సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో... త్రినేత్రం | CCTVs Are Arranged In Sub Registration Offices At East Godavari | Sakshi
Sakshi News home page

సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో... త్రినేత్రం

Published Thu, Nov 14 2019 9:22 AM | Last Updated on Thu, Nov 14 2019 9:22 AM

CCTVs Are Arranged In Sub Registration Offices At East Godavari - Sakshi

వైఎస్సార్‌ సీపీ అధినేత జగన్‌మోహన్‌ రెడ్డి సీఎంగా బాధ్యతలుస్వీకరించిన వెంటనే ‘అవినీతి రహిత పాలన’తో ముందుకు సాగాలంటూ పిలుపునిచ్చారు. పిలుపునివ్వడమే కాదు ఆ దిశగా అడుగులు వేస్తూ తన చుట్టూ ఉన్నవారిచే అడుగులు వేయించడానికి ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా చాలా ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతికి దూరంగా పలువురు ఉద్యోగులు ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖ జిల్లా మధురవాడ సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంలో సిబ్బంది కూడా ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయం అంటేనే నెల,నెలా వసూళ్లకు కేరాఫ్‌గా మారిపోయింది. కానీ ఆ కార్యాలయంలో ఆ తరహా వసూళ్లను కొంతమేర తగ్గించినట్టున్నారు. కానీ అవినీతిని అడ్డుకోవలి్సన అవినీతి నిరోధక అధికారులే ‘అలా అయితే ఎలా’ అంటూ దందాకు దిగారు. మీరు అవినీతి చేస్తేనే కదా మా ‘పై జేబులు’ నిండేదంటూ హడావుడి చేశారు. అయినాసరే ‘ససేవిురా’ అనేసరికి ఓ రోజు నేరుగా కార్యాలయంలోకి చొచ్చుకొచ్చి సిబ్బంది ఫైల్‌లో డబ్బులు పెట్టేసి ... వారే అవినీతికి పాల్పడినట్టు తప్పుడు కేసులు పెట్టడానికి యత్నించారు. అయితే సీసీ ఫుటేజీలో మొత్తం రికార్డు అవడంతో కంగుతిన్నారు. దీనిపై సీఎం జగన్‌ ఆగ్రహం వ్యక్తం చేసి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో అన్ని కార్యాలయాల్లో సీసీ కెమెరాలు అమర్చాలని ఆదేశాలు జారీ చేశారు.

1986వ సంవత్సరంలో అర్ధరాత్రి స్వతంత్రం సినిమా రిలీజైంది. ఆర్‌. నారాయణమూర్తి తొలి పరిచయంతోపాటు ఆయన తొలి దర్శకత్వం వహించిన సినిమా కూడా అదే. ఆ సినిమాలో ఓ సన్నివేశం ఇక్కడ ప్రస్తావించుకుందాం. తన భార్య కన్నీళ్లకు కరిగి ఓ జేబు దొంగ దొంగతనాలు మానేసి చక్కగా రిక్షా తొక్కుకొని వచ్చిన ఆదాయంతో తన కుటుంబంతో సంతోషంగా ఉంటాడు. ఇంతలో ఓ కానిస్టేబుల్‌ ఆ మాజీ దొంగ ఇంటికి వస్తాడు. ఏమిరా...నాకు రావల్సిన వాటా ఇవ్వడం మానేసినావని గద్దించగా దొంగతనాలు మానేసి రిక్షా తొక్కుతూ బతుకుతున్నాను...నన్ను వదిలేయమంటూ ఆ కానిస్టేబుల్‌ కాళ్లా,వేళ్లా పడి బతిమాలుతాడు. నువ్వు మానేస్తే నా బతుకెలా సాగేది. పెద్ద కూతురు పురిటికొచి్చంది, చిన్న కూతురికి పెళ్లి చేయాలి...వీురంతా మంచోళ్లుగా మారితే ఎలారా అంటూ లాఠీకి పని చెప్పి ‘పద దొంగతనం కేసులో నిన్ను బొక్కలేస్తే గానీ నీ పాత జీవితంలోకి పోయేటట్టు లేవంటూ’ కొట్టుకుంటూ తీసుకుపోతాడు. ఈ దృశ్యం దూరం నుంచి చూసిన మాజీ దొంగగారి పెళ్లాం...‘వీడు దొంగతనాలు ఇంకా మానలేదా’ అని మనస్థాపానికి గురై బిడ్డతో సహా బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఇక ఈ సీన్‌ కట్‌ చేసి...2019లోకి వచ్చి వాస్తవ ఘటనలోకి వద్దాం. 

సాక్షి, కాకినాడ: సీసీ కెమెరా (త్రినేత్రం)...అవినీతిపరులు, అక్రమార్కుల గుండెల్లోనే కాదు...వీరి బలహీనతలను ఆసరా చేసుకొని బ్లాక్‌మెయిల్‌ చేసే వారి గుట్టును కూడా బట్టబయలు చేసే దమ్మున్న కన్ను ... గురిపెట్టే గన్నే ఈ త్రినేత్రం. మనిషి కన్ను చూడగలదు ... చూసింది నోటితో విడమరచి చెప్పగలదు ... కానీ అవతలవారి నోరు పెద్దదైతే .. గట్టిగా దబాయిస్తే గమ్మున ఉండిపోవల్సిందే. కానీ ఈ త్రినేత్రం మాత్రం చాలా గట్టిందండోయ్‌. నోరేసుకొని మీద పడిపోయేవారికి ‘సాక్ష్యాల’తో స‘చిత్రం’గా చూపించి ఇప్పుడేమంటావో చెప్పంటూ కాలర్‌ పట్టుకొని నిలదీసి ముచ్చెమటలెక్కించగలదు. ఇటీవల రాష్ట్రంలోని ఓ సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయంలో రుబాబులకు దిగిన ఏసీబీ అధికారులనే పట్టించి ఖబడ్దార్‌ అని హెచ్చరించి సంచలనం సృష్టించింది. స్వయంగా సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి రంగంలోకి దిగి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకున్నారు.

సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి, అక్రమాలకు తావులేకుండా చెక్‌ పెట్టేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రిజిస్ట్రేషన్‌శాఖ కార్యాలయాల్లో సీసీ కెమెరాల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్నారు. ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయం సబ్‌ రిజిస్ట్రార్‌ను ఏసీబీ అధికారులు కావాలని ఇరికించేందుకు వెళ్లి సంబంధిత రికార్డుల్లో డబ్బులు పెట్టి బ్లాక్‌ మెయిల్‌కు దిగిన వైనం సీసీ కెమెరా ఫుటేజీలో నిక్షిప్తమయింది. ఏసీబీ అధికారులు సబ్‌ రిజిస్ట్రార్‌పై వ్యవహరించిన తీరును సీరియస్‌గా తీసుకున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలోని అన్ని సబ్‌ రిజస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామం నిజాయితీతో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగి ధైర్యంగా విధులు నిర్వహంచేందుకు ఎంతో తోడ్పడుతుందని ఆనందిస్తుండగా, ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో వీటిని ఏర్పాటు చేయడం వల్ల సగానికి సగం అవినీతిని అరికట్టవచ్చునని పలువురు భావిస్తున్నారు. 

గతమంతా అవినీతిమయమే..
గత తెలుగు దేశం ప్రభుత్వ హయాంలో ప్రజాప్రతినిధుల అండదండలతో స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ శాఖలో విచ్చలవిడిగా అవినీతిచోటు చేసుకున్న విషయం జగమెరిగిన సత్యం. ఆ శాఖల్లో అక్రమాలు తారాస్థాయికి చేరుకుంటుండడంతో ప్రతి మూడేళ్లకు ఒకసారి సబ్‌ రిజిస్ట్రార్లను తప్పనిసరిగా బదిలీలు చేస్తుంటారు. కానీ 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి 2019 వరకు ఐదు సంవత్సరాల్లో ఒక్క బదిలీ కూడా జరగలేదంటే ఏ స్థాయిలో అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చు. అప్పటి బాబు ప్రభుత్వం అండతో అధికారులు ఇష్టారాజ్యంగా దోచుకొని అవినీతికి కేరాఫ్‌గా సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలను మార్చేశారు. ఈ దందాను నిరోధించాలి్సనవారే బ్లాక్‌ మెయిల్‌ చేసి నెలనెలా మామూళ్లకు అలవాటుపడిపోయారంటే ఆక్కడ పని చేస్తున్న అధికారుల జేబులు ఏ మేరకు అక్రమ సొమ్ముతో నిండిపోమాయో ఊహించుకోవచ్చు. 

సీఎం జగన్‌ కన్నెర్ర..
ప్రస్తుతం సీఎం అవినీతి రహిత పాలనే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. దీనిలో భాగంగా ఏళ్ల తరబడి బదిలీకాకుండా ఉన్న రిజిస్ట్రేషన్‌ శాఖలో అధికారులను ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే...అంటే జూలై నెలలోనే రిజస్ట్రార్‌ కార్యాలయాల్లో బదిలీలకు శ్రీకారం చుట్టారు. అవినీతి అధికంగా జరిగే ప్రధానమైన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లోని రిజస్ట్రార్లపై బదిలీ వేటు వేసి గ్రూప్‌ –2లో ఎంపికైన వారిని డైరెక్ట్‌గా సబ్‌ రిజిస్ట్రార్లుగా నియమించి ‘చెక్‌’ పెట్టడానికి ప్రయత్నించారు. అప్పటి వరకు ఆ కార్యాలయం నుంచి నెలనెలా మామూళ్లకు అలవాటు పడిన అధికారులకు ‘బ్రేక్‌’ పడింది. అయినా సరే వెనుకటి బుద్ధి ఏల మారుతుందన్నట్టుగా మామూళ్లకు అలవాటుపడిన కొంతమంది అధికారులు బ్లాక్‌ మెయిల్‌కు దిగడం గమనార్హం. నెల మామూళ్లు ఇవ్వకపోతే మేమే మిమ్మల్ని ఇరికిస్తామంటూ బెదిరింపులకు దిగడం ఇటీవల విశాఖ జిల్లాలో మధురవాడ సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయ ఘటనే నిదర్శనంగా నిలుస్తోంది.

జిల్లాలో 12 ‘ ఏ’ కేటగిరీ కార్యాలయాలు
జిల్లాలో 32 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలు, చిట్‌ కార్యాలయం, ఆడిట్‌ కార్యాలయం, డీఐజీ కార్యాలయంతోపాటు కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాలున్నాయి. వీటిలో సబ్‌ రిజిస్ట్రార్లు కేటగిరి విభజన ఈ విధంగా ఉంది. సబ్‌ రిజిస్ట్రార్లు  ఏ– కేటగిరీ కార్యాలయాలు 12 ఉండగా, బి–కేటగిరీ కార్యాలయాలు 14 , సి–కేటగిరీ కార్యాలయాలు 8 ఉన్నాయి. సీసీ కెమెరాలు ఏర్పాటును దశలవారీగా ముందుగా ఏ– కేటగిరీ కార్యాలయాల్లో, డీఐజీ, కాకినాడ, రాజమహేంద్రవరం జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు. అనంతరం బి–కేటగిరీ, సి–కేటగిరీల్లో ఏర్పాటుకు రంగం  సిద్ధం చేస్తున్నారు. సీసీ కెమెరాలు ఏర్పాటైతే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో అవినీతి అంతమవుతుందని భావిస్తున్నారు.

ఆదేశాలు అందిన వెంటనే అమలు చేస్తాం
ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు వచ్చిన వెంటనే సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సీసీ కెమెరాలు ఏర్పాటు కారణంగా ఉద్యోగులకు, ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాలలో రికార్డులు భద్రత వలయంలో ఉంటాయి. రికార్డులు తారుమారయ్యే అవకాశం ఉండదు.
–  టి.సరోజ, డిప్యూటీ ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ (డీఐజీ), స్టాంప్‌ అండ్‌రిజిస్ట్రేషన్‌ శాఖ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement