్యాధి ఉందని, స్కానింగ్ చేయించాలని చెప్పారు. స్థానిక పంచాయతీ గుమాస్తా కుడుపూడి వీర వెంకట సత్యనారాయణ(సత్తిబాబు) అందించిన ఆర్థిక సహకారంతో ఆ బాబుకు స్కానింగ్ చేయించారు. బాలుడి గుండెకు రంధ్రం ఉందని, హైదరాబాద్‌లో శస్త్రచికిత్స చేయింతాలని వైద్యులు చెప్పారు. ఇంటి పోషణే కష్టంగా ఉన్న తాము బిడ్డకు వైద్యం ఎలా చేయించాలో దిక్కుతోచక ఆదంపతులు తల్లడిల్లుతున్నారు. గడప గడపకూ వైఎస్సార్ కార్యక్రమంలో పాల్గొంటున్న ముమ్మిడివరం నియోజకవర్గ కో ఆర్డినేటర్ పితాని బాలకృష్ణకు బాలుని పరిస్థితి గురించి చెప్పడంతో ఆయన ఆస్పత్రి ఖర్చులకు రూ. రెండు వేలు ఇచ్చారు. బాలునికి ఆరోగ్యశ్రీ పథకంలో శస్త్ర చికిత్స చేయించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాల్సిందిగా స్థానిక నాయకులకు ఆయన సూచించారు. బాలుడి శస్త్ర చికిత్సకు లక్షలాది రూపాయలు అవసరం కానున్న నేపథ్యంలో ఆదుకునే దాతలు నెం. 90149 31377ను సంప్రదించాలని ధనరాజు, గంగ దంపతులు కోరారు.
Advertisement