యువతి సజీవ దహనం | Young woman be burned alive | Sakshi
Sakshi News home page

యువతి సజీవ దహనం

Published Sat, Nov 15 2014 2:09 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

యువతి సజీవ దహనం - Sakshi

యువతి సజీవ దహనం

* పెదతాడేపల్లిలో ఘాతుకం
* రంగంలోకి డాగ్ స్క్వాడ్
* అత్యాచారం జరిపి హత్య చేసి ఉంటారని అనుమానం

తాడేపల్లిగూడెం : తాడేపల్లిగూడెం మండలం పెదతాడేపల్లి వద్ద జాతీయ రహదారి వద్ద వ్యవసాయ క్షేత్రంలో గుర్తు తెలియని యువతి సజీవ దహనమైంది. శరీరం పూర్తిగా కాలిపోగా.. కేవలం రెండు చేతులు మోచేయి వరకూ మాత్రమే మిగిలాయి. ఆ ఆనవాళ్లను బట్టి సజీవ దహనమైంది యువతి అని, వయసు 15 నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండొచ్చని భావిస్తున్నారు. మృతదేహం మెడ భాగంలో బెల్టు బిగించి ఉన్నట్టు కనపడుతోంది.

ఆమెపై అత్యాచారం జరిపి అనంతరం పెట్రోల్ పోసి దహనం చేసి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. శుక్రవారం ఈ ఘటన వెలుగుచూడగా, సీఐ జి.దేవకుమార్ ఆధ్వర్యంలో ఎస్సైలు కొండలరావు, కరుటూరి రామారావు ఘటనా స్ధలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని గుర్తించిన బంటా కార్మికులు పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కన శుక్రవారం వేకువజామున వ్యవసాయ క్షేత్రాలలో కూలి పనులకు వెళుతున్న బంటా కార్మికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

మృతదేహం తాలూకా భాగాలను కుక్కలు ఎత్తుకెళుతుండటాన్ని వారు గమనించారు. కొంతదూరంలో పిచ్చిమొక్కల మధ్య నుంచి పొగ వస్తోంది, ఏమిటా అనే ఆసక్తితో అక్కడికి వెళ్లి చూసిన వారు నిర్ఘాంతపోయారు. అక్కడ ఓ మృతదేహం పూర్తిగా కాలిపోయి గుర్తుపట్టకుండా ఉంది. అంతకు ముందు కుక్క తీసుకెళుతున్న శరీర భాగం ఈ మృతదేహానిదే అని తెలిసి వారి గుండెలు గుభిల్లుమన్నాయి. దగ్గరకు వెళ్లి చూస్తే ఆ మృతదేహం యువతిదిగా గుర్తించారు. వెంటనే విషయాన్ని వీఆర్‌ఏ దృష్టికి తీసుకువెళ్లారు. వీఆర్‌ఏ నుంచి వీఆర్‌వో ద్వారా ఈ సమాచారం పోలీసులకు చేరింది. ఈ ఘటన ఈ ప్రాంతంలో సంచలనం రేకెత్తించింది.
 
యువతా.. బాలికా..
దుండగులు కిరాతకంగా హత్య చేసినట్టు తెలుస్తోంది. శరీర మొత్తంలో కేవలం రెండు చేతి భాగాలు అదీ మోచేయి పైకి మాత్రమే ఉన్నాయి. శరీరం దహనం కాగా మిగిలిన భాగాలను బట్టి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలానికి దగ్గరలో ఒక నల్లని చెప్పు ఉంది. మరో పాత చెప్పు ఒకటి ఉంది. ఈ చెప్పు ఆధారంగా హత్యకు గురైన వ్యక్తి యువతి లేదా బాలిక కావచ్చని పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

మృతదేహం మెడకు బెల్టు లాంటిది బిగించి ఉంది. దీనిని బట్టి బెల్టుతో మెడకు బిగించి హత్య చేసి ఉంటారని అనుమానిస్తున్నారు. మృతదేహం ముఖానికి గుడ్డ ఒకటి అడ్డుగా కట్టే ఉంది. మృతదేహం కాలిఉన్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న ప్రాంతంలో ఉన్న మొక్కలు నలిగినట్టు కనిపిస్తున్నాయి. మెడకు బెల్టు వేసి వీటి మధ్య నుంచి సజీవంగా కాని, లేదా హత్య చేసి కాని ఇక్కడకు తీసుకువచ్చి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

ఇదే రహదారి తణుకు వైపు వెళ్లే మార్గంలో రోడ్డుకు ఎడమ పక్క మద్యం బాటిళ్లు, వాటర్‌ప్యాకె ట్లు, వాటికి దగ్గరగా ఖాళీ ప్లాస్లిక్ సీసాలను పోలీసులు గుర్తించారు. దీనిని బట్టి హత్యకు ముందు అనుమానితులు మద్యం తాగి ఉంటారని అంటున్నారు. దహనమైన మృతదేహం పక్కన తొమ్మిది నంబర్ కలిగిన చెప్పు లభించింది. దీనిని బట్టి హత్యకు పాల్పడిన వారు ఇక్కడ ఎవ్వరి సహాయం అయినా తీసుకున్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హత్యకు ముందు యువతిలేదా బాలికైపై అత్యాచారం జరిగి ఉంటుందా అనే కోణంలో కూడా పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. ఈఘాతుకానికి ఒడిగట్టింది స్థానికులా, వేరే  ప్రాంతానికి చెందిన వ్యక్తులా అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.
 
