తాళ్లరేవు : జాతీయ రహదారి 216 లోని చొల్లంగి గోడౌన్స్ వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో చినగోవలంక గ్రామానికి చెందిన కోరుకొండ ప్రవీణ (25) అనే యువతి మృతి చెందింది. ఇంజరం పంచాయతీ చినగోవలంక గ్రామానికి చెందిన కోరుకొండ ప్రవీణ కాకినాడలోని సూర్య గ్లోబల్ ఆస్పత్రిలో మూడేళ్లుగా స్టాఫ్ నర్స్‌గా పనిచేస్తోంది. మరో నలుగురు యువతులతో కలిసి అక్కడే అద్దెకు ఉంటోంది. ప్రతి ఆదివారం స్వగ్రామానికి వచ్చి చర్చిలో ప్రార్థనలు నిర్వహిస్తుంది. ప్రతి వారం మాదిరిగానే ఇంటికి వచ్చి తిరిగి సోమవారం ఆటోలో కాకినాడకు బయలు దేరింది.
ఆటో చొల్లంగి ఎన్‌ఎస్‌ఎన్ రెడ్డి గోడౌన్స్ వద్దకు వచ్చేసరికి ఎదురుగా వేగంగా వస్తున్న కాకినాడ-అమలాపురం ఆర్టీసీ నాన్‌స్టాప్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రవీణకు తలపై తీవ్ర గాయాలు కావడంతో మరో ఆటోలో కాకినాడ తరలించే ప్రయత్నం చేయగా మార్గమధ్యంలో మృతిచెందింది. ఆటోలో ప్రయాణిస్తున్న మరో వృద్ధుడు, ఒక మహిళ, చిన్నారికి సైతం గాయాలయ్యాయి. వారిని కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. బస్సు, ఆటో డ్రైవర్లు పరారైనట్టు స్థానికులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని కోరంగి ఎస్సై ఆర్. ఆనంద్‌కుమార్, ఏఏఎస్సై ఆర్‌వీఎన్ మూర్తి సందర్శించి ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నారు.
జీవనాధారాన్ని కోల్పోయిన కుటుంబం
ప్రవీణ మృతితో ఆ కుటుంబం జీవనాధారాన్ని కోల్పోయింది. ప్రవీణ తండ్రి గడ్డియ్య మూడేళ్ల క్రితం మృతి చెందాడు. అప్పటినుంచి కుటుంబ భారాన్ని ప్రవీణ మోస్తోంది. గత మూడేళ్లుగా ఆస్పత్రిలో పనిచేస్తూ తమ్ముడు బాబాసాహెబ్‌ను పాలిటెక్నిక్ చదివిస్తోంది. తల్లి అన్నపూర్ణను పోషిస్తోంది. ఇప్పుడు తమకు దిక్కెవరంటూ ఆ కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. చినగోవలంక గ్రామంలో విషాదం అలుముకుంది.
ఆటోను ఢీకొన్న బస్సు : యువతి మృతి
Published Tue, May 5 2015 2:46 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement