‘సాక్షి’ ఫోన్ ఇన్ కార్యక్రమంలో సమస్యలు నివృత్తి చేస్తున్న ప్రముఖ మానసిక వైద్యుడు కర్రి రామారెడ్డి
సాక్షి, కంబాలచెరువు (రాజమహేంద్రవరం): పొద్దున్న లేచింది మొదలు అర్ధరాత్రి వరకూ స్కూళ్లు, కాలేజీలు, ఉద్యోగాలు, వ్యాపారాలు, ప్రయాణాలు.. ఇలా అనేక కార్యకలాపాల్లో నిత్యం తలమునకలైన వారందరూ పక్షం రోజులుగా కరోనా బంధనాల్లో చిక్కి ఒక్కసారిగా దిక్కుతోచని స్థితిలోకి జారిపోయారు. అప్పటి వరకూ రోజూ ఎంతో బిజీగా ఉన్న వారందరూ లాక్‌డౌన్ కారణంగా ఒక్కసారిగా ఇళ్లకే పరిమితమైపోయారు. కొంతమంది ఈ అవకాశాన్ని రకరకాల పనులు చేసుకునేందుకు ఉపయోగించుకుంటున్నారు. మరికొంతమంది ‘ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ డెన్’ (ఖాళీగా ఉన్న మెదడు దెయ్యాల కొంపవంటిది) అని అన్నట్టుగా.. ఊహించని ఈ ఆపత్కాలంలో కొంతమంది తమకు ఏదో అయిపోతుందని మానసిక ఆందోళనకు గురవుతున్నారు.
యథాస్థితికి వచ్చిన తర్వాత ఆర్థిక పరిస్థితులను ఊహించుకొని భయపడుతున్నారు. మందుబాబులు చుక్క దొరక్క పిచ్చెక్కిపోతున్నారు. కరోనా మహమ్మారి నుంచి దేశ ప్రజలందరినీ కాపాడుకునే లక్ష్యంతో ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ నేపథ్యంలో పలువిధాలుగా మానసిక సంఘర్షణలకు గురవుతున్న వారికోసం ప్రముఖ మానసిక వైద్య నిపుణుడు కర్రి రామారెడ్డితో ‘సాక్షి’ ఆదివారం ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించింది. కరోనా వైరస్ వ్యాప్తిపై భయాందోళనలకు గురవుతున్న ప్రజలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ఫోన్ చేసి తమ సమస్యలు నివృత్తి చేసుకున్నారు. వాటిలో ముఖ్యమైన కొన్ని..
కృష్ణ, లూధర్‌గిరి, రాజమహేంద్రవరం : ఎవ్వరూ లేరు, ఒంటరిననే ఫీల్ వస్తోంది. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్‌ని. కరోనా లాక్‌డౌన్‌తో దిక్కు తోచడం లేదు. అభద్రతా భావం పెరిగిపోయి భయాందోళనకు లోనవుతున్నాను.
డాక్టర్ రామారెడ్డి : మొదట ‘నేను ఒంటరి’ అనే భావం వీడండి. మీ చుట్టూ ఎంతో ప్రపంచం ఉంది. ఇంట్లో ఎవ్వరూ ఉండరని చెబుతున్నారు కాబట్టి ఏదో పని పెట్టుకుని అందులో బిజీగా ఉండాలి. ఒత్తిడి తగ్గేందుకు యోగా చేయండి. వృత్తి రీత్యా ఫొటోగ్రాఫర్ కాబట్టి ఆ కోవలో ఉండే చిత్రలేఖనం వంటివి ఇంట్లోనే ప్రాక్టీస్ చేయండి. శరీర వ్యాయామానికి కొంత, జ్ఞానం పెంపొందించేందుకు కొంత, ఇంట్లో పనికి కొంత చొప్పున సమయం కేటాయించుకుంటే అసలు ఖాళీ అనేదే కనిపించదు.
శ్రీనివాసరావు, రామచంద్రపురం : కరోనా వ్యాప్తి జరుగుతున్నప్పటి నుంచీ రోజులు చాలా భయంగా గడుస్తున్నాయి. ఏవో ఆలోచనలు. నిద్ర పోవడానికి చాలా సమయం పడుతోంది. వైరస్ నా చేతికి అంటుకుందేమో, నాకు వచ్చేసిందేమోననే భయం ఎక్కువైపోయింది.
డాక్టర్ రామారెడ్డి : చీకట్లో భయపడుతూ వెళ్తే తాడు కూడా పాములానే కనిపిస్తుంది. మీ సమస్య అలాంటిదే. కరోనా గురించి భయపడనక్కర్లేదు. పుస్తకాలు చదవడం, సంగీతం వినడం, ఉదయం, సాయంత్రం సమయాల్లో నడక, చిన్నపాటి వ్యాయామాలు చేయడం, అవి పూర్తయ్యాక స్నానం చేసి, పిల్లలతో సరదాగా గడపడం వంటివి చేయండి.
