సఖినేటిపల్లి–నర్సాపురం వంతెన నిర్మాణానికి శిలాఫలకం ఆవిష్కరిస్తున్న నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి
స్వచ్ఛమైన చిరునవ్వు..
అదే నవ్వుతో భుజంపై చేయి వేసి పలకరింపు.. ఒకసారి పరిచయమైతే చాలు.. ఎన్నేళ్ల తరవాత కనపడినా పేరు పెట్టి పిలుస్తూ అక్కున చేర్చుకునే అది్వతీయమైన జ్ఞాపకశక్తి ఆయన సొంతం. తన ప్రజలకు ఏదో చేయాలన్న తపన.. ఎవరొచ్చి ఏదడిగినా కార్యాచరణపై మదిలో ప్రణాళికలు వేసుకోవడం. ఇవన్నీ ఆయనను మహానేతను చేశాయి. పాదయాత్రలు.. బస్సుయాత్రలతో జిల్లాకు వచ్చిన ప్రతిసారీ వేలవేల విన్నపాలు చిరునవ్వుతో స్వీకరించిన డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టాక వాటన్నింటికీ పరిష్కారాలు చూపించారు. వ్యక్తిగతమైనవే కాకుండా సామాజిక పరమైన తాగు, సాగునీటి ప్రాజెక్టులు.. మౌలిక వసతుల కల్పన.. వ్యవసాయ, పారిశ్రామిక, వాటి అనుబంధ రంగాల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలు విడుదల చేశారు.
ఎంత జ్ఞాపకంగా వ్యక్తులను, వ్యక్తిగత సమస్యలను, అభివృద్ధి సంబంధ వినతులను గుర్తు పెట్టుకుని అభివృద్ధిని పరుగులు పెట్టించారో.. ఆయన హయాంలో చేపట్టిన ఎన్నో ప్రాజెక్టులు.. వ్యక్తిగతంగా పొందిన లబ్ధి ఇక్కడి ఆయన స్మృతులుగా కలకాలం నిలిచిపోతాయనడంలో సందేహం లేదు. అన్నదాత బాగుకోసం అహరహం తపించిన మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని బుధవారం రైతు దినోత్సవంగా నిర్వహించేందుకు ప్రభుత్వంనిర్ణయించింది. జిల్లాకు ఆయనతో ఉన్న అనుబంధం ఇలా..
ఎన్నెన్నో అభివృద్ధి పనులు
రామచంద్రపురం: పట్టణ ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ముచ్చుమిల్లి, తాళ్లపొలం వద్ద రాజీవ్ గృహకల్పలను నిర్మించి సుమారుగా 860 కుటుంబాలకు నీడనిచ్చారు. రూ.10 కోట్లతో బైపాస్ రోడ్డు నిర్మించారు. వైఎస్‌ఆర్ హయాంలో నియోజకవర్గంలో సుమారు రూ. 700 కోట్ల విలువైన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు జరిగాయి.
సీమాంక్ సెంటర్ నిర్మాణం.. ఏటిగట్ల అభివృద్ధి ఆయన చలవే
కొత్తపేట: కొత్తపేటలో వైద్య విధాన పరిషత్ 50 పడకల కొత్తపేట కమ్యూనిటీ ఆస్పత్రిలో ప్రసవం పోసుకున్న తల్లీ, పుట్టిన బిడ్డ సంరక్షణ కోసం ప్రత్యేకంగా 20 పడకల సీమాంక్ సెంటర్‌ను రూ 29.30 లక్షల వ్యయంతో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి నిర్మించారు. గోదావరి వరదల వల్ల గండ్లు పడకుండా వశిష్ట గోదావరి ఎడమ, గౌతమి గోదావరి కుడి ఏటిగట్లను సుమారు రూ.100 కోట్లతో ఆధునికీకరించారు. ఆత్రేయపురం మండలంలో రూ.11 కోట్లతో వసంతవాడ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకం, రూ.11 కోట్లతో బొబ్బర్లంక మెగా రక్షిత మంచినీటి పథకం, లంక భూములు కోతకు గురికాకుండా రూ 17 కోట్లతో గ్రోయన్స్ నిర్మించారు.
తాండవ ఆధునికీకరణకు రూ.57 కోట్ల కేటాయింపు
తుని: అధికారంలోకి వచ్చిన తర్వాత తాండవ ప్రాజెక్టు ఆధునికీకరణకు రూ.57 కోట్లు కేటాయించారు. మధ్య తరగతి కోసం రాజీవ్ గృహ కల్ప, పేదల కోసం 30.50 ఎకరాల్లో 1154 మందికి పట్టాలు ఇచ్చారు. మోడల్ మార్కెట్, రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జితో పాటు అనేక కార్యక్రమాలను ప్రజలకు అందించారు. తాండవ సుగర్ ఫ్యాక్టరీ రైతులకు చెరకు మద్దతు ధర కలి్పంచడంతో పాటు ప్రభుత్వం నుంచి రాయితీలు కలి్పంచారు.
పశుజీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి..
సామర్లకోట: పశు జీవశాస్త్ర పరిశోధన సంస్థ అభివృద్ధికి 2005లో భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి రూ.10 కోట్లు విడుదల చేశారు. ఆ నిధులతో అధునాతన సాంకేతిక పద్ధతిలో కోళ్లకు వివిధ రకాల వ్యాధులకు సంబంధించి, వ్యాక్సిన్‌ను తయారుచేసి రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలకు అందజేస్తున్నారు. తాగునీటి సమస్య పరిష్కారానికి సామర్లకోటకు రూ.8.50 కోట్లు, పెద్దాపురం మున్సిపాలిటీకి రూ.7.50 కోట్లు విడుదల చేయగా వాటితో వాటర్ ట్యాంకులు, పైపు లైన్ల నిర్మాణం చేశారు. పెద్దాపురం మండలం రామేశ్వరం మెట్టపై దళితులకు కేటాయించిన భూములు సాగు చేసుకోవడానికి 72 బోర్లు ఆయన పాలనలో ఏర్పాటు చేశారు.
గురుకుల పాఠశాల, హాస్టల్ భవన నిర్మాణాలు
మామిడికుదురు: పి.గన్నవరం మండలం నరేంద్రపురంలో రూ.13 కోట్లతో గురుకుల పాఠశాల, హాస్టల్ భవనం నిర్మించారు. ముంగండలో రూ.ఏడు కోట్ల తో తాగునీటి ప్రాజెక్టు ఏర్పాటు చేశారు. నియోజకవర్గ పరిధిలో రూ.30 కోట్ల వ్యయంతో ఏటిగట్లను ఆధునికీకరించారు. ఎస్‌ఎస్‌ఏ నిధులు రూ.23 కోట్లతో నియోజకవర్గంలో పాఠశాలల భవనాలు నిర్మించారు. మామిడికుదురు, అయినవిల్లి మండలాల్లో రూ.5.50 కోట్లతో టీటీడీ కల్యాణ మంటపాలు ఏర్పాటు చేశారు. నియోజకవర్గంలో సుమారుగా 25 వేల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశారు.
తాగు, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి
ముమ్మిడివరం: నియోజకవర్గంలో సుమారు రూ.600 కోట్లకు పైగా నిధులు వెచ్చించి అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టారు. తాళ్లరేవు మండలంలో ఉప్పంగల పంచాయతీ పరిధిలో సుమారు రూ.6కోట్లు, ఐ.పోలవరం మండలం మురమళ్ల, ముమ్మిడివరంలో సుమారు రూ.24కోట్లతో తాగునీటి ప్రాజెక్టులు నిర్మించి నియోజకవర్గ ప్రజలకు తాగునీటి కొరత లేకుండా చేశారు. నియోజకవర్గ పరిధిలో సుమారు రూ.100 కోట్లతో ఏటిగట్లను ఆధునికీకరించి వరదల బారినుంచి ప్రజలను కాపాడారు.
దిండి రిసార్ట్స్‌కు శంకుస్థాపన
రాజోలు: ముఖ్యమంత్రి హోదాలో 2005 ఫిబ్రవరి 25న దిండి రిసార్ట్స్‌కు శంకుస్థాపన చేశారు. మరోసారి 2008 ఏప్రిల్ 15వ తేదీన సఖినేటిపల్లి–నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అనంతరం మలికిపురం కళాశాల ఆవరణలో జరిగిన బహిరంగ సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.
స్నేహశీలి
కాట్రేనికోన: ‘‘మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి మంచి స్నేహశీలి. ఆయన కంట పడితే చాలు చక్రంజీ అంటూ ఆప్యాయంగా పిలిచే వారు’’ అని తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలం కందికుప్ప గ్రామానికి చెందిన యేడిద చక్రపాణీరావు అన్నారు. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఈ ప్రాంతానికి వచ్చిన ప్రతిసారి తాను కలవగానే ‘‘చక్రంజీ బాగున్నావా?’’ అంటూ ఆప్యాయంగా పిలిచే వారన్నారు. ఆయనతో తనకున్న అనుబంధం మరపురానిదని ఆయన అంటున్నారు. ‘‘సీఎల్పీ నాయకుడి హోదాలో, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నపుడు ఒకసారి, ముఖ్యమంత్రి హోదాలో 2009 జనవరి 3న మరోసారి కాట్రేనికోనలో అభివృద్ధి పనుల శంకుస్థాపనకు వచ్చారు.
ఆ సమయంలో కందికుప్పలోని మా ఇంటికి వచ్చారు. ఆయన స్నేహానికి విలువనిచ్చే మనిíÙ. నిబద్ధత కలిగిన నాయకుడు. తీరప్రాంత మత్స్యకార గ్రామాల్లో రహదారులు, నదీపాయలపై వంతెనల వంటి అనేక సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే వాడిని. వెంటనే ఆయన అధికారులకు ఆదేశాలిచ్చి, చక్రంజీ చెప్పిన సమస్యలపై నివేదిక ఇమ్మని చెప్పేవారు. వారం పది రోజుల్లో ఆయా సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసేవారు. ఆయన జ్ఞాపకాలు జీవితాంతం మరువలేనివి’’ అని చక్రపాణీరావు గుర్తు చేసుకున్నారు.
అమలాపురం అభివృద్ధిపై చెరగని ముద్ర
అమలాపురం: దివంగత మహానేత డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి నియోజకవర్గ అభివృద్ధిలో చెరగని ముద్ర వేశారు. ఆరేళ్ల పాలనాకాలంలో ప్రజల్లో చిరస్థాయిగా ఉండే పనులు చేపట్టారు. ఆయన హయాంలో అమలాపురం నియోజకవర్గం తొలుత అమలాపురం పట్టణం, రూరల్ మండలంలో కొంతభాగం, అయినవిల్లి మండలం, అంబాజీపేట మండలంలో కొన్ని గ్రామాలు ఉండేవి. తరువాత నియోజకవర్గ పునరి్వభజనలో అమలాపురం పట్టణం, మండలం పూర్తిగాను, ఉప్పలగుప్తం, అల్లవరం మండలాలు ఈ నియోజకవర్గంలో చేరాయి. పూర్వపు నియోజకవర్గంలోను, మారిన నియోజకవర్గంలోను వైఎస్సార్ ముఖ్యమంత్రిగా పలు అభివృద్ధి పనులు చేశారు.
- వైనతేయనదీ పాయ మీద అల్లవరం మండలం బోడసకుర్రు–మామిడికుదురు మండలం పాశర్లపూడిలంక మధ్య తొలుత రూ.55 కోట్లతో అంచనాతో వంతెన మొదలు పెట్టగా, పూర్తయ్యే నాటికి రూ.65 కోట్లు అయ్యింది. ఎన్‌హెచ్ 216లో (అప్పట్లో ఎన్‌హెచ్–16)లో భాగంగా దీని నిర్మాణం జరిగింది. దీని నిర్మాణం వల్ల విశాఖ, కాకినాడ, అమలాపురం పరిసర ప్రాంతాల వాసులకు రాజోలు దీవితోపాటు పశి్చమ గోదావరి జిల్లా నరసాపురం, భీమవరం, కృష్ణా జిల్లా కైకలూరు, గుడివాడ, మచిలీపట్నం చేరేందుకు దగ్గర మార్గం ఏర్పడింది. ఈ ప్రాంతంలో ఆక్వా, కొబ్బరి, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాలకు ఎగుమతి చేయడం సులభతరమైంది.
- రాజీవ్‌నగర బాటలను దివంగత వైఎస్సార్ అమలాపురంలో ఆరంభించారు. దీనిలో భాగంగా ఆయన ఏప్రిల్ ఒకటి, 2005న అల్లవరం, అమలాపురం మున్సిపాలిటీల్లో పర్యటించారు. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు రూ.కోటితో పట్టణ పరిధిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకును ప్రారంభించారు. పట్టణంలో పలు డ్రైన్లు, రోడ్ల నిర్మాణానికి కోట్ల నిధులు కేటాయించారు. రూ.3 కోట్లతో పట్టణ పేదలు 240 మందికి గూడు కల్పించేందుకు పట్టణ శివారు నల్లమిల్లిలో రాజీవ్‌గృహ కల్ప పనులకు శంకుస్థాపన చేశారు.
- పాత అమలాపురం నియోజకవర్గంలో భాగంగా ఉన్న అయినవిల్లి, అంబాజీపేట, ఇప్పటి అల్లవరం మండలాల్లో వైనతేయ ఎడమ, గౌతమి కుడి, వృద్ధగౌతమి కుడి, ఎడమ ఏటిగట్లను సుమారు రూ.30 కోట్లతో పటిష్ఠం చేశారు. గోదావరి నదీ గర్భంలో కలిసిపోయే ప్రమాదమున్న కొండకుదురులంక, పొట్టిలంకల్లో నదీకోత నివారణకు రూ.3.5 కోట్లతో గ్రోయిన్ల నిర్మాణం జరిగింది.
సొంతింటి కలను సాకారం చేసిన వైఎస్
మండపేట: సొంతింటిలో జీవించాలన్న పేదల కలను సాకారం చేసి వారి గుండె గూటిలో గూడు కట్టుకున్నారు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి. ప్రతిష్టాత్మకంగా అమలుచేసిన ఇందిరమ్మ పథకానికి జిల్లా నుంచే శ్రీకారం చుట్టారు. 2006 ఏప్రిల్ 1న కపిలేశ్వరపురం మండలం పడమరఖండ్రిక నుంచే ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇళ్ల స్థలాల కోసం జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.460 కోట్లుతో దాదాపు 4,600 ఎకరాలు సేకరించి 1.84 లక్షల మంది పేదలకు పంపిణీ చేశారు. జిల్లాలో 2,14,205 ఇళ్లు మంజూరు చేసి రూ.743.96 కోట్లు విడుదల చేశారు. అప్పటి వరకు అర్బన్ ఏరియాల్లో అందిస్తున్న రూ.30 వేల హౌసింగ్ రుణాన్ని రూ. 55 వేలకు, రూరల్‌లో రూ. 22,500 సాయాన్ని రూ.45 వేలకు పెంచారు. అలాగే ఎస్సీలకు ఇచ్చే సాయాన్ని అర్బన్ ఏరియాల్లో రూ.75 వేలు, రూరల్‌లో 65 వేలకు పెంచారు. మండపేటలో దాదాపు 4,500 మంది పేదవర్గాల వారికి పంపిణీ చేసేందుకు స్థానిక గొల్లపుంతలో రూ.18.14 కోట్లతో 122.72 ఎకరాలను సేకరించారు. పేదల సొంతింటి కోసం రాష్ట్రంలోనే ఇది రెండో అతి పెద్ద స్థల సేకరణ కావడం గమనార్హం.
హామీల అమలులో ఆయన తరువాతే ఎవరైనా..
మలికిపురం: ప్రజలు ఎదుర్కొంటున్న ఏ సమస్య అయినా మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చెవిన పడిందంటే చాలు.. అది ఆయన మనస్సులో గుర్తుండి పోతుంది. ఎంపీగా, సీఎల్పీ నేతగా ఉన్నప్పటి నుంచీ వైఎస్సార్‌తో తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లికి చెందిన అల్లూరు కృష్ణంరాజుకు విడదీయరాని అనుబంధం ఉండేది. వైఎస్సార్ ప్రోత్సాహంతోనే కృష్ణంరాజు క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చానని చెబుతారు. మాట తప్పని నాయకుడిగా ప్రజలతో కృష్ణంరాజు గుండెల్లో వైఎస్సార్ చిరస్థాయిగా నిలిచిపోయారు. సీఎల్పీ నేతగా 2004లో బస్సుయాత్ర చేస్తూ వైఎస్సార్ రాజోలు నియోజకవర్గంలో పర్యటించారు. ముఖ్యమంత్రి హోదాలో 2005లో రాజశేఖరరెడ్డి దిండి రిసార్ట్స్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. హెలికాప్టర్‌లో దిండి నుంచి అంతర్వేదికి రాజశేఖరరెడ్డితో పాటు కృష్ణంరాజు కూడా వెళ్లారు.
అంతర్వేది శ్రీలక్ష్మీనరసింహస్వామి దర్శనం అనంతరం ఆలయం ప్రధాన గోపురాలు అభివృద్ధి చేయాలని వైఎస్సార్‌ను కృష్ణంరాజు కోరగా వెంటనే రూ.కోటి విడుదల చేశారు. అదే సమయంలో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మించాలని కూడా వైఎస్సార్‌ను కోరారు. హెలికాప్టర్ నుంచి వంతెన నిర్మాణ ప్రాంతాన్ని చూపించారు. దీనిపై వైఎస్సార్ అధ్యయనం చేసి, సుమారు 100 ఏళ్ల నుంచి ఉభయ గోదావరి జిల్లాల ప్రజలకు అందని ద్రాక్షగా మిగిలిన వంతెన నిర్మాణంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. 2007లో సఖినేటిపల్లి – నర్సాపురం వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అప్పట్లో నిధుల కొరత ఉండడంతో కేంద్రంతో వారధి నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా సమకూర్చారు. బీఓటీ పద్ధతిలో వంతెన నిర్మాణ పనులను మైటాస్ కంపెనీకి అప్పగించారు. పనులు కూడా ప్రారంభమయ్యాయి. వైఎస్సార్ ఆకస్మిక మృతి అనంతరం అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం వంతెన నిర్మాణం ఊసే ఎత్తలేదు.
ఎంతో అభివృద్ధి.. ఆయన హయాంలోనే..
రాజమహేంద్రవరం రూరల్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి రాజమహేంద్రవరం నగరం, రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గాల అభివృద్ధిలో తనకంటూ ఓ ముద్రను వేసుకున్నారు. దివంగత మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహనరావు, మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ నగర కోఆర్డినేటర్ రౌతు సూర్యప్రకాశరావు నేతృత్వంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అందరికీ ఆప్తుడయ్యారు.
- నగరంలోని తూర్పురైల్వే బుకింగ్ కార్యాలయం, ఐఎల్‌టీడీ జంక్షన్ వద్ద రూ.18 కోట్లతో రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ప్రజలకు ఎంతో ప్రయోజనకరంగా నిలిచాయి.
- విజయవాడ నుంచి విశాఖపట్టణం వైపు రాకపోకలు సాగించేందుకు దివాన్ చెరువు నుంచి కొవ్వూరు వరకు గోదావరి నదిపై నాలుగు లైన్ల వంతెనకు శ్రీకారం చుట్టారు. ఈ వంతెన వల్ల ప్రయాణికులకు 35 కిలో మీటర్ల దూరం తగ్గుతుంది.
- దేవదాయశాఖ భూమిని తీసుకుని రామకృష్ణ థియేటర్ వెనుక సమగ్ర మురికివాడల అభివృద్ధి, గృహనిర్మాణ పథకంలో రూ.57.36కోట్లతో వాంబేకాలనీ నిర్మించి 1900 మందికి నీడ కలి్పంచారు. శాటిలైట్ సిటీ రాజీవ్ గృహకల్ప సముదాయం, ఐఓసిఎల్ తదితర ప్రాంతాల్లో సైతం ఇళ్లు నిర్మించారు.
- రూరల్ నియోజకవర్గంలో (అప్పటి కడియం) బొమ్మూరు వెంకటగిరికొండపై సుమారు రూ.20 కోట్లతో సమగ్ర రక్షిత మంచినీటి సరఫరా పథకాన్ని నిర్మించారు.
- నిరుద్యోగ యువతకు ఉపాధి కలి్పంచాలన్న ఉద్దేశంతో రూ.20కోట్లతో నేషనల్ అకాడమి ఆఫ్ కనస్ట్రక్షన్స్ అడ్వాన్స్‌డ్ స్కిల్స్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ భవనాన్ని నిర్మించి 2009లో ప్రారంభించారు. రాష్ట్రంలోని అతిపెద్ద ఎన్‌ఏసి భవనం ఇదే.
- ఇక కడియం మండలంలో నిర్మించిన మూడు వంతెనలు మండలంలోని ప్రజల ఇబ్బందులను ఎంతగానో తీర్చాయి. కాకినాడ కెనాల్‌పై కడియం, జేగురుపాడు గ్రామాల వద్ద, కోటిపల్లి కెనాల్‌పై బుర్రిలంక వద్ద నిర్మించిన వంతెనలు ప్రస్తుతం ఎంతగానో ఉపయోగపడుతున్నాయి.
అన్నంపల్లి అక్విడెక్ట్ నిర్మించారు
ఐ.పోలవరం: ‘‘రైతుల సమస్యలపై తక్షణమే స్పందించే గుణం మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డిది. రైతులందరూ హైదరాబాద్ వెళ్లగా ముఖ్యమంత్రి హోదాలో వైఎస్సార్ మా సమస్యలను ఓపిగ్గా విన్నారు. ఒక చిరునవ్వు నవ్వి ‘మీ సమస్య పరిష్కరిస్తా’నని చెప్పి నాలుగు రోజుల్లోనే నిధులు మంజూరు చేశారు. అన్నదాతల పట్ల ఆయన చూపిన ప్రేమానురాగాలే ఆయనను అన్నదాతగా నిలిపాయ’’ని తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం కేశనకుర్రు గ్రామానికి చెందిన రైతు నాయకుడు పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు. బ్రిటిష్ వారి హయాంలో ఐల్యాండ్‌లో 18 వేల ఎకరాలకు సాగునీరు, 65 వేల మందికి తాగునీరు అందించేలా అన్నంపల్లి అక్విడెక్టును నిర్మించారు. అది శిథిలావస్థకు చేరడంతో ఐల్యాండ్ ప్రజల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది.
రెండు దశాబ్దాలకు పైగా ఈ ప్రాంత ప్రజలు అప్పటి ప్రభుత్వాలకు పలుమార్లు మొర పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. ‘‘డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈ ప్రాంత రైతులం 2006 జనవరిలో అప్పటి స్థానిక ఎమ్మెల్యే పినిపే విశ్వరూప్‌తో కలిసి హైదరాబాద్ వెళ్లాం. ఆయనకు అన్నంపల్లి అక్విడెక్టు ఆవశ్యకతను వివరించాం. వైఎస్సార్ వెంటనే స్పందించి, నిధులు సమకూర్చడమే కాకుండా త్వరలోనే భూమిపూజ కూడా చేస్తామని హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన మూడు నెలల్లో రూ.19 కోట్లతో నూతన అక్విడెక్టు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఐల్యాండు ప్రజలను ఆదుకొన్న అన్నదాత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి’’ అని పిన్నంరాజు బాబ్జీరాజు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment