సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు.
ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్‌కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.
చదవండి:
Comments
Please login to add a commentAdd a comment