శ్రీనివాసరెడ్డి, మాచవరం : టెన్షన్ ఎక్కువగా ఉంది. రాత్రుళ్లు కలలు ఎక్కువగా వస్తున్నాయి. బయటికి వెళ్లకపోవడంతో తెలియని ఏదో ఫీల్.
డాక్టర్ రామారెడ్డి : మీరు ప్రాణాయామం చేయాలి. ఇందులో అనులోమ, వినులోమ ప్రక్రియలు ఉంటాయి. ఎడమ ముక్కుతో శ్వాస తీసుకుని, కుడి ముక్కుతో వదలడం, కుడి ముక్కుతో శ్వాస తీసుకుని ఎడమ ముక్కుతో వదలడం చేయాలి. దీంతో మెదడు బ్యాలన్స్‌లో ఉంటుంది. విపరీతమైన ఆలోచనలుంటే మందులు వాడాల్సి ఉంటుంది. అప్పటి వరకూ తాత్కాలిక ఉపశమనానికి దగ్గరలోని డాక్టర్‌ను సంప్రదించవచ్చు.
రామకృష్ణ, అమలాపురం : ఇంట్లో ఉంటే ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాను. దీనికి మందులేమైనా ఉంటాయా?
డాక్టర్ రామారెడ్డి : ఒత్తిడితో శరీరంలో పలు మార్పులు చేసుకుంటాయి. ప్రాణాయామం, ధ్యానం చేయాలి. యూట్యూబ్‌లో దీనికి సంబంధించినవి లభిస్తాయి. ఒత్తిడి తగ్గడానికి మందులుంటాయి. వీటిని డాక్టర్ సలహా మేరకే వాడాలి. (ఫోన్‌లో మందులు సూచించారు)
రాఘవాచారి, రాజమహేంద్రవరం : లాక్‌డౌన్ కారణంగా ఇంట్లోనే కూర్చోవడం చాలా ఇబ్బందికరంగా ఉంది. నాకు పైల్స్ సమస్య ఉంది. ఇలా కూర్చోవడంతో సమస్య ఎక్కువైంది. ఏం చేయాలి?
డాక్టర్ రామారెడ్డి : ఇంట్లో కూర్చుంటే పైల్స్ రావడానికి అవకాశం ఉంది. దగ్గరలోని జనరల్ సర్జన్, ఎంఎస్ దగ్గరకు వెళితే తగు పరీక్షలు చేసి సమస్య పరిష్కరిస్తారు. మందులతో కొన్ని, ఆపరేషన్‌తో కొన్ని పరిష్కారమవుతాయి.
రామారావు, రాజమహేంద్రవరం : మా ఇంటి పక్కనే ఇద్దరు పెద్ద వయస్సు వాళ్లు ఉన్నారు. వారి పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. లాక్‌డౌన్ కారణంగా వారు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. రాత్రుళ్లు నాకు ఫోన్ చేసి ఆందోళనకరంగా మాట్లాడుతున్నారు. వాళ్లను చూస్తే నాకు భయమేస్తోంది.
డాక్టర్ రామారెడ్డి : మీ భయం కరెక్టే. పిల్లలు ఇంట్లో ఉండరు. ఒంటరిగా ఉంటున్నారు. ఈ సమయంలో అనేక ఆలోచనలు వారిని చుట్టుముడతాయి. ఆ సమయంలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన కూడా రావచ్చు. దీనిని మీరు కనిపెట్టాలి. ఈ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా సంగీతం వినడం, చిన్న పిల్లలతో ఆటలు ఆడించడం, బొమ్మలు వేయించడం వంటివి చేయాలి. మనవళ్లతోను, వారి పిల్లలతోను మాట్లాడిస్తూ ఉండాలి.
పార్వతిదేవీ, మందపల్లి : లాక్‌డౌన్ కారణంగా మానసిక సమస్యకు వాడే మందులు ఆపేశాను. ఏం చేయాలి?
డాక్టర్ రామారెడ్డి : లాక్‌డౌన్ కారణంగా ఆస్పత్రుల సేవలు ఆపిన మాట వాస్తవం. అయితే రోగులు ఆస్పత్రికి ఫోన్ చేసి సమస్యలు చెప్తే ఏం చేయాలో సూచిస్తారు. మీరు వాడే మందులు దగ్గరలోని మందుల దుకాణంలో ఉంటే తీసుకుని లాక్‌డౌన్ పూర్తయ్యే వరకూ వాడొచ్చు. దీర్ఘకాలిక సమస్యలకు ఈవిధంగా చేయవచ్చు.
లావణ్య, కాకినాడ : మా వారికి మందు అలవాటు ఉంది. అది దొరక్క నిద్ర పట్టడం లేదు. ఇంట్లో ఉంటున్నారే కానీ ఏదో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారు. ఏం చేయాలి?
డాక్టర్ రామారెడ్డి : మందు తాగడం అనేది ఒక్కసారిగా మానకూడదు. దానివల్ల పలు సమస్యలు తలెత్తుతాయి. లాక్‌డౌన్ కారణంగా మందు తాగడం ఆగిపోయింది. దీంతో వారికి నిద్రపట్టకపోవడం, ఆందోళనగా ఉండడం, విపరీతమైన షేకింగ్, భ్రమలకు లోనవడం వంటివి చోటుచేసుకుంటాయి. ఒక్కోసారి కోమాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. ఈ పరిస్థితి వస్తే వెంటనే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలి. వారు దీనికి చికిత్సనందిస్తారు.
శశికళ, బొమ్మూరు : గతంలో లేదు. ఇప్పుడో సమస్య వచ్చింది. ముఖం మీద దురద ఎక్కువగా వస్తోంది. చేతులతో ఎక్కువగా ముఖం మీద తాకవద్దంటున్నారు. కరోనా నాకు వచ్చేస్తుందోమోనని ఒక్కోసారి భయమేస్తోంది. ఏ జబ్బు గురించి విన్నా ఆ జబ్బు లక్షణాలు నాకే ఉన్నట్టు అనిపిస్తోంది.
డాక్టర్ రామారెడ్డి : మీ సమస్యను హైపోకాండ్రియాసిస్ అంటారు. అప్పటి వరకూ ఏమీ ఉండదు. ఊరు వెళ్తూ మంచినీటి బాటిల్ మర్చిపోయారు. ఇక అదే ఆలోచనతో దాహం వేస్తూ ఉంటుంది. అదే బాటిల్ కూడా తీసుకువెళ్తే సాయంత్రం అయినా దాని పట్టించుకోరు. మీకు వచ్చిన సమస్య ఇలాంటిదే. చేతులు ముఖాన్ని తాకకూడదని చెప్పిన నాటి నుంచి మీకీ సమస్య ప్రారంభమైంది. ఆ భ్రమలోంచి బయటకు రండి.
లక్ష్మణరావు, కోరుకొండ : దిక్కు తోచడం లేదు. ఇన్ని రోజులు పని లేకపోవడంతో రోజు భారంగా గడుస్తోంది. అనేక ఆలోచనలు మెదడులో తిరిగేస్తున్నాయి.
డాక్టర్ రామారెడ్డి : ఏకంగా 21 రోజులు ఇంట్లోనే ఉండడం అనేది చాలా ఇబ్బందికర విషయమే. పని చేసేవారు ఖాళీగా కూర్చోవడం వలన ఏమీ తోచక మెదడు అనేక ఆలోచనలకు తావిస్తుంది. వాటి ద్వారా ఆందోళనలకు లోనవుతూంటాం. దీనిని అధిగమించడానికి యోగా, ప్రాణాయామం చేయాలి. ‘నేను చేసే పని ఎక్కడికీ పోలేదు. నాకు ఏ భయం లేదు. నేనొక్కడినే కాదు కదా ఇంట్లో ఉండేది. ప్రపంచ మొత్తం ఇలాగే ఉంది కదా’ అనే పాజిటివ్ ఆలోచనలు ఏర్పరచుకోవాలి.
భయం వద్దు.. ధైర్యంగా ఉండండి
రాజానగరం: కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా చేపట్టిన 14 రోజుల ఇంక్యుబేషన్ కాలం పూర్తి కావస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా క్వారంటైన్లలో ఉన్న మొదటి బ్యాచ్ వారికి టెస్టులు జరుగుతాయని స్థానిక జీఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు అన్నారు. దీనివలన పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంటుందని, ఈ అంకెలను చూసి ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదని చెప్పారు. అంతకు ఎన్నో రెట్లు నెగెటివ్ ఫలితాలు కూడా వచ్చే అవకాశాలున్నాయన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి చేసిన టెస్టింగ్ ఫలితాలు ఆందోళనకరంగా లేవని, ఢిల్లీ నుంచి వచ్చిన వారి ట్రేసింగ్ పూర్తి కావచ్చిందని, పరిస్థితి అదుపు తప్పలేదని వివరించారు. ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, చేతులు తరచూ శుభ్రపర్చుకుంటూ ఓర్పు, సహనంతో వ్యవహరించాలని సూచించారు.
కరోనాపై అపోహలొద్దు : మాజీ ఎంపీ పండుల
కాకినాడ రూరల్: కరోనా బారిన పడితే మనిషి మరణిస్తాడని తప్పుడు ప్రచారం జరుగుతోందని ఇటువంటి అపోహలు వద్దని... కరోనా బారిన పడినా కోలుకోవచ్చని అమలాపురం మాజీ ఎంపీ, వైఎస్సార్ సీపీ నాయకుడు, డాక్టరు పండుల రవీంద్రబాబు తెలిపారు. ఆదివారం ఆయన మీడియా ప్రకటనలో ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లాక్‌డౌన్ పక్కాగా అమలు చేస్తున్నారన్నారు. వైరస్ బారిన పడకుండా ఉండేందుకు భౌతిక దూరం పాటిస్తే సరిపోతుందన్నారు. ఆపదవేళ పేదలకు ఆదుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు.
Comments
Please login to add a commentAdd a comment