Yeleru canal
-
సీఎం జగన్‌కు రుణపడి ఉంటా: ఆర్.నారాయణమూర్తి
సాక్షి, అమరావతి: ఏలేరు–తాండవ కాలువల అనుసంధానం పనులకు నిధులు మంజూరు చేయడం ద్వారా సీఎం జగన్.. రైతుల్లో సంతోషం నింపారని సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి కొనియాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు తూర్పుగోదావరి, విశాఖ జిల్లాల్లోని మెట్ట ప్రాంతాలను పట్టించుకోలేదన్నారు. కానీ సీఎం జగన్ ఆ ప్రాంతాలను సస్యశ్యామలం చేయడానికి ఏలేరు–తాండవ అనుసంధానం పనులు చేపట్టారని ప్రశంసించారు. ‘సాక్షి’తో నారాయణమూర్తి మాట్లాడుతూ.. గోదావరి నది ప్రవహించే తూర్పుగోదావరి జిల్లాలో 52 శాతం మెట్ట ప్రాంతమేనని చెప్పారు. ఏలేరు–తాండవను అనుసంధానం చేయడం ద్వారా సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజాతో కలిసి సీఎం జగన్‌కు ప్రతిపాదన చేయగా.. ఆయన వెంటనే ఆమోదించారని వివరించారు. ఈ అనుసంధానం ద్వారా తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడి, కోటనందూరు మండలాలు, విశాఖ జిల్లాలోని నాతవరం, నర్సీపట్నం, కోట ఊరుట్ల మండలాల ప్రజలతో పాటు తాను కూడా సీఎం జగన్‌కు రుణపడి ఉంటానన్నారు. ఈ పనులకు రూ.470 కోట్లు మంజూరు చేసేందుకు సహకరించిన మంత్రులు అనిల్ యాదవ్, కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. చదవండి: వైఎస్సార్ ఈఎంసీకి కేంద్రం పచ్చజెండా ప్రగతి పథంలో 'పల్లెలు'.. అభివృద్ధి పరుగులు -
మంచినీటికి ‘మహా’ కష్టం
అసలే వేసవి కాలం.. చుక్క నీటిని సైతం జాగ్రత్తగా ఒడిసిపట్టుకోవాల్సిన పరిస్థితి. ఉన్న నీటి వనరులతో ఈ ఎండాకాలాన్ని ఎలాగైనా గట్టెక్కించాలన్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులకు పుండు మీద కారం చల్లినట్టు ఏలేరు కాల్వకు పడిన గండి వల్ల నీటి సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాలువలో నీటి ప్రవాహం తగ్గకపోవడంతో గండి పూడ్చే పనుల్లో జాప్యం జరుగుతోంది. ఈ కారణంగా ఆది, సోమ వారాల్లో గ్రేటర్ పరిధిలో నీటి సరఫరాకు ఇబ్బందులు తప్పవని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. విశాఖసిటీ :ఏలేరు కాలువ ద్వారా నగర వాసుల వేసవి కష్టాలు గట్టెక్కుతాయని ఊపిరి పీల్చుకున్న మహా విశాఖ నగర పాలక సంస్థ అధికారులు.. ఇప్పుడు తలలు పట్టుకుంటున్నారు. అన్ని రిజర్వాయర్లూ ఖాళీ అయిపోవడంతో ఉన్న ఒకే ఒక్క వనరైన ఏలేరు నుంచి వస్తున్న నీటితో నగరంలో నీటి సరఫరాను జాగ్రత్తగా నిర్వహిస్తున్నారు. వర్షాకాలం వరకూ ఈ నీటితోనే ప్రజల అవసరాలు తీర్చాలని భావించిన జీవీఎంసీకి గండి రూపంలో అవరోధం ఎదురైంది. మాకవరపాలెం మండలం రాచపల్లి వద్ద గురువారం మధ్యాహ్నం ఏలేరు కాల్వకు పడిన గండి కారణంగా పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. రెండు రోజులుగా 220 ఎంజీడీల మంచినీరు వృథా అయ్యింది. అంటే.. విశాఖ ప్రజల తాగునీటి అవసరాలతో పాటు పారిశ్రామిక అవసరాలకు రెండు రోజుల పాటు వినియోగించే నీరంతా వృథాగా పోయింది. దీంతో పరిస్థితి ఒక్కసారి తల్లకిందులుగా మారింది. ఈ గండి వల్ల రాబోయే రోజుల్లో నీటి సరఫరా మహా కష్టంగా మారే ప్రమాదముంది. మరో గండి కొట్టినా.. రాచపల్లి వద్ద గండి పడి రోజున్నర గడిచినా నీటి ప్రవాహం తగ్గడం లేదు. దీంతో పూడ్చే పనులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. వరద నీటిని తగ్గించేందుకు గండి పడిన చోటుకు 200 మీటర్ల దూరంలో కొండల అగ్రహారం వద్ద గురువారం సాయంత్రం అధికారులు మరో గండి కొట్టారు. శుక్రవారం సాయంత్రం గడిచినా.. ప్రవాహం ఏ మాత్రం తగ్గకపోవడంతో పనులు నిర్వహించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో నర్సీపట్నం సమీపంలో శుక్రవారం సాయంత్రం మరో గండి కొట్టి నీటిని దారిమళ్లించారు. రాత్రివరకు పనులు ప్రారంభం అయ్యే అవకాశం కనిపించలేదు. ఏలేశ్వరం నుంచి 153 కిలోమీటర్ల దూరంలో గండి పడటంతో ఈ 153కిమీ పొడవునా ఉన్న కాల్వలో నీరు పూర్తిగా పోయేందుకు కొంత సమయం పడుతుందని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం ఈఈ రాజారావు తెలిపారు. రాచపల్లి వద్ద తాటి దుంగలు వేసి ప్రవాహాన్ని ఆపే ప్రయత్నం చేశామన్నారు. అయితే 30 మీటర్ల మేర గండి పడటంతో మధ్యాహ్నం సమయంలో పూడ్చే పని చేసినా అది కూడా వరద ఉధృతికి కొట్టుకుపోయిందని వెల్లడించారు. దీంతో పనులు పూర్తిగా నిలిపేశామన్నారు. నీటి ప్రవాహం గురువారం అర్ధరాత్రికి తగ్గే అవకాశాలున్నట్లు అంచనా వేస్తున్నామని, ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాజారావు వివరించారు. రెండు మూడు రోజులు కష్టమే శుక్రవారం రాత్రి ఏ సమయానికైనా వరద ఉధృతి తగ్గిపోయే ప్రమాదం ఉండటంతో.. గండి పూడ్చేందుకు అవసరమైన యంత్రాంగాన్ని జీవీఎంసీ అధికారులు సిద్ధం చేశారు. కావాల్సిన మట్టి, ఇతర సరంజామాను సిద్ధంగా ఉంచి ప్రవాహం తగ్గిన వెంటనే పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. శనివారం మధ్యాహ్నం నాటికి మూడు గండ్లూ పూడ్చేయ్యాలని భావిస్తున్నారు. శనివారం సాయంత్రం పురుషోత్తపట్నం నుంచి నీటిని విడుదల చేసినా.. నగరానికి చేరుకునే సమయానికి రెండు మూడు రోజులు పట్టే అవకాశం ఉంది. ఆ నీరు వచ్చేంతవరకూ నగరంలో మంచినీటి సరఫరాకు ఆస్కారమే లేదు. అంటే.. నగరానికి ఆదివారం నుంచి నీటి సరఫరా రెండు మూడు రోజుల పాటు నిలిచిపోయే ప్రమాదముందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
ఏలేరు.. బేజారు
సాక్షి, విశాఖపట్నం : తాగునీటి సరఫరా జీవీఎంసీకి తలనొప్పిగా తయారయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింత జఠిలమయ్యేలా ఉంది. ప్రస్తుతం ఏలేరు కాల్వ నుంచి రోజూ 250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఇందులో 200 క్యూసెక్కులు ఏలేరు జలాశయం నుంచి వస్తోంది. మిగిలిన 50 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి పంప్ చేస్తూ కాటేరు వద్ద ఏలేరు కాల్వలోకి వదులుతున్నారు. లీకులు మినహాయిస్తే నగరానికి సుమారు 65-68 మిలియన్ గ్యాలన్లు చేరుతోంది. పంపింగ్ కోసం ఒక మోటారును వాడుతున్నారు. దీనికి నెలకు రూ.కోటి వరకు విస్కో(విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ)పై భారం పడుతోంది. సాగునీటి మళ్లింపు జరిగితే మిగిలిన పంపుల్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలి. అంటే మరింత ఆర్ధిక భారం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో నీరు లేని ఏలేరుపై మరోపక్క తూర్పు గోదావరి జిల్లాలో సాగునీటి కోసం ఒత్తిడి వస్తోంది. సాగునీటి సరఫరాను పెంచితే నగరానికి తాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవు. తాజాగా సర్కారు ఆదే శాల మేరకు స్టీల్‌ప్లాంట్‌కు నీటి కేటాయింపు పెంచుతామని జీవీఎంసీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 30 ఎంజీడీల నీటిని స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తోంది. మంగళవారం నగరానికి ఏలేరు కాల్వ ద్వారా 65.5 ఎంజీడీల నీరు చేరగా అందులో స్టీల్‌ప్లాంట్‌కు 29 ఎంజీడీలు, జీవీఎంసీకి 27 ఎంజీడీలు, ఎన్టీపీసీకి 7.28 ఎంజీడీలు, ఏపీఐఐసీకి 2.2 ఎంజీడీలు కేటాయించారు. గోదావరి నుంచి మరో మోటారును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కూడా వీల్లేని పరిస్థితి. ఏలేరు కాల్వ ద్వారా 250 క్యూసెక్కులకు మించి సరఫరా జరిగే పరిస్థితిలేదు. ఇప్పటికే ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ గండ్లు పడి నీరు వృధా అవుతోందని అధికారులు చెప్తున్నారు.