సాక్షి, విశాఖపట్నం : తాగునీటి సరఫరా జీవీఎంసీకి తలనొప్పిగా తయారయింది. రానున్న కాలంలో పరిస్థితి మరింత జఠిలమయ్యేలా ఉంది. ప్రస్తుతం ఏలేరు కాల్వ నుంచి రోజూ 250 క్యూసెక్కుల నీరు సరఫరా అవుతోంది. ఇందులో 200 క్యూసెక్కులు ఏలేరు జలాశయం నుంచి వస్తోంది. మిగిలిన 50 క్యూసెక్కుల నీటిని గోదావరి నుంచి పంప్ చేస్తూ కాటేరు వద్ద ఏలేరు కాల్వలోకి వదులుతున్నారు. లీకులు మినహాయిస్తే నగరానికి సుమారు 65-68 మిలియన్ గ్యాలన్లు చేరుతోంది.
పంపింగ్ కోసం ఒక మోటారును వాడుతున్నారు. దీనికి నెలకు రూ.కోటి వరకు విస్కో(విశాఖ ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ)పై భారం పడుతోంది. సాగునీటి మళ్లింపు జరిగితే మిగిలిన పంపుల్ని కూడా వినియోగంలోకి తీసుకురావాలి. అంటే మరింత ఆర్ధిక భారం పెరుగుతుంది. ఆశించిన స్థాయిలో నీరు లేని ఏలేరుపై మరోపక్క తూర్పు గోదావరి జిల్లాలో సాగునీటి కోసం ఒత్తిడి వస్తోంది. సాగునీటి సరఫరాను పెంచితే నగరానికి తాగునీటి ఇక్కట్లు తప్పేలా లేవు.
తాజాగా సర్కారు ఆదే శాల మేరకు స్టీల్‌ప్లాంట్‌కు నీటి కేటాయింపు పెంచుతామని జీవీఎంసీ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం 30 ఎంజీడీల నీటిని స్టీల్‌ప్లాంట్‌కు కేటాయిస్తోంది. మంగళవారం నగరానికి ఏలేరు కాల్వ ద్వారా 65.5 ఎంజీడీల నీరు చేరగా అందులో స్టీల్‌ప్లాంట్‌కు 29 ఎంజీడీలు, జీవీఎంసీకి 27 ఎంజీడీలు, ఎన్‌టీపీసీకి 7.28 ఎంజీడీలు, ఏపీఐఐసీకి 2.2 ఎంజీడీలు కేటాయించారు. గోదావరి నుంచి మరో మోటారును వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కూడా వీల్లేని పరిస్థితి. ఏలేరు కాల్వ ద్వారా 250 క్యూసెక్కులకు మించి సరఫరా జరిగే పరిస్థితిలేదు. ఇప్పటికే ఎంత అప్రమత్తంగా ఉన్నా అక్కడక్కడ గండ్లు పడి నీరు వృధా అవుతోందని అధికారులు చెప్తున్నారు.
ఏలేరు.. బేజారు
Published Wed, Aug 6 2014 11:23 AM | Last Updated on Sat, Sep 2 2017 11:28 AM
Advertisement