కీలకం కానున్న ఆధార్ వేలిముద్రలు
పెదతాడేపల్లి జాతీయ రహదారి బైపాస్ పక్కనున్న జరిగిన ఘోర హత్యోదంతంలో ఆధార్ ఆధారం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఇక్కడ ఘటనలో పూర్తిగా యువతి కాలిపోగా చేతులు మాత్రం మిగిలి ఉండటంతో వాటి వేలిముద్రల ఆధారంగా మృతురాలిని గుర్తించాలని పోలీసులు భావిస్తున్నట్టు తెలిసింది. ఘటనా స్తలంలో మృతదేహానికి పంచనామా అనంతరం, పోస్టుమార్టం శనివారం ఉదయం చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
 
కలియదిరిగిన స్నిపర్ డాగ్
ఏలూరు నుంచి ట్రైనర్ అంజనీకుమార్ పర్యవేక్షణలో స్నిపర్ డాగ్ డాన్‌తో ఘటనా స్థలంలో ఆధారాల కోసం కలియదిరిగింది. ఘటనా స్థలంలో లభించిన చెప్పు, కాలిన దేహం వాసన చూసిన డాగ్ అక్కడ నుంచి నేరుగా ఏలూరు వైపున ఉన్న పొలాలలోకి వెళ్లింది. అక్కడి  పొలాలలో పడి ఉన్న ఎముక ముక్కను గుర్తించింది. తర్వాత వెనక్కి వచ్చింది.

బైపాస్ రహదారి పక్కనుంచి గ్రామంలోకి విద్యుత్ సబ్‌స్టేషన్ వైపున ఉన్న రహదారి వైపు వెళ్లింది. మార్గ మధ్యమంలో స్మశానం దగ్గరలో ఉన్న మలుపు వద్ద పగిలి పడి ఉన్న మోటారు సైకిల్ హెడ్ లైట్ ముక్కల వద్ద కొంత సేపు ఆగింది. అక్కడి నుంచి పెదతాడేపల్లి గ్రామంలోకి వెళ్లే రోడ్డుపైకి ఎక్కింది. అక్కడ రోడ్డుపక్కగా ఉన్న ఓ టెక్నికల్ విద్యాసంస్థలోకి వెళ్లి అక్కడ ఒక గది వద్ద తచ్చాడింది. అక్కడ్నించి పక్కనే ఉన్న ఓ ప్రార్ధనా మందిరంలోకి ఒకసారి వెళ్లి బయటకు వచ్చి, తిరిగి దీని ఎదురుగా ఉన్న స్థలంలో తచ్చాడి.

మళ్లీ అదే ప్రార్ధనా స్థలంలోకి వెళ్లింది. తిరిగి దీని పక్కగా వ్యవసాయ క్షేత్రాలవైపున ఉన్న చెరువు వద్దకు పరుగు తీసింది. ఈ చెరువు చుట్టూ తిరిగి అక్కడి నుంచి జాతీయ రహదారి బైపాస్ రోడ్డు ఎక్కే ప్రాంతంలో ఆగింది. అక్కడ కాటన్ చున్నీ, లంగా బొందు ఉంది. అక్కడ డాగ్ ఆగింది. ఆ చున్నీని, లంగా బొందును తీసుకొచ్చి డాగ్‌కు వాసన చూపించాక, ఘటనా స్థలం సమీపంలో కుక్క తచ్చాడింది. దీంతో ఈ ప్రాంతం గురించి క్షుణ్ణంగా తెలిసున్నవారే అఘాయిత్యానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు.

చెరువు గట్టు మీద కాని అత్యాచారానికి పాల్పడి, ఆనక అఘాయిత్యం చేసి, చేలలో నుంచి యువతిని లాక్కొచ్చి, పెట్రోలు కాని యాసిడ్ లాంటి పదార్దం పోసి కాని తగులబెట్టి ఉంటారని అనుమానిస్తున్నారు. దీనికి సంబంధించి అన్ని కోణాలలో దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ జి.దేవ్‌కుమార్ చె ప్పారు. వీఆర్‌ఓ తల్లాప్రగడ శ్రీనివాసు ఫిర్యాదు మేరకు సంఘటనా స్తలాన్ని చూశామన్నారు. గుర్తుతెలియని యువతిగా భావించి, కేసు నమోదు చేసి ద ర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనలో ఇద్దరికంటే ఎక్కువ మంది పాల్గొని ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణ ఎస్‌ఐ కొండలరావు, రూరల్ ఎస్‌ఐ రామారావులు దర్యాప్తులో ఉన్నారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement