స్పేస్‌ ఎక్స్‌లో తొలి తెలుగమ్మాయి | SpaceX Executive Human Spaceflight Sita Sonty Special Story | Sakshi
Sakshi News home page

స్పేస్‌ ఎక్స్‌లో తొలి తెలుగమ్మాయి

Published Mon, Dec 7 2020 8:34 AM | Last Updated on Mon, Dec 7 2020 12:31 PM

SpaceX Executive Human Spaceflight Sita Sonty Special Story - Sakshi

పదిహేనుసార్లు మారథాన్‌ రన్‌.. పదిభాషల్లో ప్రావీణ్యం.. ఎనిమిది దేశాల్లో అమెరికన్‌ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్‌ యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్‌ ఎక్స్‌’ మిషన్‌ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో ‘సాక్షి’ సంభాషించింది.

‘మా అమ్మాయి అమెరికాలోనే పుట్టినా భారతీయ సంప్రదాయాన్ని విడిచి పెట్టలేదు. పదహారు సంవత్సరాలు వచ్చేవరకు పూర్తి తెలుగుదనంతోనే పెంచాను. కాలేజీలలో చేరాక వారి దారిని వారు ఎంచుకున్నా కూడా తెలుగుని విడవలేదు’ అంటారు సీత తల్లి శారదాపూర్ణ శొంఠి. తండ్రి శ్రీరామ్‌ శొంఠిది తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం. ఆంధ్ర యూనివర్సిటీలో ఎంబిబిఎస్‌ చదివారు. హైదరాబాద్‌లోని ఎల్వీ ప్రసాద్‌ ఐ ఇనిస్టిట్యూట్‌ సహ వ్యవస్థాపకులు కూడా. 1975లో అమెరికా వలస వెళ్ళారు. తల్లి శారదాపూర్ణ శొంఠి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో తెలుగు ఎంఏ చేశారు. తెలుగులో అన్నమాచార్య నృత్య సంగీత కళాభిజ్ఞత మీద, సంస్కృతంలో లక్షణ గ్రంథాల మీద పరిశోధన చేశారు.

విలక్షణంగా చెప్పటం వల్లనే...
అమెరికాలోని ప్రఖ్యాత ఆమెహెస్ట్‌ కాలేజీలో అండర్‌ గ్రాడ్యుయేషన్‌కి చేరడానికి వెళ్ళినప్పుడు ఎందుకు ఇక్కడ చేరాలనుకుంటున్నావు అని సీతను ప్రశ్నించారు. ‘మా అమ్మనాన్నలు నన్ను డాక్టర్‌ లేదా ఇంజనీర్‌ చదివించాలనుకుంటున్నారు. నాకు ఏదైనా విభిన్నంగా చేయాలని ఉంది. అందువల్ల డిఫరెంట్‌ ఫీల్డ్‌ ఏదో మీరే సజెస్ట్‌ చేయండి. ఏదైనా కొత్తగా సాధించాలనుకుంటున్నాను’ అని సీత చెప్పిన సమాధానం అధ్యాపకులను ఆకట్టుకుంది. ఆమెకు ఆ కాలేజీలో ప్రవేశం లభించింది. పొలిటికల్‌ ఎకనామిక్స్‌లో అండర్‌ గ్రాడ్యుయేషన్‌ చేశాక స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో పనిచేయాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఆమె ఆసక్తిని తెలుసుకున్న ప్రొఫెసర్‌ ‘మిడిల్‌ ఈస్ట్‌లో రాజకీయాలనూ అక్కడి పరిస్థితులను అధ్యయనం చెయ్‌. అధ్యయనం తేలికగా ఉండడానికి అరబిక్‌ నేర్చుకోమ’ని సలహా ఇచ్చారు. వారి సూచన మేరకు సీత తెలుగు, హిందీ, ఫ్రెంచ్, అరబిక్‌... మొత్తం పది భాషలు నేర్చుకున్నారు.

తల్లిదండ్రులు, సోదరి, పిల్లలతో సీత

తొలి తెలుగమ్మాయి
స్కూల్‌ ఫర్‌ అడ్వాన్స్‌డ్‌ ఇంటర్నేషనల్‌ స్టడీస్‌ (ఎస్‌ఏఐఎస్‌)లో మాస్టర్స్‌ డిగ్రీ పూర్తి చేశాక స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌లో చేరారు. ఆ డిపార్ట్‌మెంట్‌లో ఎంపికైన మొట్టమొదటి తెలుగమ్మాయి సీత. ఈజిప్టు, లిబియా, సిరియా, క్రొయేషియా, లెబనాన్, ఆఫ్రికా, ఆప్ఘనిస్థాన్‌ వంటి దేశాలలోని అమెరికన్‌ ఎంబసీలలో పని చేశారు సీత. చిన్నప్పటి నుంచి అడ్వెంచరస్‌గా ఉండటం సీతకు ఇష్టం. ‘ఆ సాహసమే సీతను అత్యున్నత స్థాయికి చేర్చింది’ అంటారు ఆమె తండ్రి.

యుద్ధ సమయంలో ఇరాక్‌లోనే..
ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో గ్రీన్‌ జోన్‌లో అంటే కంటోన్మెంట్‌ ఏరియాలో సైనికులతో పాటు బంకర్ల దగ్గర పని చేశారు సీత. అమెరికా–ఇరాక్‌ యుద్ధ సమయంలో యుద్ధంలో మరణించిన 150 మందికి మణికట్టుకి బ్యాండ్‌ కట్టి, వారి వివరాలను అమెరికాకు తెలియచేశారు సీత. అప్పుడు ఆమెకు 22 సంవత్సరాలు. సీత అన్ని రకాల యుద్ధ విద్యలతోపాటు ఏకే 47 కాల్చడంలో కూడా శిక్షణ పొందారు. లిబియాలో గడాఫీ మరణించిన సమయంలో సీత అక్కడే ఉన్నారు. ‘అప్పటికి మా అమ్మాయికి ఇద్దరు పిల్లలు. బాగా చిన్నవాళ్లు కావటంతో నేను కూడా సీతతో పాటు అన్ని దేశాలు తిరిగాను. ఆమెకు సహాయంగా ఉన్నాను. ఆ సమయంలో అమ్మాయి చూపిన ధైర్యం చూసి నాకు ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది’ అన్నారు శారదా శొంఠి.

పిల్లలు ఇద్దరు...
సీతకు ఇద్దరు పిల్లలు. జయరామ్, ఆనంద. పిల్లల్ని చూసుకుంటూ ఆమె వృత్తిలో పురోగతి సాధిస్తున్నారు. ఆమెకు వంట కూడా బాగా వచ్చు. ఏ పదార్థాన్ని ఎంత, ఎలా తినాలి అనే విషయంలో అమితమైన శ్రద్ధ. పిల్లలకూ తానే వండి పెడతారు. ప్రతి ఆదివారం దేవాలయానికి తీసుకువెడతారు. పిల్లలు తెలుగు బాగా మాట్లాడతారు.

స్పేస్‌ ఎక్స్‌ లాంచింగ్‌ స్టేషన్‌ వద్ద సీత

సంగీత, నాట్య ప్రదర్శనలు
సీత, సోదరితో కలిసి ఉమా రామారావుగారి వద్ద నాట్యం, నేదునూరి కృష్ణమూర్తిగారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు. భారతీయ సంగీతం, పాశ్చాత్య సంగీతం, నాట్యం నేర్చుకుని ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలిచ్చారు. వరల్డ్‌ రెలిజియన్‌ కాన్ఫరెన్స్‌లో దలైలామా ముందు వేదమంత్రాలకు అనుగుణంగా నర్తించారు. శొంఠి సిస్టర్స్‌ పేరుతో భారతదేశంలో కూచిపూడి ప్రదర్శనలు ఇచ్చారు.

మానస సరోవర్‌ నీళ్లు – గాంధీకి అభిషేకం
సీత ఒకసారి మానస్‌ సరోవర్‌కి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ళ బృందంలో ఉన్న 70 సంవత్సరాల పెద్దాయన అక్కడ అకస్మాత్తుగా కన్ను మూశారు. వెంటనే సీత ఆయన భౌతిక కాయాన్ని కిందకు తీసుకువచ్చి, దహనక్రియలు పూర్తిచేసి మళ్లీ మానస్‌ సరోవర్, కైలాస్‌గిరి దర్శించుకున్నారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు తల్లిదండ్రుల కోసమని ఒక గ్యాలన్‌ నీళ్లు తీసుకువచ్చారు. చికాగోలో గాంధీ విగ్రహం ప్రతిష్ఠించినప్పుడు ఈ నీటితోనే అభిషేకించారు.

పదిహేనుసార్లు మారథాన్‌ రన్‌.. పదిభాషల్లో ప్రావీణ్యం..
ఎనిమిది దేశాల్లో అమెరికన్‌ ఎంబసీల్లో కొలువు.. కూచిపూడి, భరతనాట్య ప్రదర్శనలు... కర్ణాటక సంగీత కచేరీలు... 22 ఏళ్ళకే ఇరాక్‌  యుద్ధ బంకర్లలో పని.. అమెరికాలో ఉంటూ ఇవన్నీ చేసి ఘనత సాధించారు సీత శొంఠి. ఆమె తెలుగు మహిళ. కోనసీమ మూలవాసి. ఇప్పుడు ప్రతిష్టాత్మక ‘స్పేస్‌ ఎక్స్‌’ మిషన్‌ హెడ్‌గా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమెరికాలోని చికాగో లో ఉంటున్న సీత తల్లిదండ్రులతో సంభాషించింది.
– సంభాషణ: డాక్టర్‌ పురాణపండ వైజయంతి

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement