అవినీతి ఆరోపణలుఎదుర్కొంటున్న కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావు, లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యాలయం
సాక్షి, రాజానగరం: ప్రజలు కట్టిన పన్నుల సొమ్ము ఏకంగా కోటి రూపాయలకు పైగా ఓ పంచాయతీ కార్యదర్శి స్వాహా చేసిన వైనం రాజానగరం మండలం లాలాచెరువు పంచాయతీలో తాజాగా బయటపడింది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో సకాలంలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రత్యేకాధికారుల పాలన సాగింది. దీంతో పంచాయతీ కార్యదర్శులు ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. అవినీతికి అలవాటు పడిన కొంతమంది కార్యదర్శులు ప్రజలు చెల్లించిన వివిధ రకాల పన్నులను ఆయా పంచాయతీలకు జమ చేయకుండా తమ జేబుల్లో వేసుకుని బొక్కేశారు.
ఈ తరహాలోనే జిల్లాలోని లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీలో పంచాయతీ కార్యదర్శి వెంకటేశ్వరరావు గుట్టుగా చేసిన అక్రమం తాజాగా బయటపడింది. సుమారు రూ.ఒక కోటీ ఆరు లక్షల వరకూ అవినీతికి పాల్పడిన ఆ ఉద్యోగికి పలుమార్లు జారీ చేసిన షోకాజ్ నోటీసుల ద్వారా వచ్చిన సమాచారం ప్రకారం ప్రాథమికంగా రూ.57,27,354 దుర్వినియోగమైనట్టు గత నెల 20న తుది నివేదికను తయారు చేసి ఉన్నతాధికారులకు అందజేశారు. వివరాల్లోకి వెళ్తే... రాజానగరం మండలం లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీకి పంచాయతీ కార్యదర్శిగా పని చేసిన దాసరి వెంకటేశ్వరరావు జూలై 2019లో కడియం మండలం, కడియపులంక పంచాయతీకి బదిలీపై వెళ్లారు.
ఇలా బదిలీ అయిన కార్యదర్శి తన స్థానంలో వచ్చిన కొత్త కార్యదర్శి భాస్కరరావుకు బాధ్యతలు అప్పగించడం పరిపాటి. కానీ వెంకటేశ్వర రావు ఆ విధంగా చేయకుండా నెలల తరబడి ఇదిగో వస్తా, అదిగో వస్తానంటూ కాలయాపన చేయడంతో అనుమానం వచ్చిన భాస్కరరావు విషయాన్ని పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రికార్డులను పరిశీలించాలని రాజమహేంద్రవరం డీఎల్‌పీఓ ఆదేశించడంతో పంచాయతీకి వచ్చిన నాటి నుంచి పూర్తి స్థాయిలో రికార్డులను భాస్కరావు పరిశీలించగా అక్రమాలు బయటపడ్డాయి. పంచాయతీకి ప్రజలు చెల్లించిన వాటర్ ట్యాక్స్, హౌస్ ట్యాక్స్‌ల ద్వారానే సుమారు రూ.1.06 కోట్ల అవినీతి జరిగినట్టుగా రికార్డుల ద్వారా తేలడంతో డీఎల్‌పీఓ ద్వారా జిల్లా పంచాయతీ అధికారి దృష్టికి తీసుకువెళ్లారు.
దీంతో 2014–15 నుంచి మొత్తం రికార్డులను పరిశీలించి నివేదిక ఇవ్వాలంటూ రాజానగరం ఈఓపీఆర్డీ ఆధ్వర్యంలో కోరుకొండ, కాతేరు పంచాయతీ కార్యదర్శులను బృందాలుగా నియమించారు. వారు చేసిన పరిశీలనలో రూ.84,12,916 ఖర్చులకు ఏవిధమైన రికార్డులు లేకపోవడంతో ఆ మేరకు దుర్వినియోగం జరిగినట్టు నిర్ధారణకు వచ్చారు. ఈ నేపథ్యంలో అవినీతికి పాల్పడిన వెంకటేశ్వరరావుకు సమాధానం చెప్పుకునేందుకు (సరి చేసుకునేందుకు) అవకాశం ఇవ్వడంతో రూ.26,85,562లకు బిల్లులు తీసుకువచ్చి అందజేశాడు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే రూ. 57,27,354 నికరంగా దుర్వినియోగమైందని విచారణ బృందం ఆగస్టు 20న రిపోర్టును తయారుచేసి జిల్లా పంచాయతీ అధికారికి అందజేసింది.
ఇక్కడే ఇంత... మరి అక్కడో...
నిందితుడు దాసరి వెంకటేశ్వరరావు లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్న సమయంలోనే దివాన్‌చెరువు పంచాయతీకి కూడా ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆదాయ వనరులు పరిమితంగా ఉండే లాలాచెరువు హౌసింగ్ బోర్డు పంచాయతీలోనే ఇంత అవినీతికి పాల్పడితే ఆదాయ వనరులు అపారంగా ఉన్న దివాన్‌చెరువు పంచాయతీలో ఏమేరకు అవినీతికి పాల్పడి ఉంటాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాక అతను లాలాచెరువుకు రాకముందు కోరుకొండ మండలం, గాడాల, బూరుగుపూడి పంచాయతీలలో కూడా కార్యదర్శిగా పనిచేశాడు. అక్కడ కూడా అతనిపై పలు అరోపణలున్నాయి. దీంతో ఈయనపై పూర్తి స్థాయిలో విచారణ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఆయా పంచాయతీల ప్రజలు కోరుతున్నారు.
అవినీతికి పాల్పడిన వారు ఎవరైనా శిక్షార్హులే
లాలాచెరువు హౌసింగ్ బోర్డు కాలనీ పంచాయతీ కార్యదర్శి దాసరి వెంకటేశ్వరరావుపై వచ్చిన అవినీతి ఆరోపణలు వాస్తవమేనని, అందుకు సంబంధించిన నివేదికను జిల్లా అధికారులకు కూడా అందజేశామని రాజమహేంద్రవరం డివిజనల్ పంచాయతీ అధికారి జె.సత్యనారాయణ తెలిపారు. అతను స్వాహా చేసిన ప్రజల సొమ్ములను రికవరీ చేయడంతో అతనిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయన్నారు. అంతేకాక అతను ఇన్‌చార్జిగా పనిచేసిన దివాన్‌చెరువు పంచాయతీలో కూడా విచారణ జరిపేందుకు రెండు మూడు రోజుల్లోనే ఓ బృందాన్ని పంపిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment