సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ఒక వైపు పచ్చని తూర్పు కనుమలు.. మరోవైపు నీలి సముద్రపు అలలతో అందంగా కనిపించే వాల్తేరు నగరం మరింత సుందరంగా రూపుదిద్దుకోనుంది. గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) పరిధిలోని సగం నగరం అందమైన నందనవనంగా ముస్తాబవనుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 642 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన జీవీఎంసీ పరిధిలో 50 శాతం గ్రీనరీ ఏర్పాటుకు అన్ని వీధుల్లో నీడనిచ్చే చెట్లను నాటనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ ద్వారా జీవీఎంసీ సర్వే చేస్తోంది.
98 వార్డుల్లో వార్డు ఎమినిటీస్ సెక్రటరీలకు సర్వే బాధ్యత అప్పగించారు. వారి పరిధిలోని 30, 40, 60, 80, 100 ఫీట్ల రోడ్లపై ఎక్కడెక్కడ చెట్లను పెంచే అవకాశం ఉందో సర్వే చేస్తున్నారు. ఇప్పటికే 400 చదరపు కిలోమీటర్ల మేర సర్వే పూర్తయినట్లు సమాచారం. దాదాపు 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల వెంట 6 వేల చెట్లను నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.
‘గ్రీనరీ మై స్ట్రీట్’ కాన్సెప్ట్‌తో..
వాస్తవానికి హుద్‌హుద్‌కు ముందు విశాఖ నగరంలో 44 శాతం మేర పచ్చదనం ఉండేది. హుద్ హుద్ తర్వాత 14 శాతానికి పడిపోయింది. కొద్దికాలంగా జీవీఎంసీ తీసుకుంటున్న చర్యలతో గ్రీన్ కవరేజ్ 35 శాతానికి చేరుకుంది. 10 లక్షల జనాభా దాటిన నగరాల్లో పచ్చ దనంలో దేశంలోనే మొదటిస్థానంలో ఉన్న విశాఖ.. 50 శాతం గ్రీనరీ లక్ష్యాన్ని చేరుకుంటే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ పచ్చదనం ఉన్న నగరంగా రికార్డు సృష్టించనుంది. ఇందుకోసం ‘గ్రీనరీ మై స్ట్రీట్’ పేరుతో జీవీఎంసీ పచ్చదనం పెంపునకు చర్యలు చేపట్టింది. రహదారులతో పాటు వివిధ సంస్థల కార్యాలయాలు, ఖాళీ ప్రదేశాల్లో కూడా మొక్కలను నాటేందుకు సిద్ధమవుతోంది.
ప్రపంచంలోనే నెంబర్ వన్ గ్రీన్ సిటీగా..
ప్రపంచవ్యాప్తంగా సింగపూర్ (45 శాతం) తర్వాత విశాఖ నగరంలోనే పచ్చదనం ఎక్కువగా ఉంది. ప్రస్తుతం 35 శాతం ఉన్న పచ్చదనాన్ని వచ్చే ఏడాది కాలంలో 40 శాతానికి పెంచేలా జీవీఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. నిర్ణీత లక్ష్యం మేరకు 50 శాతం గ్రీనరీ ఏర్పాటైతే ప్రపంచంలోనే మొదటి స్థానంలో విశాఖ నగరం నిలవనుంది. తద్వారా 2 డిగ్రీల సెల్సియస్ మేర వేసవి తాపం కూడా తగ్గుతుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
పందిరి తరహాలో..
ఏదో ఒక తరహా మొక్కలను కాకుండా.. పందిరి తరహాలో చెట్టు పెనవేసుకునిపోయేలా ఉండేలా జీవీఎంసీ జాగ్రత్తలు తీసుకుంటోంది. ఇందుకోసం 30, 40 అడుగుల రోడ్ల వెంట ఇండియన్ చెర్రీ, టీ కోమా వెరైటీస్, పారిజాతం వంటి మొక్కలను నాటనున్నారు. 80, 100 ఫీట్ల రోడ్లలో మాత్రం నిమ్మ, వేప, బాదం, నిద్ర గన్నేరు వంటి మొక్కలను నాటనున్నారు.
అయితే, రోడ్డుకు ఒక వైపు నాటే ఈ మొక్కలు ఏపుగా పెరగడంతో పాటు రోడ్డుకు ఆవలి వైపు వరకు కొమ్మలు విస్తరించి రహదారి మొత్తం నీడనిస్తాయి. ప్రధానంగా వేసవి కాలంలో ప్రయాణికులకు చలువ పందిళ్ల తరహాలో ఎండ నుంచి రక్షణ కలి్పస్తాయని జీవీఎంసీ అధికారులు పేర్కొంటున్నారు. ఇప్పటికే నగరంలోని దయాళ్‌నగర్ వంటి ప్రాంతాల్లో పందిరి తరహా గ్రీనరీని జీవీఎంసీ అభివృద్ధి చేసింది. నగరంలోని మిగతా రోడ్లలోనూ ఈ పందిళ్లతో నగరం పచ్చదనంతో కళకళలాడనుంది.
గ్రీనరీ కోసం ప్రత్యేక కార్యక్రమం
విశాఖ నగరంలో 50 శాతం గ్రీనరీ లక్ష్యంగా ప్రత్యేక కార్యక్రమం చేపట్టాం. ఇందుకోసం వార్డుల వారీగా ఎమినిటీస్ సెక్రటరీల సహాయంతో 1,697 కిలోమీటర్ల మేర రోడ్ల సర్వే పూర్తి చేశాం. ఆ ప్రాంతాల్లో 6 వేల మొక్కలను నాటేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ కసరత్తు నిరంతరం జరుగుతుంది. రానున్న ఏడాది కాలంలో 40 శాతం గ్రీనరీ లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ తర్వాత దీనిని 50 శాతానికి పెంచి, పచ్చదనంలో విశాఖను ప్రపంచంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు కృషి చేస్తున్నాం.
– సాయికాంత్ వర్మ, జీవీఎంసీ కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment